
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ. 4,200 కోట్లు
రాష్ట్ర చరిత్రలో తొలిసారి ఏకంగా ఆరు క్వార్టర్లు పెండింగ్
ఫలితంగా అర్ధంతరంగా చదువు మానేస్తున్న విద్యార్థులు
దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు... బిడ్డల భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన
గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, చదువుల పట్ల కూటమి సర్కారు చిత్తశుద్ధి ఇదేనా అని నిలదీస్తున్న తల్లిదండ్రులు
వసతిదీవెన రూ. 2,200 కోట్లూ పెండింగ్‌లోనే..
మొత్తంగా రూ.6,400 కోట్లు బకాయిలు..
నిధుల విడుదల జాప్యంతో ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల నిర్వహణ దారుణం
తెలంగాణలో మాదిరిగా కోర్టుకెళ్లే యోచనలో ఇంజినీరింగ్ కళాశాల అసోసియేషన్?.. 80 శాతంపైగా కళాశాలలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారం
వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి త్రైమాసికం ఠంచన్‌గా చెల్లింపులు
ఐదేళ్లలో ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు
ఏ లోటు లేకుండా విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం
2024 జనవరి–మార్చి త్రైమాసికం ఫీజులు మేలో ఇవ్వాల్సింది
ఎన్నికల కోడ్ కారణంగా ఆగింది మొదలు ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విదల్చని చంద్రబాబు సర్కార్
ఫీజు రీయింబర్స్‌మెంట్...! ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివేలా చేసి జీవితంలో స్థిరపడేలా చేసిన గొప్ప పథకం..! మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా కాలేజీకి వెళ్లి ఏకాగ్రతతో పాఠాలు విని తమ లక్ష్యాలను సాధించిన విద్యార్థులు ఎందరో..? అయితే, కూటమి ప్రభుత్వంలో అలాంటి గొప్ప పథకానికి తూట్లు పడుతున్నాయి. మొండి బకాయిలతో.. యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతోంది. ఒకటీ, అర కాదు.. ఏకంగా ఆరు క్వార్టర్ల చెల్లింపులు పక్కనపెట్టింది.. చివరకు విద్యార్థులు విసుగెత్తి చదువు మానేసేలా చేస్తోంది..
సాక్షి, అమరావతి: ఏడాదికి పైగా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తాం.. అంటూ ఊరించి ఉసూరుమనిపించడం తప్ప కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు..! కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల విడుదల ఊసే లేదు..! ప్రభుత్వం కనీస కనికరం చూపకుండా.. తమ జీవితాలతో చెలగాటం ఆడుతుండడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నత విద్యకు భరోసా దక్కక దిగులు చెందుతున్నారు. దీంతో అర్థంతరంగా చదువులు మానేస్తున్నారు. ఇదంతాచూసి విద్యార్థుల తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదేనా? ఉన్నత విద్య పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి..?? అని నిలదీస్తున్నారు.
⇒ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసికం నిధులు ఆ ఏడాది మే నెలలో ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ కారణంగా అగిపోయింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అప్పటినుంచి ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క త్రైమాసికం (క్వార్టర్) కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వం నుంచి ఆరు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4,200 కోట్లు, విద్యార్థులకు హాస్టల్ మెయింటినెన్స్ (వసతి దీవెన) కింద మరో రూ.2,200 కోట్లు వెరసి రూ.6,400 కోట్లు బకాయిలు పేరుకుపోవడం గమనార్హం. వాస్తవానికి గత నెలలోనే ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ సమావేశంలో, ప్రభుత్వం స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ స్పందన కొరవడింది.
⇒ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చదువులతో పాటు హాస్టల్ వసతి దీవెన (మెయింటెనెన్స్) కింద ఆర్థిక సాయం చేసింది. ఏడాదికి రూ.1100 కోట్లు అందించింది. కూటమి ప్రభుత్వం వసతి దీవెన ఎత్తేసింది. విద్యార్థులకు రూ.2,200 కోట్లు బకాయి పెట్టింది.
నెలకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లు ఖర్చు
రాష్ట్రంలో 230 వరకు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వం కన్వీనర్ కోటా కింద మొత్తం సీట్లలో 70 శాతం భర్తీ చేస్తూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేస్తోంది. అంటే, కళాశాలల నిర్వహణ దాదాపు ప్రభుత్వం విడుదల చేసే నిధులపైనే ఆధారపడి ఉంది. కానీ, ఏడాదికి పైగా ప్రైవేటు కళాశాలలకు రావాల్సిన బకాయిలను మంజూరు చేయకుండా కూటమి సర్కారు తాత్సారం చేస్తోంది. ఫలితంగా ఒక్కో కళాశాలకు బకాయిలు కొండలా పేరుకుపోయాయి. చిన్న కళాశాలలకు రూ.6–10 కోట్లు, పెద్ద కళాశాలలకు రూ.40–60 కోట్ల వరకు పెండింగ్ కనిపిస్తున్నాయి. ఫలితంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.
⇒ ప్రైవేటు యాజమాన్యాల్లోని 20–30 శాతం కళాశాలలు మినహా.. మిగిలినవి ఏ పూటకు ఆ పూటే అన్న చందాన నిధుల కొరత ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఉద్యోగుల నెలవారీ జీతభత్యాలు, ఇతర నిర్వహణ కోసం చిన్న కళాశాలలు రూ.50 లక్షలు నుంచి పెద్ద కళాశాలలు రూ.3 కోట్లు వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతోపాటు కొండలా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చూస్తే యాజమాన్యాల గుండె బరువెక్కుతోంది. వడ్డీలకు అప్పులు తెచ్చి నడిపించాల్సి వస్తుండడం ఆర్థికంగా భారం అవుతోంది. సర్కారు నుంచి మొండిచేయి ఎదురవుతుండడంతో నిర్వహణ కుంటుపడుతోంది.
బాబ్బాబు కాస్త సర్దుకోరూ...!
ప్రభుత్వం న్యాయబద్ధంగా చెల్లించాల్సిన ఫీజు రీయిబర్స్‌మెంట్‌ను బకాయి పెట్టడంతో ప్రైవేటు కళాశాలలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిలో నడుస్తున్నాయి. చాలా కళాశాలల్లో 2–3 నెలల జీతాలు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొన్ని కాలేజీలైతే నెల జీతంలో కొంత మొత్తం చెల్లిస్తూ సర్దుకోండి అంటూ ఉద్యోగులను బతిమలాడుకునే పరిస్థితి. ఆర్థికంగా పరపతి ఉన్న కళాశాలలు అప్పు తెచ్చి ఉద్యోగులకు జీతాలిస్తున్నాయి.
⇒ కాలేజీలు ఇలా అప్పుల్లో నెట్టుకొస్తున్న తరుణంలో మారుతున్న సాంకేతిక అవసరాలను ఎంతవరకు అందిపుచ్చుకుంటాయన్నది ప్రశ్న. మార్కెట్‌కు అనుగుణంగా బోధన అందించకుంటే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తద్వారా ఒక తరం వెనుకబడిపోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి మాటంటే.. జరగదంట?
పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పూటకో మాట చెప్పుకొచ్చారు. పైసా ఖర్చు లేకపోవడంతో తన ఎక్స్ ఖాతాలో ట్వీట్లు చేస్తూ ప్రజలు, కళాశాలల యాజమాన్యాలను మభ్యపెడుతూ వచ్చారు. ఈ తంతు నిరుడు జూన్ నుంచి మొదలైంది. ఈ ఏడాది జూన్ వెళ్లిపోయినా బకాయిలు మాత్రం విడుదల కాలేదు.
⇒ గత నెలలో మంత్రిని కలిసిన కళాశాలల యాజమన్యాలకు జూలైలో కచ్చితంగా ఫీజు బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత జూలై 10న ఇస్తామన్నారు. ఇప్పుడు 20వ తేదీ దాటినా ఎక్కడా రూపాయి విడుదల కాలేదు. ఇదేంటని అడిగితే మరో నాలుగు రోజుల్లో నిధులు విడుదల చేస్తామని మళ్లీ చెబుతున్నారని ఇంజినీరింగ్ కళాశాలల అసోసియేషన్ వాపోతోంది. ఇక్కడ మంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి న్యాయం జరగకపోవడం గమనార్హం. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఓ పెద్ద ప్రహసనంగా మారింది.

ఇదీ మా గోడు...
‘‘ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి బకాయిలువిడుదల కావట్లేదు. కళాశాలల నిర్వహణ ముందుకు జరగట్లేదు. ఆర్థికంగా బలంగా ఉంటేనే కదా? నాణ్యమైన బోధనా సామర్థ్యాలను సమకూర్చుకుని విద్యార్థులకు మెరుగైన చదువు అందించగలం. డబ్బులు లేకుండా ఇవన్నీ ఎక్కడినుంచి తెస్తాం...? ఇంజనీరింగ్ కాలేజీ అంటే బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వట్లేదు. ఆస్తులు అమ్ముదామంటే మార్కెట్‌లో రేట్లు లేవు.
తాకట్టు పెట్టి తెద్దామంటే రూ.2–5 వరకు వడ్డీలు అవుతున్నాయి. ఇంకేం చేయాలి...?’’ అని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యజమాని వాపోయారు. ఇక్కడ ఒక్క ఇంజినీరింగ్ కళాశాలలే కాదు, అదే యాజమాన్యాల్లో డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. తమ పరిస్థితి ఇలా ఉండగా... ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల ఊసే ఎత్తకపోతుండడంతో ప్రైవేటు యాజమాన్యాలు భవిష్యత్తు కార్యాచరణ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఇదే అనుభవం ఎదురవగా అక్కడి ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. వాటికి అనుకూలంగా తీర్పులొచ్చాయి. ఈ స్ఫూర్తితో ఏపీలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు చెల్లింపులు
ఐదేళ్లలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు
జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లు జమ
⇒ 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచింది. 2017–19 వరకు నాటి టీడీపీ సర్కారు 16.73 లక్షల మంది విద్యార్థులకు రూ.1,778 కోట్లు బకాయిపెడితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్ల కాలంలో జగనన్న విద్యా దీవెన కింద రూ.12,609.68 కోట్లు ప్రతి త్రైమాసికానికి క్రమంతప్పకుండా చెల్లించి... ఏ లోటు లేకుండా కళాశాలలు సక్రమంగా నడిచేలా, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేలా ప్రోత్సహించింది.
⇒ ఇక జగనన్న వసతి దీవెన కింద రూ.4275.76 కోట్లను విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో వేశారు. ఇలా మొత్తం ఐదేళ్లలో ప్రభుత్వం ఉచిత ఉన్నత విద్యపై రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది.