అర్థంకాని రీతిలో సిలబస్, పరీక్షా విధానం
2012లో టెట్ పాసైన టీచర్లు సైతం మళ్లీ పరీక్ష రాయాలట
గందరగోళంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు
పరీక్షలు పెట్టే టీచర్లకే పెద్ద పరీక్షలా టెట్–2025
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు పెట్టి, వారి ప్రతిభా పాటవాలు అంచనా వేసే ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం పెద్ద పరీక్ష పెట్టింది. ఇటీవల డీఎస్సీ పరీక్షలను ఎంత గందరగోళంగా మార్చిందో.. అంతకంటే గందరగోళంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష ఏపీ టెట్–2025(అక్టోబర్)ను సైతం మార్చినట్టు కనిపిస్తోంది. పరీక్ష తీరుతెన్నులు, మార్కుల విధానం, నిబంధనలు అన్నీ సర్వీసులో ఉన్న టీచర్లను నోరెళ్లబెట్టేలా చేస్తున్నాయి.
డీఎస్సీ–2025 సక్రమంగా జరగలేదని అభ్యర్థులు ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో వారిని చల్లబరిచేందుకే అన్నట్టుగా మళ్లీ డీఎస్సీ ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అక్టోబర్ 24న జీవో 36తో మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇప్పటికే టెట్ షెడ్యూల్ ప్రకటించారు.
ఇందులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తీసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్‌ని తప్పనిసరి చేసింది. ఇతర రాష్ట్రాలు సుప్రీంతీర్పుపై అప్పీల్‌కు వెళుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం పరీక్షలకు వెళ్లడం ఒక ఎత్తయితే, టెట్ పరీక్ష విధానం, మార్కుల విభజన ఉపాధ్యాయులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
టెట్ పాసైనా మళ్లీ పరీక్ష రాయాల్సిందే
ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా 16 ఏప్రిల్ 2011న నాటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.51 విడుదల చేసింది. దీని ప్రకారం ఎన్‌సీటీఈ నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ (23.08.2010) నాటికి డీఎస్సీ లేదా అప్పటి నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి ‘టెట్’ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. కానీ.. తాజా ఉత్తర్వుల్లో ఈ అంశాన్ని తొలగించారు.
అలాగే, 2012లో టెట్ పాసై డీఎస్సీలో ఉపాధ్యాయులుగా చేరిన వారు సైతం తాజా నోటిఫికేషన్ ప్రకారం తిరిగి టెట్ రాసి ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొనడం విమర్శలకు దారితీస్తోంది. 2017కు ముందు టెట్‌లో లాంగ్వేజెస్, సాంఘికశాస్త్ర అభ్యర్థులకు ఒకే పేపర్ ఉండేది. ఇందులో ఉత్తీర్ణులై ఉద్యోగంలో కొనసాగుతున్నారు. 2017 తర్వాత ఈ రెండు విభాగాలకు వేర్వేరుగా టెట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో కామన్ పేపర్‌లో ఉత్తీర్ణులైన వారు సైతం ఇప్పుడు టెట్ ఉత్తీర్ణత సాధించాలని పేర్కొనడంతో ఉపాధ్యాయులు కంగుతింటున్నారు.
అర్థంకాని రీతిలో సిలబస్, పరీక్ష విధానం
ఇన్ సర్వీస్ స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించిన టెట్ సిలబస్ చూస్తే ఎన్నిసార్లు పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేని విధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఎవరికీ అర్థంకాని విధంగా సిలబస్ నిర్ణయించడంతో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు. పరీక్ష పేపర్ 150 మార్కులకు అయితే.. సబ్జెక్టుకు మాత్రం అతి తక్కువ మార్కులు కేటాయించడం గమనార్హం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పేపర్–2ఏ రాయాల్సి ఉంటుంది.
ఇందులో సైకాలజీ అండ్ పెడగాజీ (బోధన, అభ్యాసన శాస్త్రం), తెలుగు వ్యాకరణ అంశాలు, ఇంగ్లిష్ వ్యాకరణం అందరికీ కామన్. కంటెంట్‌ను పరిశీలిస్తే.. తెలుగు ఉపాధ్యాయులకు టెట్‌లో తెలుగు కంటెంట్, మెథడాలజీ కలిపి 60 మార్కులు కేటాయించారు. సోషల్ స్టడీస్ వారికి సోషల్ స్టడీస్ కంటెంట్, మెథడాలజీ 60 మార్కులకు ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్/ఫిజికల్ సైన్స్/బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టుల కంటెంట్, మెథడాలజీ కేవలం 20 మార్కులకు మాత్రమే ఇవ్వడం విస్తుగొల్పుతోంది.
పరిస్థితి మళ్లీ మొదటికొస్తుందనే ఆందోళన
గతంలో సోషల్ స్టడీస్, తెలుగు అభ్యర్థులు కామన్ టెట్ రాసి సర్వీసులోకి వచ్చారు. ఇప్పుడు వారు విడిగా సోషల్ స్టడీస్/తెలుగు మెథడాలజీతో టెట్ పాసవ్వాలని ప్రకటించారు. ఇదే క్రమంలో భవిష్యత్‌లో మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ లేదా బయోలాజికల్ సైన్స్ అభ్యర్థుల కోసం కూడా విడివిడిగా టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే మళ్లీ పరిస్థితి మొదటికొస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయులకు ఇప్పుడే సిలబస్‌లో మార్పులు చేయాలంటున్నారు.


