ఆ పాటను ఇక వినలేమా?

Sakshi Guest Column Lub Pe Aathi Hai Dua Bunke Tamannaah Meri

కామెంట్‌

డూన్‌ స్కూల్‌లో పిల్లలందరూ సమావేశమయ్యే వేళ తరుచుగా పాడే పాట నా బాల్య జీవితంలోనే అత్యంత మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచింది. మాలో కొద్దిమందిమి మాత్రమే ఆ పాటలోని పదాలను అర్థం చేసుకునేవాళ్లం. ఎందుకంటే, ఆ పాట ఉర్దూలో ఉండేది. కానీ దాని వెంటాడే శ్రావ్యత మమ్మల్ని కట్టిపడేసేది. యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆ పాటను ఎవరైనా మర్చిపోయి ఉంటారంటే నాకు సందేహమే. ‘‘లబ్‌ పే ఆతీ హై దువా బన్‌కే తమన్నా మేరీ’’మాకెంతో ఇష్టమైనది. దశాబ్దాల తర్వాత మాత్రమే ఆ పాటను రాసింది సుప్రసిద్ధ కవి ఇక్బాల్‌ అని నేను తెలుసుకున్నాను. ఆయనే రాసిన ‘‘సారే జహా సె అచ్ఛా హిందూస్తాన్‌ హమారా’’ స్థాయిలో నేను దీన్ని కూడా ఇష్టపడతాను.

గత నెలలో, ఈ పాటను బరేలీ(ఉత్తరప్రదేశ్‌)లోని ఒక పాఠశాలలో పాడినప్పుడు, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సోంపాల్‌ సింగ్‌ రాథోడ్‌ దానిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘హిందువుల మనోభావాలను గాయపర్చే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పాఠశాల పిల్లల చేత ముస్లిం పద్ధతిలో పఠింపజేస్తున్నారు... ఇస్లాం వైపు పిల్లలను ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారు... ఉపాధ్యాయులు హిందువుల మనో భావాలను గాయపరుస్తూ విద్యార్థులను మతమార్పిడికి సిద్ధం చేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. మనోభావాలను గాయపర్చే ఆ పదాలు ఏవంటే... ‘‘మేరే అల్లా బురాయీ సే బచానా ముర్‌nుకో’’. దీనికి వెంటనే స్పందించిన విద్యాశాఖ ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేసింది.

ఈ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి అది ఒక వెర్రి మాట. ఇది నన్ను విచారపడేలా, కలవరపడేలా చేసింది. ఇది మన దేశంలో మనం ఎలా మారు తున్నామో చూపుతున్న ఒక విచారకరమైన ప్రతిఫలనమా? లేక నేను యుగాల వెనుకటి మర్చిపోదగిన డైనో సార్‌లా ఉంటున్నానా? నాలో నేను ఈ ప్రశ్నలను వేసుకుంటున్న ప్పుడు, డూన్‌ స్కూల్లో మాకు మరో ఇష్టమైన గీతం అయిన విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ సుప్రసిద్ధ ప్రార్థనా గీతం గుర్తుకొచ్చింది. 

‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, ఎక్కడ సంసారపు గోడల భాగాల కింద ప్రపంచం విడిపోలేదో... ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు!’’ కానీ మన దేశంలో ఇలాంటిది ఇప్పుడు జరుగుతోందా?

అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ నా భయాలు అతిశయోక్తులని నేను భావించడం లేదు. క్రిస్మస్‌ పర్వదినానికి కొన్ని రోజుల ముందు న్యూఢిల్లీలో ఒక పాస్టర్‌ ప్రజలను మతమార్పిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. నిజానికి, ఆయన అధ్యక్షత వహించిన ఆ సమూహం క్రిస్మస్‌ గీతాలను పాడింది. నిరసనకారులు ఆ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వెలుపల పోగయ్యి ‘జై శ్రీరామ్‌’, ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారని పత్రికలు నివేదించాయి. దీంతో వెంటనే అది హిందూ వర్సెస్‌ క్రిస్టియన్‌ ఘర్షణగా మారిపోయింది.

మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన ‘ఎబైడ్‌ విత్‌ మి’ కీర్తనను గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్‌ రిట్రీట్‌లో వినిపించేవారు. ఎంతో మంది ఇష్టంగా ఎదురుచూసే దీన్ని ఏడు దశాబ్దాలపాటు వినిపిస్తూ వచ్చారు. అనేకమంది ప్రజలు ఈ కీర్తనను వింటూ ప్రత్యేకించి ముందుకు సాగేవారు. ఎందుకంటే వెంటాడే ఈ రాగం నార్త్‌ బ్లాక్‌ నుండి గంటల గణగణ శబ్దంతో ప్రతిధ్వనించేది. కానీ గత సంవత్సరం ఈ సుప్రసిద్ధమైన బీట్‌ను తొలగించారు.

దశాబ్దాలుగా సైనిక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిన దీని స్థానంలో ‘యే మేరే వతన్  కే లోగో’ పాటను చేర్చారు. ఇది వలస సామ్రాజ్య వారసత్వం నుంచి ‘‘విముక్తి పొందుతున్న నవ భారతం’’ అంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్‌ సలహాదారు కంచన్‌ గుప్తా ‘బీబీసీ’కి వెల్లడించారు. ‘‘బ్రిటిష్‌ వారు ప్రారంభించిన ట్యూన్‌లను మన మిలిటరీ బ్యాండులు 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఆలపించడంలో ఏ అర్థమూ లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎబైడ్‌ విత్‌ మి’ పాటను తీసివేయడం అనేది భారత్‌ను నిర్వలసీకరించే కొనసాగింపు ప్రక్రియలో భాగమేనని ఆయన అభి ప్రాయపడ్డారు.

నిజమే కావచ్చు. కానీ మహాత్మా గాంధీ దీనిగురించి ఏం అనుకునేవారు? ఈరోజు నుంచి 11 రోజులపాటు నేను ఎదురుచూస్తుంటాను... అధికారుల మనస్సు మారుతుందని కోరుకుంటూ, వేడుకుంటూ ఈ సంవత్సరం బీటింగ్‌ రిట్రీట్‌ను నేను తిలకిస్తాను. అయితే నా అభిప్రాయం తప్పవుతుందని నా నిశ్చితాభిప్రాయం.

మార్పు అనివార్యమనీ, ప్రపంచం పరిణమించడం తప్పనిసరనీ నాకు తెలుసు. కానీ, మనం నిలబెట్టుకోవలసిన సంప్రదాయాలు అంటూ ఏమీ లేవా? ‘ఎబైడ్‌ విత్‌ మి’ అనేది వలసవాద నమూనా అయితే, బీటింగ్‌ రిట్రీట్‌ మాటేమిటి? సమాధానం లేదు. అయితే దానికి కూడా ప్రమాదం పొంచి ఉందా? దీపావళికి ఆరతి, పటాసులు; ఈద్‌కు సేమియాతో చేసే ఖీర్‌ ఎలాగో క్రిస్మస్‌కు ప్రార్థనా గీతాలు అలాగా! కానీ మనం ఏం పాడాలో, ఏవి అట్టిపెట్టుకోవాలో, ఏవి వదిలేయాలో ఇప్పుడు మతమే నిర్ణయిస్తుందా? ప్రశ్నకు సమాధానం తెలీనప్పుడు మా నానమ్మ తరచుగా ‘రబ్‌ జానే’ అని చెప్పేది. దేవుడి కోసం వాడే ఆ ఉర్దూ పదం ఈరోజు ముస్లింలకు ప్రతీకగా గుర్తించబడుతోంది. కాబట్టి అది హిందువులకు నిషిద్ధమైపోయిందా? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అయితే చాలా కొద్ది మంది ప్రజలు మాత్రమే దానిగురించి మాట్లాడటం నేను వింటున్నాను. 

నా భయాలు తప్పు అని నేను కేవలం ఆశించగలను. 2023 సంవత్సరం ఇంకా దాదాపుగా 350 రోజులు సాగుతుంది. నేను ప్రేమిస్తున్న, గుర్తుపెట్టుకుంటున్న భారత దేశం మరింతగా మతి పోగొట్టుకుంటుందా? ఇప్పటినుంచి 12 నెలలు భారంగా సాగుతాయా? లేదా కొత్త ఉషోదయాల వైపు మనం సాగిపోతున్నప్పుడు మన గతంలోని ఉత్తమమైన అంశాలను అదరించి, అక్కున చేర్చుకుంటామా?

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top