సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు
తక్షణం 100 శాతం ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం
ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు
మా చేతిలో ఏం లేదు.. సీఎంవో జాబితా ప్రకారమే ఇస్తున్నాం: అధికారులు
సాక్షి, అమరావతి: కూటమి సర్కారు దగాపై ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు కదంతొక్కారు. అధికారంలోకి రాగానే తమ బకాయిలు చెల్లించడమే కాక ఏ సంవత్సరం డబ్బులు ఆ సంవత్సరమే చెల్లిస్తామంటూ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడంపై మండిపడ్డారు. తమను విస్మరించి ప్రభుత్వంలోని కావాల్సినవారికి రాయితీలు విడుదల చేస్తుడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారం రోజులుగా మంగళగిరి ఏపీఐఐసీ భవనం దగ్గర ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం దిగిరాకపోవడంతో శుక్రవారం అమరావతిలోని సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణం బకాయిలు చెల్లించకుంటే ఈ నెలలో విశాఖపట్నంలో జరిగే పారిశ్రామిక సదస్సును బహిష్కరిస్తామని అల్టిమేటం జారీచేశారు. ప్రభుత్వ మోసాన్ని అంతర్జాతీయంగా తెలియజేస్తామని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
మాకు ఇవ్వకుండా టీడీపీ నేతలు చెప్పినవారికా?
ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ విధానాన్ని పక్కకుపెట్టి ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని టీడీపీ నేతలు సూచించినవారికి మాత్రమే రాయితీలు మంజూరు చేస్తుండడాన్ని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు తీవ్రంగా తప్పుబట్టారు. తమ బకాయిలు ఇవ్వకుండా అగ్రవర్ణాలకు చెందినవారికి 2025 సంవత్సర రాయితీలు ఏవిధంగా విడుదల చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీనిపై ప్రశ్నిస్తే సీఎంవో నుంచి వచ్చిన జాబితా ప్రకారమే ఇవ్వాలనే స్పష్టమైన ఆదేశాలున్నాయని అధికారులు చెబుతున్నారని వాపోయారు.
పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగు పులమడమే కాక, కొందరికే ప్రోత్సాహకాలు ఇస్తుండడాన్ని ప్రస్తావించారు. 3 నెలలుగా నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సీఎం చంద్రబాబు కావాలనే తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కరోనా సమయంలో పార్టీ, కులం చూడకుండా అన్ని చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలకు రాయితీలను ఇచ్చిందని గుర్తుచేశారు. చరిత్రలో తొలిసారిగా పర్సంటేజీ ప్రకారం విడుదల చేయడం తీవ్ర అన్యాయమని విమర్శించారు. సీనియార్టీని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
» సచివాలయ ముట్టడి అనంతరం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ నేతలు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేసి పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈడ్పుగంటి అనార్ బాబు, ఈరా రాజశేఖర్, పినమాల నాగకుమార్, కనపర్తి విజయరాజు, అన్నవరపు అవినాష్, తానేటి సత్యానందం, స్వరూపారాణి, ప్రియాంక పాల్గొన్నారు. వీరికి మద్దతుగా కేవీపీఎస్ కార్యదర్శి, పలు కుల సంఘాల నాయకులు హాజరయ్యారు.
పార్టీతో సంబంధం అంటగట్టి...
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు గత ఎన్నికల్లో ఏ పార్టీ తరపున ప్రచారం చేశారో విచారణ జరిపి మరీ కూటమి సర్కారు రాయితీలను విడుదల చేస్తోంది. సీఎంవో నుంచి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఏ పార్టీ వాడు అని ఆరా తీశారు. వారు మా గ్రామ టీడీపీ అధ్యక్షుడిని అడిగితే... అతడు నన్ను సంప్రదించకుండానే వైసీపీ సానుభూతిపరుడు అని చెప్పాడు. దీంతో నా రాయితీలను ఆపేశారు. దీనిపై నిలదీస్తే నువ్వు ఆ పార్టీ వాళ్లతో తిరుగుతున్నావ్... అందుకే రాలేదు అని పరిహాసం ఆడుతున్నారు. – ఓ దళిత పారిశ్రామికవేత్త ఆక్రందన


