ఎవరూలేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు వ్యక్తులు
బాలిక కేకలు వేయడంతో పరార్
ఆ తర్వాత అదుపులోకి తీసుకున్న పోలీసులు
‘పంచాయితీ’ చేసిన టీడీపీ నేత
రాజీ కుదరకపోవడంతో నిందితులపై పోక్సో, అటెంప్ట్ టు రేప్ కేసు నమోదు
సాక్షి విలేకరిపై దాడికి రాజీ కుదురుస్తున్న మధ్యవర్తుల యత్నం
లక్కిరెడ్డిపల్లి: మద్యం సేవించి మతిస్థిమితం లేని బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం, ఈడిగపల్లెలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలివీ.. రెండ్రోజుల క్రితం ఈడిగపల్లెలో జరిగిన ఓ పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన నాగేంద్ర (18) మతిస్థిమితం లేని బాలిక (15)పై కన్నేశాడు.
ఆదివారం తన మిత్రుడు శివ (22)తో కలిసి అదే గ్రామంలోని బెల్టు దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించారు. మధ్యాహ్న సమయంలో బాలిక ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఆమె ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల మహిళలు పరుగున వచ్చారు. వారిని చూసి నిందితులు సమీపంలోని గంగమ్మ ఆలయం దగ్గర దాక్కున్నారు. బాధితురాలి బంధువులు వీరిని పట్టుకుని దేహశుద్ధి చేయబోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని లక్కిరెడ్డిపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం రాజీ పేరుతో వారిని పోలీసులు వదిలేశారు.
సాక్షి విలేకరిపై దాడికి యత్నం..
ఇదిలా ఉంటే.. సోమవారం బాలిక సోదరుడు, అతని మిత్రులు కలిసి తమ సోదరికి జరిగిన అన్యాయాన్ని ‘సాక్షి’ దృష్టికి తీసుకురాగా వివరాలు సేకరించేందుకు సాక్షి విలేకరి అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న లక్కిరెడ్డిపల్లి పోలీసులు ఈడిగపల్లెకు చేరుకుని బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలంటూ ఆటోలో బాధితురాలిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘మా పంచాయితీలో నువ్వెవరు వీడియోలు, ఫొటోలు తీయడానికి? నీకేమి సంబంధం, నీ అంతు తేలుస్తాం, నీ కథ చూస్తా’మంటూ రాజీకి ప్రయత్నిస్తున్న మధ్యవర్తులు కొందరు స్టేషన్‌లో పోలీసుల సమక్షంలోనే సాక్షి విలేకరిపై దాడికి యత్నించారు.
అక్కడే ఉన్న మరో టీడీపీ నేత సాక్షి విలేకరి సెల్‌ఫోన్ లాక్కుని.. ఫొటోలు, వీడియోలు తొలగించాలని ఒత్తిడి చేశారు. మరోవైపు.. పోలీసుల రాజీయత్నం బెడిసికొట్టడంతో ఈ విషయం జిల్లా పోలీసు అధికారులకు తెలిసింది. దీంతో లక్కిరెడ్డిపల్లి పోలీసులు నిందితులిద్దరిపై పోక్సో కేసుతో పాటు అటెంప్ట్ టు రేప్ కేసు నమోదుచేశారు. బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రవీంద్రబాబు చెప్పారు.
బాలికపై లైంగిక దాడికి యత్నం
నిందితుడు టీడీపీ సానుభూతిపరుడని కేసు నీరుగార్చేందుకు యత్నం
నందిగామ టౌన్: మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో జరిగింది. విజయవాడకు చెందిన చిన్ను, ముప్పాళ్ల గ్రామానికి చెందిన వినయ్ స్నేహితులు. చిన్ను మరో ముగ్గురితో కలిసి సోమవారం మధ్యాహ్నం ముప్పాళ్లలోని వినయ్ వద్దకు వచ్చాడు. అదే సమయంలో వినయ్ ఇంట్లోని జామకాయలు కోసుకునేందుకు ఓ బాలిక (16) వచ్చింది.
చిన్ను వరండాలో బాలికతో మాట్లాడుతుండగా అదే సమయంలో మరో యువకుడు, మరో బాలికతో వినయ్ ఇంట్లో ఉన్నాడు. మరోవైపు.. చిన్ను జామ కాయల కోసం వచ్చిన బాలికను బలవంతం చేయబోయాడు. ఇంతలో బాలిక కుటుంబ సభ్యులు అక్కడకు రావడంతో వినయ్ ఆమెను మరో గదిలోకి తీసుకెళ్లి బయట నుంచి గడియ పెట్టాడు. అనుమానం వచ్చి వారు తలుపులు తెరవగా బాలిక భయంతో స్పృహ తప్పి పడిపోయింది. శరీరంపై పంటి గాట్లుండడంతో నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు.
ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన..
రాత్రి 10 గంటల సమయంలో బాలిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. చందర్లపాడు ఎస్‌ఐ ధర్మరాజు లోపలి నుంచి బయటకు రాగానే రాజకీయ ఒత్తిళ్లు ఏమన్నా ఉన్నాయా ఎందుకింత తాత్సారం చేస్తున్నారని ఆయన్ను నిలదీశారు. మహిళా పోలీసులు రావాల్సి ఉందని అందువల్లే ఆలస్యమవుతోందని ఎస్‌ఐ అసహనం వ్యక్తం చేశారు. అయితే, వినయ్ టీడీపీ సానుభూతిపరుడనే కారణంతోనే విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బాలిక బంధువులు మండిపడ్డారు.
బాలికతో అసభ్య ప్రవర్తన.. వృద్ధుడిపై కేసు
ఉంగుటూరు(గన్నవరం): మనవరాలు వయసున్న ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వృద్ధుడిపై ఆత్కూరు పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఉంగుటూరు మండలం నారయ్య అప్పారావుపేటకు చెందిన నిమ్మకూరి రత్నం(76) ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో పరుగులు తీసిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్కూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


