‘భోలే’తోనూ హెరిటేజ్‌ బంధం | TTD ghee contract to Bhole Baba during Chandrababu Naidu government | Sakshi
Sakshi News home page

‘భోలే’తోనూ హెరిటేజ్‌ బంధం

Feb 14 2026 5:07 AM | Updated on Feb 14 2026 5:07 AM

TTD ghee contract to Bhole Baba during Chandrababu Naidu government

హెరిటేజ్‌ ఫుడ్స్‌తో తమకు వ్యాపార బంధం ఉందని వెల్లడిస్తున్న భోలే బాబా డెయిరీ వెబ్‌సైట్‌

భోలే బాబా డెయిరీ వెబ్‌సైట్‌లో బయటపడ్డ వ్యాపారబంధం 

చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే భోలేబాబాకు టీటీడీ నెయ్యి కాంట్రాక్టు 

స్పష్టం చేస్తున్న టీటీడీ రికార్డులు 

కూటమి ప్రభుత్వ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా 

నాసిరకం నెయ్యి అని తేలినా సరే మళ్లీ పచ్చజెండా..  

సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచార కుట్ర వెనుక అసలు లోగుట్టు క్రమంగా బయటపడుతోంది. లడ్డూ ప్రసాదం వివాదంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కేంద్ర బిందువుగా చేసుకున్న భోలేబాబా డెయిరీతో చంద్రబాబు కుటుంబానికి వ్యాపార బంధం ఉందన్న వాస్తవం బట్టబయలైంది. ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌తో తమకు అనుబంధం ఉంది’అని భోలే బాబా డెయిరీ అధికారికంగా పేర్కొ­నడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే భోలేబాబా డెయిరీ టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులోకి తొలిసారి ప్రవేశించింది. అంతే కాదు చంద్రబాబు గగ్గోలు పెడుతున్న కల్తీ నెయ్యి సరఫరా చేసింది టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనేనన్నది కూడా గమనార్హం. భోలేబాబా డెయిరీ, హెరిటేజ్‌ ఫుడ్స్‌ వ్యాపార బంధం బాగోతం ఇదీ....

హెరిటేజ్‌ ఫుడ్స్‌తో భోలేబాబా బంధం
తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న భోలే బాబా డెయిరీతో చంద్రబాబు కుటుంబ బంధం బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌తో భోలేబాబా డెయిరీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. 

హెరిటేజ్‌ ఫుడ్స్‌తో తమకు వ్యాపార బంధం ఉందని భోలేబాబా డెయిరీ తమ అధికారిక వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొనడం గమనార్హం. ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌తో మేము అసోసియేట్‌ అయ్యి ఉన్నాం’అని ఆ వెబ్‌సైట్‌లో భోలేబాబా డెయిరీ స్పష్టంగా వెల్లడించింది. అంటే ఆ రెండు డెయిరీల మధ్య వ్యాపార బంధం దీర్ఘకాలంగా కొనసాగుతోందని స్పష్టమైంది. 

కల్తీ నెయ్యని తెలిసినా ‘కూటమి’ పచ్చ జెండా
2019–24 లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి ఏనాడూ కల్తీ నెయ్యి సరఫరా చేయలేదు. కానీ 2024 జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కల్తీ నెయ్యి సరఫరాకు బరితెగించారు. టీటీడీ రికార్డులే ఆ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. భోలే బాబా డెయిరీ, ఏ ఆర్‌ డెయిరీ ద్వారా 2024, జులై 6, 12 తేదీల్లో సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేదని టీటీడీ ల్యాబ్‌ పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. 

అప్పటికి నెల రోజుల క్రితమే రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉందనే ధీమాతోనే భోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యిని సరఫరా చేసింది. జులై 23న ల్యాబ్‌ పరీక్షల నివేదికలు వచ్చాయి. దాంతో ఆ నాలుగు ట్యాంకర్లను జులై 25న వెనక్కి పంపారు. 

» కల్తీ నెయ్యని నిర్ధారణ అయితే ఏం చేయాలి... ఆ నెయ్యిని ఆ డెయిరీకి తిప్పి పంపాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం అలా చేయలేదు. భోలేబాబా డెయిరీకి అనుకూలంగా వ్యవహరించింది. ఆ నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని జులై 27న శ్రీకాళహస్తిలోని వైష్ణవి డెయిరీకి సమీపానికి తరలించింది. ఆ తరువాతే అదే నాలుగు ట్యాంకర్ల కల్తీ నెయ్యిని 2024, ఆగస్టు, సెప్టెంబరులలో మరో డెయిరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసింది. 

అంటే కల్తీ అని నిర్ధారణ అయిన నెయ్యిని చంద్రబాబు ప్రభుత్వ  హయాంలో  ఉద్దేశపూర్వకంగానే లడ్డూ ప్రసాదం తయారీకి టీటీడీకి సరఫరా చేశారు. లడ్డూ ప్రసాదం కల్తీకి చంద్రబాబు ప్రభుత్వమే పచ్చ జెండా ఊపింది. మళ్లీ అదే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉంది. 

భోలే బాబాను తెచ్చింది టీడీపీ ప్రభుత్వమే...
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే భోలే బాబా డెయిరీ దర్జాగా రాష్ట్రంలో అడుగుపెట్టింది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వహయాంలోనే భోలేబాబా డెయిరీ తొలిసారి టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొంది. 2018 జూన్‌ 26న నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశ మినిట్స్‌ రికార్డులు ఆ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. హర్ష్‌ ఫ్రెష్‌ డెయిరీనే భోలేబాబా డెయిరీగా మారింది. టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు భోలేబాబా డెయిరీని అర్హమైన సంస్థగా ప్రకటించింది టీడీపీ ప్రభుత్వమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement