ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి నిలిపేయాలని నిర్ణయం
సాక్షి, అమరావతి: ప్రైవేట్ ఆస్పత్రుల మాదిరిగానే రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ డెంటల్ కళాశాలల యజమానులు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తుండడంతో విసిగిపోయిన యాజమాన్యాలు బుధవారం నుంచి పథకం సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఈనెల 10నే ఏపీ ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది.
రెండు వారాలకు పైబడి సమయం ఇచ్చినా ప్రభుత్వం మాత్రం బిల్లులు విడుదల చేయలేదు. దీంతో ముందస్తు కార్యాచరణ ప్రకారం సేవలు నిలిపేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.మూడువేల కోట్లకు పైగా బకాయిపడింది. ఈ క్రమంలో.. గతనెల 15 నుంచి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశ) ఆందోళన బాటపట్టింది. తొలుత ఉచిత ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలను నిలిపేయడంతో ప్రారంభమైన సమ్మె ఈనెల 10 నుంచి పూర్తిస్థాయిలో పథకం సేవలన్నింటినీ నిలిపేసింది. తాజాగా.. ప్రైవేట్ వైద్య కళాశాలలు సైతం ఇదే బాటపట్టాయి.
రోడ్డెక్కినా డోంట్ కేర్..
రాష్ట్రంలోని 1.42 కోట్లకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ పథకం సేవలు సుమారు మూడు వారాలుగా నిలిచిపోయాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొత్తగా కేసులు చేర్చుకోకపోగా, పాత కేసులకు ఫాలోఅప్ సేవలను నిలిపేశారు. డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తాం.. లేదంటే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటూ రోగులను పంపించేస్తున్నారు. దీంతో అనారోగ్యం బారినపడిన పేదల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. చికిత్సలు చేయించుకోవడానికి బయట అప్పు పుట్టక.. ప్రభుత్వాస్పత్రుల్లో పట్టించుకునే వారు లేక బాధితులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా.. క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బు బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. పూడుకుపోయిన రక్తనాళాలకు సర్జరీ చేయించుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే ఉచితంగా చేయబోమని తేల్చిచెబుతున్నారు.

ఈ క్రమంలో.. రూ.మూడు లక్షల నుంచి రూ.5 లక్షలకు పైగా వెచ్చించి బైపాస్ సర్జరీలు చేయించుకునే స్థోమతలేని పేదలు, మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆస్పత్రుల యాజమాన్యాలు తమను ఆదుకోవాలని రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. రాష్ట్రంతో పాటు, దేశ చరిత్రలో ఎన్నడూలేనట్లుగా బిల్లులు ఇవ్వండి మహాప్రబో అంటూ ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు విజయవాడలో మహాధర్నాకు దిగారు. ఓ వైపు వైద్యసేవలు అందక ప్రజలు, మనుగడ సాగించలేక ఆస్పత్రులు కొట్టుమిట్టాడుతున్నా సీఎం చంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి.


