
ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిపోయిన విద్యార్థులు
పడిపోయిన ప్రవేశాలు.. ఉన్నవారు టీసీలు తీసుకుపోతున్న వైనం
2024లో ప్రభుత్వ స్కూళ్లలో 37.10 లక్షల మంది విద్యార్థులు
ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో 32.46 లక్షల మందే
కూటమి సర్కారు ఏడాది పాలనలో 4.64 లక్షల మంది తగ్గుదల
విద్యపై వికటించిన ప్రయోగాలు.. నమ్మకం కోల్పోయిన పిల్లలు, తల్లిదండ్రులు
వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. దీంతో ఎన్‌రోల్‌మెంట్ ఎలాగైనా పెంచాలని టీచర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
కాకినాడ జిల్లా రౌతులపూడి మండల కేంద్రంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో గతేడాది 80 మంది విద్యార్థులుండగా దాన్ని ఎంపీఎస్‌గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోవడంతో అక్కడ ఎన్‌రోల్ 43కి పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్‌లో కూడా ఎన్‌రోల్‌మెంట్ 60 నుంచి 33కి తగ్గిపోయింది.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దిగజారిపోయింది! ఒక్క ఏడాదిలో ప్రవేశాలు భారీగా తగ్గిపోయాయి. మరోపక్క ఉన్న విద్యార్థులు సైతం టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిపోతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే సర్కారు బడులకు ఈ గడ్డు పరిస్థితులు ఎదురు కావడం గమనార్హం.
2024లో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు 37.10 లక్షల మంది ఉండగా ఇప్పుడు భారీగా తగ్గిపోయారు. ఈ ఏడాది జూలై 4వతేదీ నాటికి 32.46 లక్షల మందికి విద్యార్థుల సంఖ్య పడిపోయింది. అంటే ప్రభుత్వ స్కూళ్లలో ఏడాదిలో ఏకంగా 4.64 లక్షల మంది తగ్గిపోయారు.
అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులుండగా.. విద్యా సంవత్సరం ప్రారంభమైన 19 రోజుల్లోనే 1.90 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోవడం దిగజారిన ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తోందని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దలు విద్యా వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించారో చెప్పేందుకు ఇది చాలదా? ఇంతకంటే ఏం రుజువు కావాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు’ కార్యక్రమాన్ని కక్షపూరితంగా నిలిపి వేయడం.. ఇంగ్లీషు మీడియం రద్దు.. సబ్జెక్టు టీచర్లు కాన్సెప్ట్‌కు మంగళం.. సీబీఎస్‌ఈ, ఐబీ విధానం ఔట్... టోఫెల్ శిక్షణ ఎత్తివేత.. ట్యాబ్‌లు నిలిపివేత.. డిజిటల్ తరగతులకు చెదలు.. ఐరాసను సైతం మెప్పించిన ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాణాలు దిగజారడం.. బాబు ‘బొద్దింక భోజనం’లా మారిపోయిన గోరుముద్ద లాంటివన్నీ చంద్రబాబు సర్కారు దాదాపు ఐదు లక్షల మంది పిల్లలను సర్కారు చదువులకు దూరం చేసేందుకు కారణమయ్యాయని విశ్లేషిస్తున్నారు.
ఏడాదిలో తారుమారు..
బాబు ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణలన్నింటినీ కక్షగట్టినట్లుగా రద్దు చేసింది. మనబడి నాడు–నేడు పనులను నిలిపివేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై బాబు సర్కారు చేసిన ప్రయోగాలన్నీ వికటించాయి. దీంతో ఈ ఏడాది 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు భారీగా ప్రైవేట్ విద్యాసంస్థల బాట పట్టారు. వీరిలో అత్యధికులు టీసీలు తీసుకుని వెళ్లిపోయిన వారేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఆగస్టు చివరి నాటికి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో ప్రభుత్వ బడులను విద్యా సంస్కరణలతో ఉన్నతంగా తీర్చిదిద్ది సర్కారు చదువులపై నమ్మకాన్ని పెంచితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాది కాలంలో మొత్తం పరిస్థితిని తారుమారు చేసిందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
బడుల విలీనంతో...
మాజీ ముఖ్యమత్రి వైఎస్ జగన్‌పై అక్కసుతో ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒకొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారంలోకి వస్తూనే సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ విద్యను రద్దు చేసింది. 3–5 తరగతుల విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతోపాటు జీవో నం.117ను రద్దు చేసి 2025–26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులను తిరిగి ప్రాధమిక పాఠశాలల్లోకి తీసుకొచ్చింది.
కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. 60 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌మెంట్ ఉన్న ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కి.మీ పరిధి వరకు ఉన్న తక్కువ ఎన్‌రోల్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,600 మోడల్ ప్రైమరీ స్కూళ్లు (ఎంపీఎస్) ప్రవేశపెట్టింది.
ఇంటి పక్కనున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పిల్లలు ఇకపై 4–5 కి.మీ దూరంలోని స్కూల్‌కు ఒంటరిగా పంపించే ధైర్యం చేయలేక తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టమైనా స్కూలు బస్సులున్న ప్రైవేట్ బడుల్లో చేర్పించారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్లల్లో పిల్లలు సగానికి తగ్గిపోయారు.
నిర్వీర్యం చేస్తూ నిర్ణయాలు..
ప్రజాస్వామ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి, కానీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 2024 జూన్ 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరుసటి రోజు 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వచ్చిందే తడవుగా గత ప్రభుత్వం అమలు చేసిన విద్యా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను నిలిపి వేశారు.
16 రకాల పదార్థాలతో విద్యార్థులకు రుచికరంగా పౌష్టిక విలువలతో అందించిన జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకంగా పేరు మార్చేసి నాణ్యతను గాలికి వదిలేశారు. సన్నబియ్యం పేరుతో పురుగుల భోజనం పెడుతుండడంతో 50 శాతం మంది కూడా విద్యార్థులు తినలేని పరిస్థితి. బొద్దింకల భోజనంగా దీనిమార్చేశారు!
రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు రకాల మెనూ అందిస్తామని రూ.కోట్లు ఖర్చు చేసి ప్రయోగాలు చేసి సర్కారు చేతులెత్తేసింది. గత ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్లతో మనబడి నాడు–నేడు రెండో దశ పనులు ప్రారంభించారు. 20 వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టి దాదాపు 4 వేల స్కూళ్లలో పనులు పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన స్కూళ్లలో పనులను కూటమి ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసింది.
ఇక గతేడాది జూలైలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించి యూపీ స్కూళ్లల్లో స్కూల్ అసిస్టెంట్ బోధనను తొలగించింది. విద్యా ప్రమాణాల పెంపు కోసం 3–5 తరగతులకు గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సబ్జెక్టు టీచర్ విధానాన్ని రద్దు చేసింది. స్కూళ్ల విలీనంతో బోధనను బలహీనం చేసింది. ఇవన్నీ పిల్లలు, తల్లి దండ్రులకు నమ్మకం పోగొట్టాయి. సీఎం తన యుడు పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ పరిస్థితి ఇంత దయ నీయంగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వమే బ్రాండింగ్
‘పేదలకు ఉచిత విద్య అందించడం ప్రభుత్వం బాధ్యత కాదు.. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు... వాటిని కల్పించే పరిస్థితి లేదు... డబ్బున్నవారు ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవచ్చు.. అక్కడ ఇంగ్లిష్ మీడియం ఉంటుంది.. అన్నీ బాగుంటాయి..!’ అని గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. ఇటీవల నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో కూడా చంద్రబాబు ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను ఆకాశానికి ఎత్తేశారు.
చదువు రాకున్నా నారాయణ స్కూల్లో చదివితే అద్భుతంగా మారిపోతారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి ప్రైవేటు విద్యను నెత్తిన పెట్టుకోవడంతో కూటమి సర్కారు పాలనలో ప్రభుత్వ విద్య ప్రగతి కష్టమని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వం ‘షైనింగ్ స్టార్’ అవార్డులతో సత్కరించింది.
ఇందులో 4,168 పురస్కారాలు ప్రకటించగా వాటిల్లో 3 వేలకు పైగా ప్రైవేటు విద్యార్థులకే దక్కాయి. అంటే ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల కంటే ప్రైవేటు విద్యా సంస్థల్లోనే విద్యార్థులు అధిక మార్కులు సాధిస్తారని చెప్పినట్లైంది! వైఎస్ జగన్ హయాంలో విద్యా సంస్కరణలతో ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు పెరిగాయి.
దాంతో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు’ పేరుతో సత్కరించారు. రెండేళ్లపాటు అత్యధిక మార్కులు ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులే సాధించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో గతేడాది పదో తరగతి, ఇంటర్‌లో ప్రయివేటు స్కూళ్లు, కాలేజీల విద్యారులే ముందుండడంతో ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు నమ్మకం సన్నగిల్లి టీసీలు తీసుకుని ప్రైవేటు బాటపట్టారు.