మణిపుర్‌ హింసకు పరిష్కార మార్గం | Sakshi
Sakshi News home page

మణిపుర్‌ హింసకు పరిష్కార మార్గం

Published Thu, Jan 11 2024 12:01 AM

Sakshi Guest Column On Manipur violence

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో నూతన సంవత్సర ప్రారంభంలోనే తిరిగి హింసాకాండ చెలరేగింది. రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో సమూహాల మధ్య విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి అక్కడి ప్రధాన తెగలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ... వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు చేసుకున్నారు. నెల్సన్‌ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్‌ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. ముందుగా మణిపుర్‌ కొండలు, లోయలలో కాల్పుల శబ్దాలు ఆగవలసి ఉంటుంది. ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. 

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సుందర మైన ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో తాజా దశ హింసాకాండ చెలరేగింది. మొదటి దశలో నమోదైన జాతిపర మైన ఉన్మాదం, ఇప్పుడు సాయుధ సమూహాల మధ్య క్రూరమైన పాశ్చాత్య తరహా తుపాకీ కాల్పుల స్థాయికి దిగజారింది. మొదటి కొన్ని నెలల హింస ఫలితంగా అక్కడ కనిపించని జాతిపరమైన సరిహద్దులు ఏర్పడ్డాయి. మైతేయిలు ఎల్లప్పుడూ ఆధిపత్యం వహించే ఇంఫాల్‌ లోయ నుండి కుకీలు, జోలు, ఇతర గిరిజనులు నిష్క్రమించారు. గిరిజనుల ఆధ్వర్యంలో నడిచే కొండ జిల్లాలను మైతేయిలు ఖాళీ చేశారు. 1947లో పంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలతో జరిగిన నిర్మూలనా కాండను ఇది తలపిస్తోంది.

అస్సాం రైఫిల్స్, ఆర్మీ రెజిమెంట్లు మైతేయి ప్రాంతాలు, కుకీలు, పైతీలు వంటి ఇతర గిరిజనులు నివసించే ప్రాంతాలకు మధ్య తటస్థ జోన్ లను సృష్టించాయి. దీనివల్ల తమ ఆధిపత్య ప్రాంతాన్ని విస్తరించడానికి కొన్ని సమయాల్లో ఏదో ఒక వర్గం చేసే ప్రయత్నాల వల్ల అస్థిరమైన శాంతి కొనసాగుతోంది. కాంగ్లీపాక్‌ తిరుగుబాటు వర్గాలకు చెందిన విçస్తృతమైన నెట్‌వర్క్‌ ఒకప్పుడు ఇంఫాల్‌ లోయను పీడించింది.

గత రెండు దశాబ్దాల కాలంలో దాన్ని అణచిపెట్టారు. అది ఇప్పుడు పునరుజ్జీవితమైందనీ, రాష్ట్ర పోలీసు దళం నుండి ‘దోచు కున్న’ ఆయుధాలతో కొందరు సాయుధులయ్యారనీ తెలుస్తోంది. లొంగిపోయి, అస్సాం రైఫిల్స్‌ నిఘా కళ్ల నీడన, శిబిరాల్లో నివసిస్తున్న కొంతమంది కుకీ మిలిటెంట్లు కూడా ఇదే విధమైన కక్షతో తప్పించుకుని ఉండవచ్చు. కొండ జిల్లాల్లోని సాయుధ గ్రామ అప్రమత్త కమిటీలలో చేరి ఉండవచ్చు కూడా.

యుద్ధంలో యుద్ధం
సమూహాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో రాష్ట్రంలో ‘యుద్ధంలో యుద్ధం’ జరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి.  అదే సమయంలో సాధారణ శాంతిభద్రతలను సద్వినియోగం చేసు కుంటూ దోపిడీ, తుపాకుల సేకరణ, మాదక ద్రవ్యాల వ్యాపారంలో కూడా మునిగిపోతున్నారు. చారిత్రకంగా ఇది వారికి అలవాటైన విద్యే. వీటి సాయంతోనే సాధారణ ప్రజలను లూటీ చేసేవారు. మణి పుర్‌లోని చిన్న మైతేయి ముస్లిం సమాజమైన పంగల్‌లను మైతేయి మిలిటెంట్‌ గ్రూప్‌ లక్ష్యం చేసుకోవడం పరిస్థితుల పతనానికి పరా కాష్టగా కనబడుతోంది.

అయితే, జాతుల మధ్య సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నాలు శాంతి కమిటీల ద్వారా జరుగుతున్నాయి. అయినప్పటికీ, రెండు వైపులా భారీగా సాయుధ మిలిటెంట్ల ఉనికి ఉండటంతో విశ్వాసం పాదుకోవడం కష్టమవుతోంది. హింసను, సంక్షోభాన్ని పరిష్కరించ డంలో ప్రభుత్వ యంత్రాంగ అసమర్థత ఇప్పటికే కనీసం 180 మంది ప్రాణాలను బలిగొంది. దాదాపు 40,000 మంది నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు.

మయన్మార్‌ నుండి కుకీలు వెల్లువలా వచ్చి చేరడం, ఆ పొరుగు దేశంలో సంఘర్షణ ఫలితంగా ప్రవేశిస్తున్న శరణార్థులు కూడా మైతేయిల్లో అభద్రతా భావాన్ని పెంచాయి. కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్, కుకీ నేషనల్‌ ఆర్మీ (బర్మా) తమ ఏకైక పోరాటం మయన్మార్‌ రాజ్యా నికి వ్యతిరేకంగానేననీ, మణిపుర్‌లో తాము ఎటువంటి కాల్పులకు పాల్పడలేదనీ పదేపదే ప్రకటనలు జారీ చేస్తూ వచ్చాయి. అయినా వారి సిబ్బందిలో కొందరు స్వతంత్ర పద్ధతిలో వ్యవహరించడాన్ని తోసిపుచ్చలేము.

కుకీ కొండ ప్రాంతాలలో దాదాపు పూర్తిగా మైతేయిలకు చెందిన రాష్ట్ర పోలీసు కమాండోలను ఉంచడాన్ని మణిపుర్‌ ప్రభుత్వం బలపరుస్తున్నందుకు చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్లను, అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను స్థానిక వార్తాపత్రికలకు చెందిన ఇద్దరు సంపాద కులను అరెస్టు చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ దశలోనే హింసాకాండ జరిగింది. తరచుగా ఇంటర్నెట్‌ నిషేధాలు, ఇతర అవ రోధాల కారణంగా రిపోర్టింగ్‌ తీవ్రంగా నిరోధించబడిన రాష్ట్రంలో, తాజా అరెస్టులు ఏమాత్రం మంచివి కావు.

సంఘర్షణ – స్నేహ చరిత్ర
మణిపుర్‌లో సంఘర్షణలతో పాటు వర్గాల మధ్య స్నేహానికి కూడా సుదీర్ఘ చరిత్రే ఉంది. రాజులు ఇంఫాల్‌ లోయను పాలించినప్పుడు, నాగాలు, కుకీలు, ఇతర గిరిజనులు నివసించే కొండలపై వారి పట్టు చాలా తక్కువగా ఉండేది. గిరిజనులు కొండలను ‘సొంతం’ చేసుకున్నారు, తమ సొంత ఆచారాల ప్రకారం వారి జీవితాలను గడి పారు. రాజులు కూడా దానిని అంగీకరించారు. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మణిపుర్‌లోని మూడు ప్రధాన కమ్యూనిటీలైన మైతేయిలు, కుకీలు, నాగాల మధ్య సంబంధాలు కూడా సంఘర్షణ, ఉద్రిక్తతలు, అపార్థాలతో నిండి ఉన్నప్పటికీ, వారు కలిసి జీవించారు. పరస్పర వివాహాలు కూడా చేసుకున్నారు. తద్వారా సయోధ్యకు, శాంతికి అవకాశం ఏర్పడింది. 1944లో మూడు వర్గా లకు చెందిన యువకులు సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరారు. అది బర్మా నుండి భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వెనుకంజ వేయడంతో చాలామంది తిరిగి రంగూన్ కు వెళ్లారు. స్వాతంత్య్రం కోసం యుద్ధంలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిలో మణిపుర్‌ మొదటి ముఖ్యమంత్రి కూడా ఉన్నారు.

పరిష్కారమేంటి?
క్రైస్తవ మిషనరీలు కొండలపైకి తీసుకువచ్చిన విద్య మణిపుర్‌ గిరిజనుల సాధారణ శ్రేయస్సు స్థాయిని పెంచింది. షెడ్యూల్డ్‌ తెగ లుగా వారికి రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. మరోవైపు, రాష్ట్రంలోనే అత్యుత్తమ సాగు భూమి ఇంఫాల్‌ లోయలో ఉంది. ఇది చారిత్రకంగా మైతేయిలు ఆధిపత్యం చలాయించిన ప్రాంతం. గిరిజనులు తొమ్మిది రెట్లు ఎక్కువ భూమిని కలిగి ఉన్న కొండ ప్రాంతాలలో ఉన్నారు. కానీ వీటిలో సాగు యోగ్యమైనవి తక్కువ.

జనాభాలో 53 శాతం ఉన్న మైతేయిలు వ్యవసాయం, పరిశ్ర మల్లో ముందంజలో ఉన్నారు. 2022లో ఎన్నికైన బీజేపీ నేతృత్వంలోని మణిపుర్‌ ప్రభుత్వం, కుకీ–జో ప్రజలు సాంప్రదాయ గిరిజన భూములుగా పిలిచే వాటిని రిజర్వుడ్‌ ఫారెస్టులుగా చెబుతూ వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసింది. అలా ఉద్రిక్తతకు అవకాశం ఏర్ప డింది. ఇక, గతేడాది మే ప్రారంభంలో మెజారిటీగా ఉన్న మైతేయి లకు షెడ్యూల్డ్‌ తెగ హోదాను కల్పించే చర్యకు పూనుకున్నారు. దానికి వ్యతిరేకంగా గిరిజన సమూహాలు చేసిన ప్రదర్శనల ద్వారా హింసకు నాంది పడింది. అయితే, ఈ చర్యలను ప్రభుత్వం విరమించుకుంది.

కుకీ–జో ప్రజలు మయన్మార్‌ నుండి తమ బంధువులను తీసుకు వస్తున్నారనీ, రాష్ట్రాన్ని ముంచెత్తడం ద్వారా రాష్ట్ర జనాభా నిష్పత్తుల రీతిని మార్చుతున్నారనీ మైతేయిల ఆందోళన. మాదక ద్రవ్యాలు, తుపాకీల సేకరణతో మాదక ద్రవ్యాల వ్యాపారానికి గేట్లు ఎత్తారనీ వీరి ఆరోపణ. (వాస్తవానికి ఇరు వర్గాలకు చెందిన సాయుధ మిలిటెంట్లు ఈ లాభదాయక ‘వ్యాపారం’లో పాల్గొంటున్నారు.)

నెల్సన్‌ మండేలా నేతృత్వంలో దక్షిణాఫ్రికాలో సయోధ్యకు చేపట్టిన చర్యలే... మణిపుర్‌ ప్రజల మధ్య శాంతిని నెలకొల్పడానికి పరిష్కార మార్గం. కాకపోతే దానికి మణిపూర్‌ కొండలు, లోయలలో కాల్పులు నిశ్శబ్దం కావలసి ఉంటుంది. రాష్ట్ర పోలీసులు పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని చాలామంది ఆరోపిస్తున్నారు కాబట్టి, ఈ పని బహుశా కేంద్ర బలగాలు మాత్రమే చేయగలవు. 

జయంత రాయ్‌ చౌధురీ 
వ్యాసకర్త ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఈశాన్య ప్రాంత మాజీ హెడ్‌
(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

Advertisement

తప్పక చదవండి

Advertisement