భారత్‌లో మధ్యప్రాచ్యపు సెగలు | Sakshi Guest Column On Middle Eastern trends in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో మధ్యప్రాచ్యపు సెగలు

Jun 19 2025 12:20 AM | Updated on Jun 19 2025 12:20 AM

Sakshi Guest Column On Middle Eastern trends in India

విశ్లేషణ

2025 జూన్‌ 12, 13 వేకువజాముల్లో ఇజ్రాయెల్‌ భారీ సైనిక చర్యకు తెరతీసింది. ఇరాన్‌ అణుశక్తి సదుపాయాల మీద దాడులు చేసింది. రెండు దేశాల నడుమ నెలల తరబడిగా సాగుతున్న ఉద్రిక్తత, ఈ ఘటనతో పెను యుద్ధంగా మారింది.

దశాబ్దాల నుంచీ అపరిష్కృతంగా కొన సాగుతున్న భౌగోళిక రాజకీయ వైరాలు ఎంత దారుణంగా పరిణమిస్తాయో అంద రికీ అవగతమైంది. ఈ యుద్ధాలను ప్రజలు ప్రారంభించారా? లేదు! ఎవరెవరి అధికార దాహానికో వారు బలవుతున్నారు.  
ఇజ్రాయెల్‌ దాడి ఫలితంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్ప దన్న అంచనాలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర భగ్గుమని బ్యారెల్‌ 116 డాలర్లకు చేరింది. 

కోవిడ్, ఉక్రెయిన్, ఎర్ర సముద్రం సంక్షోభాలతో విచ్ఛిన్నమై ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ప్రపంచ సరఫరా వ్యవస్థలు మరోసారి ఖంగుతిన్నాయి. ఇరాన్‌లోని హోర్మూజ్‌ జల సంధి హై–రిస్క్‌ యుద్ధక్షేత్రంలో ఉండటంతో, అంతర్జాతీయ చమురు సరఫరాలు 20 శాతం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. 

దీంతో నౌకారవాణాపై బీమా చార్జీలు ఒక్కఉదుటున నాలుగు రెట్లు పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్లు తమ నిధులను సురక్షితమైన బంగారం మార్కెట్లోకి తరలించడంతో, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు (31.1 గ్రాములు) 2,450 డాలర్ల రికార్డు ధర పలికింది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి.

ఇండియా తప్పించుకోగలదా?
అనేక వర్ధమాన దేశాలతో పాటు ఇండియా సైతం ఈ పరిణా మాల ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ఇంధన, ఆహార ధరలు పెరుగుతాయి. ఉపాధి దెబ్బతింటుంది. కోట్ల మంది జీవితాలు మధ్య ప్రాచ్య ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాయి. ఇండియా తన అవసరాల్లో రమారమి 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ధరల్లో కొద్ది పాటి తేడా వచ్చినా రూపాయి విలువ ఆటుపోట్లకు గురవుతుంది. 

గల్ఫ్‌ దేశాల్లో ఇంజి నీర్లు, నర్సులు, కార్మికులు, ప్రొఫెషనల్స్‌గా 90 లక్షల మంది భారతీ యులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు అపాయంలో పడింది. వారు ఏడాదికి 100 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువే నిధులు స్వదే శానికి పంపిస్తున్నారు. ఎన్నో లక్షల కుటుంబాలు ఈ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాయి. 

ఇక, మధ్య ఆసియాను ఇండియాతో అనుసంధానం చేసే ఇరాన్‌ చాబహార్‌ పోర్టు కూడా యుద్ధ ప్రాంతంలోనే ఉంది. ఇండియాకు ఎంతో ముఖ్యమైన ఈ వాణిజ్య పోర్టు ప్రాజెక్టు నుంచి వైదొలగాల్సిందిగా ఇప్పుడు అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. రెడ్‌ సీ, హోర్మూజ్‌ల ముట్టడి ముప్పు కూడా పొంచి ఉంది. 

60 శాతం పైగా ఇండియా వర్తకం ఈ కారిడార్ల ద్వారానే జరుగుతోంది. దాడి, ప్రతిదాడుల దృష్ట్యా సరుకు రవాణాలో జాప్యం జరుగుతుంది. బీమా వ్యయాలు చకచకా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ వాణిజ్యం దెబ్బ తింటుంది. కరెన్సీ మార్కెట్‌ లోనూ అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. డాలరుకు రూపాయి విలువ ఇప్పటికే 86 దాటింది. 

దీంతో మార్కెట్లో సరఫరా పెంచేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తాయి. ఈ అంకెలకు అందని నష్టం మరొకటి ఉంది. అది లెక్కించడానికి అలవి కానిది. పెరిగే చమురు ధరల వెనుక, నౌకా రవాణాలో జాప్యం వెనుక ఎందరో సామాన్యుల ఇక్కట్లు దాగి ఉంటాయి. 

పూర్తిస్థాయి యుద్ధం కొనసాగితే అది ఒక ప్రాంతానికి పరి మితం కాదు. ప్రపంచ వ్యాప్త అస్థిరతకు నాంది పలుకుతుంది. మధ్యప్రాచ్యపు అగ్నిజ్వాలలు ఖండాంతర కార్పొరేట్‌ బోర్డు రూము ల్లోకి, కుటుంబాల డైనింగ్‌ టేబుల్స్‌ మీదకు, పాఠశాలల క్లాస్‌ రూముల్లోకి నాలుకలు జాపుతూ విస్తరిస్తాయి.

నష్ట నివారణ చర్యలు
వాటి బారిన పడకుండా ఇండియా లోగడ రూపొందించుకున్న వ్యూహాలు, యంత్రాంగాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్నది కీలకం. వీటిలో ముందుగా ప్రస్తావించాల్సింది ఇంధన కవచం. దేశంలోని 39 మిలియన్‌ బ్యారెళ్ల వ్యూహాత్మక రిజర్వుల నుంచి అవసరమైనప్పు డల్లా కొంత కొంత చమురును మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 

స్వల్పకాలిక ధరల ఒడుదొడుకులను ఈ విధానంతో అధిగమించవచ్చు. గల్ఫ్‌ చమురు సరఫరా లోటు భర్తీ చేసేందుకు రష్యా, వెనిజులా, బ్రెజిల్, గయానా దేశాల నుంచి దిగు మతులను పెంచుతోంది. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమై ఇంధన దిగుమతులకు డాలర్లకు కొరత ఏర్పడేట్లయితే, దాన్ని తట్టుకు నేందుకు వీలుగా ద్వైపాక్షిక చెల్లింపు(రూపాయిల్లో పేమెంటు) ఏర్పాట్లను పునః ప్రారంభిస్తోంది.

ప్రవాసుల భద్రత మరో అంశం. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్‌ దేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసుల కోసం నిరంతరాయంగా పనిచేసే సహాయక కేంద్రాలను  ప్రారంభించింది. అత్యవసర పరిస్థితిలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రణాళికలు రూపొందించి గల్ఫ్‌ ప్రభుత్వాల సహకారంతో వాటికి రిహార్సల్స్‌ చేస్తోంది. స్వదేశాలకు డబ్బు పంపించడానికి ఇబ్బంది లేకుండా యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు ఏర్పాట్లు జరిగాయి.

దౌత్యపరంగా సున్నితమైన సమతుల్యతను ఇండియా పాటిస్తోంది. ఒమన్, యూఏఈ, సౌదీలతో తెరవెనుక దౌత్యం నెరపుతోంది. తక్షణం వైరాలకు స్వస్తి పలకాలని, ఉద్రిక్తతలను నివారించాలని, బేషరతు చర్చలు జరపాలని యూఎన్‌ సమావేశంలో పిలుపు నిచ్చింది. 

మరోవంక, ఇండియన్‌ నేవీ అరేబియా సముద్రంలో 16 యుద్ధనౌకలను సన్నద్ధం చేసింది. గల్ఫ్‌ గస్తీలను పెంచింది. ప్రస్తుత ఘర్షణలు ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోకుండా సైబర్‌ ఇంటెలిజన్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. 

ద్రవ్యరంగంలో కరెన్సీ ఆటుపోట్లను నివారించేందుకు ఆర్బీఐ చేతిలో 643 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం జడలు విప్పకుండా కేంద్రం అదనపు ఆహార నిల్వలను విడుదల చేస్తోంది. ఎంఎస్‌ఎమ్‌ఈ ఎగుమతిదారు లకు ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహకాలు, రుణహామీలు రెడ్‌ సీ బాధిత సంస్థలకూ వర్తింప చేస్తోంది. 

మన వ్యూహం 
ప్రస్తుత సైనిక ఘర్షణల సమయంలో ఇండియా ‘పవర్‌ ప్లేయర్‌’గా ఉండాలనుకోవడం లేదు. ఇంధన భద్రత, ప్రవాసుల క్షేమం, వర్తక మార్గాల రక్షణ... ఈ మూడు అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తోంది. దీనికోసం అనివార్యంగా ‘సంరక్షణాత్మక తటస్థత’ అనే సంక్లిష్ట వ్యూహం అనుసరించాల్సి వస్తోంది. 

జూన్‌ 2025 ఒక సంక్షుభిత దశాబ్దాన్ని వినాశకరమైన మలుపు తిప్పింది.  ఇరాన్‌ అణు మౌలిక సదుపాయలపై జరిగిన దాడి, ఇరాన్‌ ప్రతీకార దాడుల ఫలితంగా మధ్యప్రాచ్యం అంతటా దీర్ఘకాలిక అస్థి రత నెలకొంటుంది. ఇండియా విషయానికి వస్తే, ఈ పరిణామాన్ని విదేశాంగ విధానానికి సవాలుగా మాత్రమే పరిగణించలేము. 

వ్యూహా త్మక పరిపక్వతకు, ఆర్థిక పటుత్వానికి, నైతిక స్థైర్యానికి ఇది ఒక పరీక్ష లాంటిది. మనం అప్రమత్తంగా ఉంటూ, మధ్యప్రాచ్యంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని, మనకు చేరువలోనే కాలి బూడిదవుతున్న ఈ ప్రాంతంలో తిరిగి వివేకం ఉదయించాలని కోరుకోవాలి.

శైలేశ్‌ హరిభక్తి 
వ్యాసకర్త పారిశ్రామికవేత్త, పర్యావరణ కార్యకర్త
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement