ఇవి అనుచితం ఏమీ కాదు! | Sakshi
Sakshi News home page

ఇవి అనుచితం ఏమీ కాదు!

Published Wed, Aug 10 2022 1:04 AM

Sakshi Guest Column freebies once again become hot topic

దేశంలో ఉచిత పంపిణీల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. కేంద్రం కూడా వీటిని కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ కొంచెం ఎక్కువ, తక్కువగా ఈ ఉచిత హామీలు ఇస్తూనే ఉన్నాయి. కొన్ని సఫలం అవుతుంటాయి. కొన్ని విఫలం అవుతుంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రగతికి ఇవి ఉపయోగపడతాయా, లేదా అన్నది కూడా ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేస్తున్న పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది.

ఉచిత హామీలపై సుప్రీంకోర్టు విచారణ చేయడం, చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఈ సంద ర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. గౌరవ న్యాయస్థానం వారు ఈ ఉచిత పంపిణీల హామీల గురించి ఆందోళన చెందినట్లుగా ఉన్నారు. తరచుగా కోర్టులలో పిల్స్‌ వేస్తుండే న్యాయ వాది ఒకరు ఈ పిల్‌ కూడా వేశారు. ఉచిత హామీలను నిలుపుదల చేస్తూ కోర్టువారు ఉత్తర్వులు ఇవ్వాలన్నది ఆ పిటీషన్‌ సారాంశం. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పుడు కేంద్ర మాజీ  మంత్రి, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ను కూడా న్యాయమూర్తి సలహా కోరారు. ఇందులో కోర్టుల నిర్ణయం కన్నా, ఆర్థిక సంఘం సలహా తీసుకోవడం మంచిదని ఆయన సూచించారు.  

కోర్టులలో అప్పుడప్పుడు ఇలాంటివి విచారణకు వస్తుంటాయి. కానీ అవి కూడా నిర్దిష్ట ఉత్తర్వులు ఇవ్వగలవా అన్నది సందేహం. కేంద్రం కూడా ఈ ఉచితాలను కట్టడి చేయాల్సిందేనన్న భావనతో ఉన్నట్లు సుప్రీంకోర్టులో తెలిపింది. దానికి తగ్గట్లుగానే ప్రధాని మోదీ  హెచ్చరిక చేశారు. ఉచిత హామీలు అని కోర్టువారు అన్నా, వాటిని పేదల సంక్షేమ కార్యక్రమాలని రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. 

బహుశా ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ట్రెండుకు తెర తీశారని చెప్పాలి. ఆమె ‘గరీబీ హఠావో’ నినాదం ఇచ్చారు. దానికి అనుగుణంగా పలు సబ్సిడీ పథకాలను అమలు చేశారు. దీన్ని పాత కాంగ్రెస్‌ నేతలు, స్వతంత్ర పార్టీ నేతలు వ్యతిరేకించినా, జన బాహుళ్యం ఇందిరాగాంధీకే జేజేలు పలికింది. ఆ తర్వాత కాలంలో పలు రాష్ట్రాలలో ఇలాంటి స్కీములను అమలు చేశారు. వాటిలో కొన్ని ఆచరణ సాధ్యంకానివి కూడా ఉండవచ్చు. తమిళనాడులో ఎంజీఆర్, ఆ తర్వాత జయలలిత; వారికి పోటీగా కరుణానిధి ఇలాంటి హామీలు ఇవ్వడానికి వెనుకాడలేదు. మిక్సర్లు ,గ్రైండర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాగ్దానం చేశారు.

రుణ మాఫీ హామీలను కూడా ఆయా జాతీయ పార్టీలు, వివిధ ప్రాంతీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, కర్ణాటక మొదలైన రాష్ట్రాలలో బీజేపీ సైతం రుణమాఫీ హామీలను ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో 1983లో ఎన్‌.టి.రామారావు కిలో రెండు రూపాయల పథకానికి హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. అది ఆచరణ సాధ్యం కాదని అన్నవారు చాలామంది ఉన్నారు. కానీ పరిస్థితిని గమనించిన ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం తాము 1.90 పైసలకే కిలో బియ్యం ఇస్తామని చెప్పి అమలు చేసింది. కానీ ఆ స్కీము పేటెంట్‌ ఎన్టీఆర్‌దే అన్న భావన వచ్చి ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. 

2014లో టీఆర్‌ఎస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో లక్ష రూపాయల వరకు రుణ మాఫీని ప్రకటించింది. ఆ తర్వాత అమలు చేయగలి గింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ రెండు లక్షల రూపాయల హామీ ఇచ్చినా, ప్రజలు ఆదరించలేదు. మళ్లీ 2023 ఎన్నికలు రాబోతున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని, అది కూడా ఒకేసారి అమలు చేస్తామని పీసీసీ అద్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చి ఈ ప్రకటన చేసి వెళ్లారు. ఇది సాధ్యమా అంటే మామూలుగా అయితే కష్టమే. కానీ తాము వనరులు సమకూర్చుకుంటామని కాంగ్రెస్‌ నేతలు చెబుతారు.

2018 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ మళ్లీ రుణమాఫీ వాగ్దానం చేసింది కానీ, పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతోంది. 2014లో ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు  రైతుల రుణాలు, చివరికి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలనూ మాఫీ చేస్తామని భారీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక పరిమితులు పెట్టి లక్షన్నర రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అది కూడా అరకొరగా చేసి చేతులు దులుపుకొన్నారు.

2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చింది. వాటిలో అమ్మ ఒడి, చేయూత, ఆసరా, పెన్షన్ల పెంపు, రైతు భరోసా వంటివి ఉన్నాయి. వాటిలో 95 శాతం అమలు చేసిన ఘనతను వైసీపీ సాధించింది. కరోనా సమయంలో జగన్‌ స్కీములు పేదలకు బాగా ఉపయోగపడ్డాయన్న అభిప్రాయం ఉంది. బీజేపీ రైతులకు ఆరువేల రూపాయల చొప్పున ఉచిత పంపిణీ స్కీమును తెచ్చింది. 2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచిత విద్యుత్‌ హామీ ఇచ్చినప్పుడు చాలా చర్చ జరిగింది. ఆనాటి టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు.

కానీ ఆ తర్వాత రోజులలో ఆయనే ఈ హామీని ఇవ్వడం విశేషం. ఆమ్‌ ఆద్మీ పార్టీ మరో అడుగు ముందుకేసి పంజాబ్‌లో ప్రతి ఇంటికి 300 యూనిట్ల విద్యుత్‌ ఉచితం అని ప్రకటించి విజయం సాధించింది. ఇప్పుడు గుజరాత్‌లో కూడా అదే హామీ ఇస్తోంది. ఒడిషాలో బీజేడీ సంక్షేమ స్కీములపైనే రెండు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగు తోందన్న అభిప్రాయం ఉంది. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని సుప్రీంకోర్టు కంట్రోల్‌ చేయగలుగుతుందా?

ఏపీలో తెలుగుదేశం పార్టీ రైతుల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వారు తెలుగుదేశం పార్టీని దీనిపై ప్రశ్నించారు. తాము చేయగలుగుతామని ఆ పార్టీ నేతలు వాదించారు. ఎన్నికల సంఘం టీడీపీని వారించలేకపోయింది. మరి కొన్నిచోట్ల కూడా ఈ హామీలు వచ్చాయి. అలాంటి హామీలు వచ్చిన వెంటనే, సుప్రీంకోర్టు వారు జోక్యం చేసుకోగలిగి, నిరోధించి ఉంటే గొప్ప పేరు వచ్చేదేమో! విశేషం ఏమిటంటే, కరోనా నేపథ్యంలో గౌరవ కోర్టువారే కరోనా వల్ల మరణించిన కుటుంబాల వారికి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఆదేశం ఇచ్చారు. మరి అది ఉచితం కింద వస్తుందో, రాదో తెలియదు. 

కొందరు కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రిటైర్‌ అయిన తర్వాత కూడా పెన్షన్లు, ఇతర సదుపాయాలు పొందు తున్నారు. ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వీరు రిటైరయ్యాక తమకు వచ్చే వేల రూపాయల సదుపాయాన్ని మాత్రం వదులుకోరు. న్యాయ వ్యవస్థ తీరుపై ఈ మధ్య రిటైర్డ్‌ జిల్లా జడ్జీ మంగారి రాజేందర్‌ ఒక ఆసక్తికర వ్యాసం రాశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు రిటైరయ్యాక పలు సదుపాయాలు కల్పిస్తున్న తీరును సోదాహరణంగా వివరించారు. వారికి రిటైరయ్యాక ఈ సదుపాయాలు అవసరమా అంటే ఏమి చెబుతాం! నిజంగా వీరిలో ఎవరైనా పేదవారు ఉంటే ఆదుకోవచ్చు. 

ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ హామీలు ఇవ్వాలి? ఏవి ఇవ్వరాదన్నదానిపై నియంత్రణ కష్టసాధ్యం. కానీ దేశంలో పేదరికం పోనంతవరకూ ఇలాంటి హామీలు ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. మరోవైపు బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకుని ఎగవేస్తున్న పెద్ద పెద్ద కార్పొరేట్లతో పోల్చితే ఈ ఉచిత హామీలు ఎంత అన్న ప్రశ్న కూడా వస్తుంది. దేశ న్యాయ వ్యవస్థ ఇలా రుణాలు ఎగవేసిన వారిని కూడా ఏమీ చేయలేకపోతోందన్న భావన ఉంది. రుణాలు ఎగవేసినవారు అధికార పార్టీలో చేరితే వారి జోలికి ఎవరూ వెళ్లడం లేదన్న భావన సామాన్యులలో కలుగుతోంది. ఈ నేప«థ్యంలో ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టగలుగుతుందా? పార్లమెంటు ఎలా స్పందిస్తుంది? ఆయా వ్యవస్థలు ఎలా స్పందిస్తాయన్నదానిపైనే ఇవి ఏ రూపుదాల్చుతాయో చెప్పగలం. ప్రజలలో వీటిపై నిర్దిష్ట అవగాహన వచ్చేవరకూ, పేదరికం పోనంతవరకూ ఈ హామీలను ఎవరూ నిరోధించలేకపోవచ్చేమో!


- కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
     

Advertisement
 
Advertisement
 
Advertisement