జీవితాన్ని 'మార్చే క్షణాలు' కొన్నే! | Sakshi Guest Column On Google CEO Sundar Pichai Speech at Stanford University | Sakshi
Sakshi News home page

జీవితాన్ని 'మార్చే క్షణాలు' కొన్నే!

Jun 29 2026 12:45 AM | Updated on Jun 29 2026 12:45 AM

Sakshi Guest Column On Google CEO Sundar Pichai Speech at Stanford University

విశ్వగురు

నన్ను ఈ రోజు ప్రసంగించేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ రోజు మీకు సలహాలు ఇవ్వాల్సిన రోజని నాకు తెలుసు. నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే – కాలం మారినా,సాంకేతికత మారినా, కొన్ని సలహాలు ఎప్పటికీ విలువైనవే. మీలో కొందరికి లక్ష్యం ఇప్పటికే స్పష్టంగా తెలిసి ఉంటుంది. మరికొందరికి స్పష్టంగా తెలియకపోవచ్చు. అది సహజమే. పట్టభ ద్రుడిగా బయటకు వచ్చిన రోజున నాకూ అలానే అనిపించింది. జీవితం ఎన్నో పెద్ద పెద్ద నిర్ణయాల సమాహారమనీ, వాటన్నింటినీ సరిగ్గా తీసుకోవాల్సిందేననీ భావించేవాడిని. ప్రత్యేకంగా మీలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పరీక్ష, ప్రతి ప్రాజెక్ట్, ప్రతి మార్కు కోసం కష్టపడతారు. 

కానీ మీకు ఒక చిన్న రహస్యం చెబుతాను. ఇవన్నీ ఆ సమయంలో చాలా ముఖ్యంగా అనిపించినా, జీవితాన్ని నిర్ణయించే అంశాలు అంతగా కావు. మీరు ఒక పరీక్షలో విఫలమైనా, ఒక క్లాస్‌ మిస్‌ అయినా, లేదా సంగీత వాయిద్యం నేర్చుకోకపోయినా – ఈ రోజు ఇక్కడే ఉండేవారు. దీన్ని నేను ఎలా గ్రహించానో చెప్పడానికి ఒక చిన్న కథ చెబుతాను. స్టాన్‌ ఫోర్డ్‌లో చదువుతున్నప్పుడు నాకు పాట్‌ అనే స్నేహితుడు ఉండేవాడు. ఒక రోజు ఉదయం అతను ‘‘క్లాస్‌కు వెళ్లకుండా లాస్‌ వెగాస్‌ వెళ్దామా?’’ అని అడిగాడు. అప్పటివరకు నేను ఎప్పుడూ క్లాస్‌ మిస్‌ కాలేదు. రోడ్‌ ట్రిప్‌ కూడా చేయలేదు. అయినప్పటికీ ‘‘సరే’’ అన్నాను. మేము మా గదులకు వెళ్లి కొన్ని వస్తువులు తీసు కుని ప్రయాణం ప్రారంభించాం. కొండల మధ్యగా ప్రయాణిస్తున్నప్పుడు మంచు కురవడం మొదలైంది. నేను జీవితంలో మొదటిసారి మంచును చూశాను. చేతిని బయటకు చాచి మంచు రేణువులను తాకాను. అవి ఎంత మృదువుగా ఉన్నాయో చూసి ఆశ్చర్య పోయాను. ఆ క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకంగా నిలిచిపోయింది. 

మీ జీవితంలో ఎన్నో సందర్భాలు ఎదురవుతాయి. వాటిలో కొన్నే నిజంగా ముఖ్యమైనవి. ఉదాహరణకు – జీవిత భాగస్వామిని ఎంచుకోవడం, కుటుంబాన్ని ప్రారంభించాలా వద్దా నిర్ణయించడం, లేదా కెరీర్‌లో పెద్ద మార్పు చేయడం. ఇలాంటి నిర్ణయాలకు సమయం, స్పష్టమైన ఉద్దేశం అవసరం. అయితే జీవితంలో చాలా పెద్దవిగా కనిపించే మరెన్నో సందర్భాలు కూడా వస్తాయి. నిజానికి అలాంటివి వేల సంఖ్యలో ఉంటాయి. కానీ వాటిలో చాలా తక్కువ మాత్రమే మీ జీవితాన్ని మార్చగలవు. కళాశాల పూర్తయ్యాక వచ్చే మొదటి ఉద్యోగం, తర్వాత మీరు వెళ్లే నగరం, లేదా ఒక రోడ్‌ ట్రిప్‌కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం – ఇవన్నీ మీ జీవిత ప్రయా ణానికి కొత్త అనుభవాలను జోడిస్తాయి. కానీ సాధారణంగా ఇవి మీ జీవిత దిశను నిర్ణయించవు. కాబట్టి ముఖ్యమైన విషయాలను, అనవసరమైన శబ్దం నుంచి వేరు చేసి గుర్తించగలిగితే, మీరు కోరు కున్న దిశగా మీ జీవితాన్ని  మలుచుకోగలుగుతారు. అందుకే ఈ రోజు నా జీవితంలో నేను అనుసరించిన మూడు సులభమైన సూత్రాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

1. ఆశావాదాన్ని ఎంచుకోండి!
నేను చెప్పబోయే మొదటి సూత్రం – ఆశావాదాన్ని ఎంచు కోవడం. ప్రతిరోజూ వార్తలు చూస్తే మనం కఠినమైన కాలంలో జీవిస్తున్నామనిపిస్తుంది. కానీ ప్రతి తరం తమదైన సవాళ్లను ఎదుర్కొంది. మనం ఏ ప్రపంచంలో పట్టభద్రులమవుతామో ఎంచు కోలేము. కానీ ఆ పరిస్థితులను ఎలా చూడాలో మాత్రం మనమే నిర్ణయించగలం.
నేను చెన్నై నగరంలో పెరిగాను. తీవ్రమైన కరువులు వచ్చేవి. నీటి ట్యాంకర్లు సమయానికి వస్తాయో లేదో అని ఎదురుచూసే వాళ్లం. టెలిఫోన్, టెలివిజన్, ఫ్రిజ్‌ వంటి వస్తువులు పొందడానికి సంవత్సరాలు పట్టింది. అయితే నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా కల లను పరిమితం చేయనివ్వలేదు. అందుకే ఒకరోజు సిలికాన్‌ వ్యాలీలో పని చేయాలనే కలను నేను కనగలిగాను. స్టాన్‌ఫోర్డ్‌లో అడ్మిషన్‌ వచ్చినప్పుడు, అమెరికాకు పంపేందుకు నా తండ్రి దాదాపు ఏడాది జీతానికి సమానమైన డబ్బును విమాన టికెట్‌ కోసం ఖర్చు చేశారు. 

కాలిఫోర్నియాకు చేరుకున్న తర్వాత, విమానాశ్రయం నుంచి వస్తూ రహదారి పక్కన ఉన్న కొండలను చూసి, ‘ఇక్కడ అంతా పచ్చగా ఉంటుందని అనుకున్నాను, కానీ ఇవి గోధుమ రంగులో ఉన్నాయి’ అన్నాను. అప్పుడు నా ఆతిథ్య కుటుంబంలోని జేన్‌ ఎర్ల్‌ అనే మహిళ చిరునవ్వుతో, ‘‘మేము వాటిని గోధుమ రంగు కొండలు అని కాదు, బంగారు కొండలు అని పిలుస్తాం’’ అన్నారు. అదే ఆశావాదం అంటే. నేను గోధుమ రంగును చూశాను; ఆమె బంగారు రంగును చూసింది. దృక్పథంలో వచ్చిన ఈ చిన్న మార్పు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపింది. స్టాన్‌ ఫోర్డ్‌లో నేను పీహెచ్‌డీ పూర్తి చేసి అధ్యా పక వృత్తిలోకి వెళ్లాలని అనుకున్నాను. కానీ పరిస్థితులు మారాయి. త్వరగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. నా డాక్టరేట్‌ కార్యక్రమాన్ని వదిలి మాస్టర్స్‌ డిగ్రీతోనే బయటకు రావాల్సి వచ్చింది. దాన్ని నేను ఒక కల ముగిసినట్లుగా భావించవచ్చు. కానీ ఆ ‘గోధుమ కొండ’ను ‘బంగారు కొండ’గా చూడటం నేర్చుకున్నాను. 

2. కష్టమైన పనులను ఎంచుకోండి!
స్టాన్‌ ఫోర్డ్‌ వదిలిన తర్వాత నేను వెంటనే విజయాన్ని సాధించా నని చెప్పాలనుకుంటున్నాను. కానీ అది నిజం కాదు. స్టాన్‌ ఫోర్డ్‌ పూర్తి చేసిన దాదాపు పదేళ్ల తర్వాత కూడా నేను సరైన దారిలో ఉన్నానా అనే సందేహం ఉండేది. అలాంటి సమయంలో నేను గూగుల్‌కు దరఖాస్తు చేసుకున్నాను. 2004, ఏప్రిల్‌ 1న నా చివరి ఇంటర్వ్యూ జరిగింది. అదే రోజు జీమెయిల్‌ ప్రారంభమైంది. ఇంటర్వ్యూలో వారు జీమెయిల్‌ గురించి అడిగినప్పుడు అది నిజమైన ఉత్పత్తో, సరదా జోకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరికీ 1 జీబీ ఉచిత స్టోరేజ్‌ ఇవ్వడం అసాధ్యమైన ఆలోచనగా అనిపించేది.

కొన్ని సంవత్సరాల తర్వాత నాకు కూడా అసాధ్యంగా కనిపించిన ఒక సమస్యపై పని చేసే అవకాశం వచ్చింది. అదే గూగుల్‌ క్రోమ్‌. మేము బ్రౌజర్‌ను మరింత వేగంగా రూపొందించవచ్చని భావించాం. కానీ చాలామంది అది కష్టమన్నారు. వందలాది ఇంజి నీర్లు అవసరమన్నారు. మా దగ్గర కేవలం పది మందే ఉన్నారు. 2008లో మేము క్రోమ్‌ను ప్రారంభించాం. మొదటి 24 గంటల్లో 80 లక్షల మంది ఉపయోగించారు. కానీ కొంతకాలానికి వృద్ధి ఆగిపోయింది. ఏడాది తర్వాతా మార్కెట్‌లో మా వాటా 2 శాతమే. మైక్రోసాఫ్ట్‌ సీఈఓ స్టీవ్‌ బాల్మర్‌ క్రోమ్‌ను ఎగతాళి చేస్తూ ‘‘ఇది లెక్కలోకి కూడా రాని చిన్న విషయం’’ అన్నారు. మేము నిరుత్సాహపడలేదు. ప్రతి ఆరు వారాలకు కొత్త వెర్షన్‌ విడుదల చేశాం. ఇతర కంపెనీలు ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే విడుదల చేసేవి. క్రమంగా విజయం మా వైపు వచ్చింది.

3. ఉత్సాహాన్ని కలిగించే పనిని చేయండి!
1993లో స్టాన్‌ ఫోర్డ్‌లోని కంప్యూటర్‌ ల్యాబ్‌లోకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉపయోగించగలిగే కంప్యూటర్ల వరుసలను చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు ఇంటర్నెట్‌ ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. అది మానవ అభివృద్ధికి గొప్ప సాధనంగా మారుతుందని నేను గుర్తించాను. ఎక్కువ మందికి ఈ సాంకేతికతను అందించడంలో భాగస్వామి కావాలనే ఆలోచనే నన్ను ఉత్సాహపరిచింది. అందుకే నేను గూగుల్‌లో చేరాను. అందుకే క్రోమ్‌బుక్స్, ఆండ్రా యిడ్‌ వంటి ప్రాజెక్టులపై పనిచేశాను. అందుకే మీ జీవిత మార్గాన్ని ఎంచుకునేటప్పుడు: మీ తల్లిదండ్రులు కోరుకునేదాన్ని మాత్రమే చూడకండి. మీ స్నేహితులందరూ చేస్తున్నదాన్ని అనుసరించకండి. దానికి బదులుగా, రాత్రి పొద్దు పోయే వరకు మీ స్నేహితులతో ఉత్సాహంగా మాట్లాడేలా చేసే విష యాలను గుర్తించండి. వెళ్లి అదే పని చేయండి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement