ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది! | Sakshi
Sakshi News home page

ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది!

Published Mon, Jan 15 2024 12:10 AM

Sakshi Guest Column On Britain People

బ్రిటన్‌ భిన్నమైన దేశం. బ్రిటన్‌ దేశస్థులు విలక్షణమైనవారు. ఎవరి వ్యక్తిగత జీవితాలలోకీ తొంగిచూడరు. నిత్య జీవిత భౌతిక సంభాషణలలో అంత ర్లయగా ఉన్న హాస్యాన్ని చక్కగా పట్టుకోగలరు. విధి నిర్వహణలలో ఘటనాఘట సమర్థులు. మర్యాద ఇవ్వడంలో మన రామన్నలను మించినవారు. ఎంతటి విపత్తుకైనా ముందస్తుగా సిద్ధమై ఉండేవారు. పరదేశీ అతిథులను గౌరవించి, ఆదరించేవారు. తలవని తలంపుగానైనా తమ దేశానికి అప్రతిష్ఠను తీసుకురాని వారు. అంతటి ఉత్కృష్ట ప్రజల పైన, అంతటి నాగరిక దేశం మీద గత డిసెంబరు 23న హీత్రో విమానాశ్రయంలోని మూడవ నంబరు టెర్మినల్‌ పూర్తి విరుద్ధమైన నీడల్ని ప్రసరింపజేసింది! ‘ఇలా కాదే వీళ్లు ఉండాల్సింది’ అన్న భావనను ఆనాటి ప్రయాణికులకు కలిగించింది.

ఇక్కడి నా వ్యాసాల సరళిని బాగా ఎరిగి వున్న వారికి ఆ వ్యాసాలలో తరచు నేను బ్రిటన్‌ దేశాన్ని, బ్రిటన్‌ దేశస్థులను ఆకాశానికి ఎత్తేసినంతగా వెన కేసుకు రావటమన్నది గ్రహింపునకు వచ్చే ఉంటుంది. బ్రిటన్‌ దేశస్థుల గుండె ధైర్యాన్ని నేను ఇష్టపడతాను. వ్యక్తుల జీవితాలలోని గోప్యతను గౌరవించి, వారి ఆంతరంగిక విషయాలలోకి చొరబడకుండా ఉండే ఆ స్వభావాన్ని ప్రశంసిస్తాను. అంతేకాదు, ప్రపంచంలోనే బ్రిటిషరస్‌ గొప్ప హాస్యచతురత ఉన్నవారనీ దృఢంగా విశ్వసిస్తాను.

ఇది చాలా వరకు ఉద్దేశపూర్వకమైన అతిశయోక్తి, తేలికపాటి వ్యంగ్యోక్తి, పైనుంచి కిందివరకు కూడా నర్మగర్భ విమర్శ. ఇదంతా ఎక్కువగా బ్రిటన్‌ రాచకుటుంబం పైన! ఈ క్రమంలో వారి అసహజ ప్రవర్తనల్ని అభినందించడం, వారి అసాధారణతల్లోని అవకరాలను కనుకొనల్లోంచి చూసీచూడనట్లుగా వదిలేయడం, వారు మాటిమాటికీ చేస్తుండే తప్పులను మన్నించడం వంటి మనో నైపుణ్యాలను నేను పెంపొందించుకున్నాను.  

కానీ డిసెంబర్‌ 23 సాయంత్రం హీత్రో విమానాశ్రయంలోని 3వ టెర్మినల్‌లో ఏదైతే జరిగిందో అది మాత్రం క్షమించలేనిది. నిజానికి క్షమించ తగనిది. మరోమాటకు ఆస్కారం లేకుండా అదొక వాదన లకు తావులేని అసమర్థతకు నిదర్శనం. బ్రిటన్‌ను సందర్శించే వ్యక్తుల పట్ల నమ్మశక్యం కానంతటి అమర్యాదకరమైన ధోరణి. బహుశా ఎన్నడూ లేనంతగా పూర్తిస్థాయి ఆత్మాశ్రయ ఓటమి. బ్రిటన్‌ స్వరూపాన్ని గరిష్ఠ స్థాయిలో ఘోరాతిఘోరంగా వీక్షింపజేసిన ఉదాసీనత.  

రాత్రి ఎనిమిది గంటలకు విమానం దిగిన ప్రయాణికులు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ కోసం కిక్కిరిసిపోయి, మందకొడిగా మెలికలు తిరుగుతూ ముందుగు సాగుతూ ఉన్న పొడవాటి వరుసలో రెండున్నర గంటలసేపు విధిలేక వేచి ఉండవలసి వచ్చింది. పాదం నొప్పితో నేను అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఇంకా ల్యాండ్‌ అవుతున్న విమానాల నుంచి కొత్త ప్రయాణికులు మా వరుస లోకి వెనుక నుంచి జమ అవుతుండటం గమనించాను. ఇప్పుడు వరుసలో వేచి ఉండే కాలం బహుశా రెండున్నర నుంచి నాలుగు గంటలు అవుతుందా! ఫస్ట్‌ క్లాస్, అంతకంటే కాస్త మాత్రమే దిగువ శ్రేణిలో ఉండే క్లబ్‌ క్లాస్‌ ప్రయాణికులు కూడా మా క్యూలో ఉన్నారు. వారి కోసం వేరుగా ఏర్పాటై ఉండే ‘ఫాస్ట్‌ ట్రాక్‌’ను బ్రిటన్‌ తొలగించి ఉండటమే అందుకు కారణం. 

విమానాశ్రయ అధికారులకు ఇదేమైనా పట్టి ఉంటుందా? నిజం ఏమిటంటే, వారిలో ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేయటం లేదు. క్షమాపణ కోరటం అటుంచండి, అడిగిన దానికి సమాధానం చెప్పిన వారైనా ఎవరు? ఒకవేళ క్యూలో ఉన్న ప్రయాణికులు బాత్‌రూమ్‌కి వెళ్లవలసివస్తే వారి పరిస్థితి ఏమిటన్న కనీస ఆలోచనైనా వారికి వచ్చి ఉంటుందా? నాకు గుర్తున్నంత వరకు క్యూలో ఉన్న వారెవరికీ అదృష్టవశాత్తూ ఆ అవసరం రాలేదు. లేదా, అలాంటి అవసరం వచ్చిన ప్పటికీ వారు క్యూలో తమ స్థానం కోల్పోయి, మరిన్ని అంతులేని గంటలపాటు వేచి ఉండవలసి వస్తుందన్న భయంతో ఆ బాధను అలాగే ఉగ్గబట్టి ఉండాలి. 

అదింకా క్రిస్మస్‌కు వచ్చిపోయే వారు ఎక్కువలో ఎక్కువగా ఉండే సమయం. ఆ రద్దీని ముందే ఊహించి, అందుకు సిద్ధంగా కదా అధికా రులు ఉండాలి. పైగా హీత్రో విమానాశ్రయానికి గతంలో ఇలాంటివి చాలినన్ని అనుభవాలు ఉన్నాయి. 2019లో ఈ విమానాశ్రయం ద్వారా దాదాపు 8 కోట్ల 10 లక్షల మంది రాకపోకలు సాగించారు. 

అయినప్పటికీ 23న సగానికి పైగా ఇమిగ్రేషన్‌ కౌంటర్‌లు సిబ్బంది లేకుండా కనిపించాయి. చివరికి ఎట్టకేలకు నా వంతు వచ్చినప్పుడు, క్లియరెన్స్‌ కోసం నా దగ్గరికి వచ్చిన అధికారి దగ్గర కనీసం పెన్ను కూడా లేదు! పెన్ను కోసం అతడు తన సహ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పుడు నేను మరికొన్ని ఆవేదనా భరితమైన నిమిషాలను గడుపుతూ అతడి కోసం వేచి ఉండవలసి వచ్చింది. అదృష్టవశాత్తూ నాల్గవ వ్యక్తి దగ్గర అతడికి – మళ్లీ తిరిగి ఇచ్చే షరతుపై – ఒక పెన్ను లభించింది. 

అప్పటికి మా బ్యాగులు లగేజ్‌ బెల్టుల నుంచి జారి వచ్చి, తీరూతెన్నూ లేకుండా కలగాపులగంగా పడి పోయాయి. కొన్ని అసలైన చోటులో, మిగతావి చాలా వరకు విసిరివేసినట్లుగా అక్కడికి దూరంగా చెల్లాచెదురైన వాటిలో! వాటి నుంచి నా రెండు బ్యాగుల్ని కనిపెట్టి తీసుకోడానికి మరొక అరగంట! దాదాపు మూడు వందల మంది ప్రయాణికుల బ్యాగులతో అవి కిందా మీదా అయి కేవలం కలిసిపోవడం మాత్రమే కాదు, వాటిని వెతికి పట్టుకోడానికి అవి ఏమాత్రం పడి ఉండే అవకాశం లేని చోట వాటిని కనిపెట్టాల్సి వచ్చింది. 

ఢిల్లీ నుంచి ముందురోజు రాత్రి బుక్‌ చేసుకున్న క్యాబ్‌ డ్రైవర్‌ నేను హీత్రోలో ల్యాండ్‌ అయిన వెంటనే నాకు ఫోన్‌ చేసి, తను విమానాశ్రయ నిష్క్రమణ మార్గం వైపు ఉన్న డబ్లు్య.హెచ్‌. స్మిత్‌ కౌంటర్‌ దగ్గర నా కోసం వేచి ఉన్నానని చెప్పాడు. కానీ నేను అతడిని చేరడానికి మూడు గంటల సమయం పడుతుందని అనుకుని ఉండడు. నా కోసం ఓపికగా వేచి ఉండటం తప్ప అతడికి వేరే దారి లేదు. లేకుంటే హీత్రో బాడుగకు అతడికి డబ్బు రాదు కదా! 

ఇది ఆమోదయోగ్యం కాదని బ్రిటిష్‌ ప్రభుత్వానికి గట్టిగా చెప్పా ల్సిన అవసరం ఉన్నందున నేను ఇదంతా నిజాయితీగా రాస్తున్నాను. ఇంతకుమించి వేరే మార్గం లేదు. ఎవరికి నేనీ అనుభవాన్ని చెప్పినా భయపడిపోయారు. కానీ ఇది నాకు మాత్రమే ప్రత్యేకమైన అనుభవం కాదు. ఇలా వేల మందికి, బహుశా పదుల వేల మందికి జరిగి ఉంటుంది. టెర్మినల్‌ 3లో ఇది సర్వసాధారణం. అయితే ఈ సర్వ సాధారణత్వాన్ని ఒక మామూలు విషయంగా బ్రిటిష్‌ అధికారులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

కనుక ఒక వ్యంగ్య వ్యాఖ్యతో, ఒక విధమైన ప్రతీకారం వంటి సూచనతో ఈ వ్యాసాన్ని నేను ముగిస్తాను. టెర్మినల్‌ 3లో దిగితే భారతదేశ పాస్‌పోర్టు కలిగివున్న తన అత్తమామలకు కూడా ఇదే జరుగుతుందని రిషి సునాక్‌ గ్రహించగలరా... బహుశా ఆయన వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తే తప్ప?

నా సలహా. ప్రతి భారతీయ విమానాశ్రయంలో ఫాస్ట్‌ ట్రాక్‌ను ఉపయోగించకుండా బ్రిటిష్‌ పౌరులందరినీ నిరోధించాలి. అది నిజంగా జరిగితే హీత్రోలో పరిస్థితులు చాలా త్వరగా మెరుగు పడతాయి. నిజం! నా మాట నమ్మండి!
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement