చంద్రబాబు ప్లాన్ అదే.. చివరకు పవన్ పరిస్థితి అదేనా!

తనను నడిపే సినిమా పెద్దలు, రాజగురువు లాంటి వారి డైరెక్షన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే ఆవేశం తప్ప ఇంకేమీ తెలియని పవన్ కల్యాణ్‌కి తాజాగా రాజమండ్రి జైలు ప్రాంగణంలో టీడీపీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో..
స్వపక్షంతోని జనసైనికులతో పాటు సొంత సామాజికవర్గం నుండి తనపై వస్తున్న తీవ్రమైన ఒత్తిళ్ళ మేరకు.. తమకు గౌరవం తగ్గకుండా కనీసం 70 సీట్లు కావాలని సేనాని అడుగుతాడు. దానికి ఎంతమాత్రం ఒప్పుకోని బాబు&కో 20 సీట్ల దగ్గర నుండి బేరం స్టార్ట్ చేస్తారు.. అలా పలు దఫాలు చర్చలు జరిగిన తర్వాత.. చివరికి సేనానికి 28 సీట్లు ఇవ్వడానికి పెద్దలు బలవంతంగా నిశ్చయించడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఓటు చీలకూడదు అనే కారణంతో పాటు సీఎం జగన్‌ని ఎలాగైనా గద్దెదించాలనే ఒకే ఒక్క పాయింట్‌తో తానే అన్నీ త్యాగాలకు సిద్దపడి.. ఆ 28 సీట్లు తీసుకొని బయటకొస్తాడు..
ఇప్పుడే సినిమాలో అసలు కథ మొదలవుద్ది.. బాబు గారు జనసేనానికి ఇచ్చిన ఆ 28 సీట్లలో 20 సీట్లు అసలు టీడీపీ ఈ మధ్య కాలంలో గెలవనివే ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే.. సేనకు ఇచ్చిన ఆ 28 సీట్లలో ఒకటి సేనానికి పోగా.. మిగతా 27లో 15 సీట్లను చంద్రబాబు తెలివిగా తెలుగుదేశం నుండి కొంతమందికి టెంపరరీగా జనసేన కండువా కప్పించి ఆ 15 సీట్లు తన వారికే వచ్చేలా చక్రం తిప్పుతాడు!
ఇక మిగతా 12 సీట్లలో.. పొత్తు ధర్మాన్ని తుంగలో తొక్కి.. జనసేనానికి చెప్పకుండానే.. రాత్రికి రాత్రి దొంగచాటుగా టీడీపీ అభ్యర్ధులకు బీ-ఫామ్ ఇచ్చి కొన్ని చోట్ల నామినేషన్ వేయిస్తారు.. అది చంద్రబాబు రాజకీయ చాణక్యం అని మనం కవరింగ్ ఇచ్చుకోవాలి.. అదేమని ఎవరైనా అడిగితే ఇది స్నేహ పూర్వక పోటీ (friendly contest..) అని జనసేనని మ్యానేజ్ చేయడం పెద్ద విషయమే కాదు.
ఆ సీట్లలో కొత్తగా రంగంలో దిగిన జనసేన అభ్యర్ధులతో పోలిస్తే ఈ టీడీపీ వారే చివరికి ప్రధాన అభ్యర్థులవుతారు!. ఎందుకంటే పొత్తు ధర్మాన్ని గౌరవించే అలవాటు టీడీపీ కార్యకర్తలకు ఎప్పుడూ ఉండదు. వారి దృష్టిలో పొత్తులు అంటే మిగతా పార్టీల వాళ్ళందరూ తమతో కలిసి గొడ్డు చాకిరీ చేసి బాబుగారిని ముఖ్యమంత్రిని చెయ్యడమే!.
ఇక ఆ తర్వాత ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ ఆశించినట్టు తాను.. తన మిత్రుడు నాదెండ్లతో పాటు మరికొంత మంది జనసేన పార్టీ శాసనసభ్యులుగా అసెంబ్లీలో అడుగుపెట్టక ముందే.. ఇంకా కనీసం ఎన్నికల ఫలితాలు కూడా రాకముందే.. బాబు గారు ముందు చూపుతో ఒక్క జనసేనానిని తప్ప మిగతా జనసేన ఎమ్మెల్యే అభ్యర్ధులందరి "లెక్క" సెట్ చేసి.. వేదపండితుల ఆశీర్వచనాల మధ్య సదరు ఎమ్మెల్యే అభ్యర్ధులందరికి స్వయంగా బాబుగారే పచ్చ కండువా కప్పి వారిని తన పార్టీ అకౌంట్‌లో వేసేసుకుంటాడు..
చివరికి కనీసం ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేని తన చేతకాని తనంతో రాజకీయాలకే అన్ ఫిట్ అయిన పవన్ అన్న.. తనకంటే చిన్నవాడైన జగన్ సీఎం ఏంటని జగన్ మీద కోపం.. ఆవేశం తప్ప.. చంద్రబాబు చేతిలో మళ్ళీ మళ్ళీ మొసపొయాననే సంగతి ఎప్పటికీ గుర్తించక.. పార్టీని జెండాని తన అభిమానులకు అప్పగించి.. తాను ఈ డబ్బు.. రాజకీయాలు.. అధికారానికి అతీతమైన కర్మయోగినని తెలుసుకొని.. అన్నీ వదిలేసి ఒంటిమీద ఒక్క శాలువా, తన రెండు లక్షల పుస్తకాలతో.. జనసైనికుల సీఎం.. సీఎం.. నినాదాల మధ్య నుండి నడుచుకుంటూ.. ఒంటరిగా హిమాలయాలలోని తన ఫామ్ హౌస్‌కు వెళ్ళిపోతాడు!!
చంద్రబాబు పొత్తుధర్మం ఎలా ఉంటుందో జనసేన సానుభూతిపరులు.. కాంగ్రెస్ వాళ్ళని కానీ, బీఆర్‌ఎస్‌వాళ్లను కానీ, వామపక్షాల నేతలనుగానీ అడిగితే వివరాతి వివరంగా చెబుతారు!
రచయిత, శ్రీధర్ రెడ్డి చల్లా.