రాష్ట్రంలో ఈ ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన
గత ఏడాది.. అంతకు ముందు ఏడాది కన్నా తక్కువ
ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ ఐదు శాతం తగ్గుదల
ఎస్సీల ఉపాధి 18.7%, ఎస్టీల ఉపాధి 17%, ఇతరుల ఉపాధి 11.3% కోత
నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి
‘ఉపాధి’పై లిబ్‌టెక్ సంస్థ తాజా నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన తగ్గడం ద్వారా పేదలు వందల కోట్ల రూపాయలు నష్టపోయారని లిబిటెక్ స్వచ్ఛంద సంస్థ తేల్చింది. కొన్నేళ్లుగా దేశంలో ఈ పథకం అమలు తీరుపై ఈ సంస్థ ఏటా రెండు విడతల్లో నివేదికలు విడుదల చేస్తుంది.
ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగం ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య దేశ స్థాయిలో, రాష్ట్రంలో ఈ పథకం అమలు తీరుపై శుక్రవారం నివేదికను విడుదల చేసింది. కూలీలకు అందజేసే రోజువారీ వేతనాన్ని కేంద్రం పెంచినప్పటికీ.. రాష్ట్రంలో గత ఏడాదితో పోల్చితే తక్కువ పనుల కల్పన కారణంగా రూ.435.14 కోట్ల మేర పేదలు నష్టపోయారని తేల్చింది.
» 2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు ఒక్కొక్కరికీ రోజు వారీ చెల్లించే మొత్తం రూ.300 చొప్పున ఉండగా.. 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా పేదలు రూ.4,581 కోట్లు మేర లబ్ధి పొందారు. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తాన్ని రూ.307కు పెంచింది. అయినా పనుల కల్పన తగ్గడంతో పేదలు రూ.4,146.60 కోట్ల మేర మాత్రమే లబ్ధి పొందగలిగారు.
» 2023–24 ఆర్థిక సంవత్సరం (జగన్ సీఎంగా ఉన్నప్పడు)లో రోజు వారీ కూలీ గరిష్టంగా రూ.272 మాత్రమే ఉన్నప్పటికీ ఆ ఏడాది రాష్ట్రంలో పేదలు రూ.6,277 కోట్ల మేర లబ్ధి పొందారు. ఆ తర్వాత 2024–25 ఆర్థిక సంవత్సంలో రోజు వారీ కూలీ రేటు రూ.300 అయినా ఏడాది మొత్తంలో పేదలు రూ.6,183 కోట్ల మేర మాత్రమే లబ్ధి పొందారు.
4.8 శాతం మేర కుటుంబాలకు తగ్గిన పనుల కల్పన
» 2024 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 42.79 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ప్రస్తుత 2025 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 40.74 లక్షల కుటుంబాలు మాత్రమే పనులు పొందాయి. ఈ లెక్కన గత ఆర్థిక ఏడాది కన్నా ఈ ఏడాదిలోని ఆరు నెలల కాలంలో 4.8 శాతం మేర కుటుంబాలకు పనుల కల్పన తగ్గిపోయింది.
» గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ఏప్రిల్, మే నెలల్లో గత ఏడాది కన్నా ఈ ఏడాది పనుల కల్పన తగ్గిపోవడం గమనార్హం. మొత్తం ఆరు నెలల్లో ఒక్క జూన్ నెలలో మాత్రమే ఈ ఏడాది ఎక్కువగా పనుల కల్పన జరిగింది.
» గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఆరు నెలల కాలంలో ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు 17.95 కోట్ల పని దినాలు లభించగా, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అదే ఆరు నెలల కాలానికి 15.51 కోట్ల పని దినాలు మాత్రమే లభించాయి.
» దేశ వ్యాప్తంగా ఈ ఆరు నెలల కాలంలో సగటున ఈ ఏడాది 10.4 శాతం పనుల కల్పన తగ్గిపోగా, మన రాష్ట్రంలో మాత్రం 13.6 శాతం పనుల కల్పన తగ్గిపోయింది.
ఎక్కువగా నష్టపోయింది ఎస్సీ, ఎస్టీలే
»ఎస్సీ, ఎస్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఈ ఏడాది పనుల కల్పన తక్కువైనందున ఆ మేరకు నష్టపోయారు. ఎస్సీలు గత ఆర్థిక సంవత్సరం ఈ ఆరు నెలల కాలానికి నాలుగు కోట్ల పని దినాలు ఉపాధిని పొందగా, ఈ ఏడాది 3.23 కోట్ల పని దినాలు మాత్రమే పొందారు. ఈ లెక్కన వారు 18.7 శాతం మేర ఉపాధి కోల్పోయారు. ఎస్టీలు 17.6 శాతం, ఇతరులు 11.3 శాతం మేర ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది.
»నెల్లూరు, విశాఖ జిల్లాలు మినహా మిగిలిన 24 జిల్లాల్లోనూ పేదలకు ఉపాధి హామీ పథకంలో పనుల కల్పన తగ్గిపోవడం గమనార్హం.


