విజనరీ వేషధారి!

Sakshi Column Story On Sunday Special

మాజీ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఒక విషయాన్నయితే కుండ బద్దలు కొట్టారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఆయన ఈ మధ్యనే హైదరాబాద్‌లో పర్యటించారట. అప్పటికీ ఇప్పటికీ పోలికే లేదు. న్యూయార్క్‌లో ఉన్నానా? ఇండియాలో ఉన్నానా అనే అను మానం వచ్చిందట! ఇరవయ్యేళ్ల్ల కిందట అంటే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలిస్తున్న కాలం. ఆయన తర్వాత రెండు దశాబ్దాలకు హైదరాబాద్‌ అభివృద్ధి సాధించిందని రజనీ భావన. చంద్రబాబు విజనరీయే అని చెబుతూ హైదరాబాద్‌ అభివృద్ధి మాత్రం ఆయనది కాదని రజనీకాంత్‌ చెప్పకనే చెప్పారు.

ఆయన నటించిన ‘నరసింహ’ అనే సూపర్‌హిట్‌ సినిమా చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో ఓ కామెడీ పాత్రధారి పెళ్లిచూపులకు బయల్దేరుతాడు. వెంట మిత్రబృందం కూడా ఉంటుంది. ఆ బృందంలో రజనీకాంత్‌ కూడా ఉంటారు. దారిలో ఎదురైన ప్రతివారికీ అడిగినా అడక్కపోయినా పెళ్లి కొడుకును రజనీకాంత్‌ పరిచయం చేస్తుంటాడు. అదిగో ఆయనే పెళ్లికొడుకు, వేసుకున్న డ్రస్‌ మాత్రం అతనిది కాదని చెబుతుంటాడు. ఇలా ముగ్గురు నలుగురికి చెప్పేసరికి సదరు పెళ్లికొడుక్కి సిగ్గుతో చచ్చినంత పనవుతుంది. ఆ డ్రస్‌ను విప్పి పారేసి పెళ్లిచూపులకు వెళ్లకుండా వెనక్కి వెళ్లిపోతాడు. మొన్న జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి సభలో రజనీకాంత్‌ మాటలను చంద్ర బాబు పాజిటివ్‌గానే తీసుకున్నారు. అస్సలు సిగ్గుపడలేదు.

తనది కాని ఘనతను ఎవరైనా తనకు ఆపాదించి పొగిడి నప్పుడు అభ్యంతరం పెట్టే అలవాటు బాబుకు బొత్తిగాలేదు. పైగా ఆ ఘనత తనకు లభించిన పేటెంట్‌ హక్కు కింద భావిస్తారు. చేతనైన మేరకు తానూ ప్రచారంలో పెట్టుకుంటారు. సెల్‌ఫోన్‌ను దేశానికి తీసుకురావడం, కంప్యూటర్‌ను కనిపెట్టడం, హైదరాబాద్‌ను నిర్మించడం వంటివన్నీ ఈ కోవకు చెందినవే. 

మొబైల్‌ ఫోన్‌ దాని ప్రాథమిక రూపంలో ప్రారంభమై యాభ య్యేళ్లు పూర్తయిన సందర్భంగా చాలా విషయాలు బయట కొస్తున్నాయి. కమర్షియల్‌గా ప్రజావినియోగంలోకి రావడానికి ఆ తర్వాత చాలాకాలం పట్టింది. భారత్‌లో మరింత ఆలస్యంగా ప్రారంభమైంది. 1995లో అప్పటి బెంగాల్‌ ముఖ్యమంత్రి జ్యోతిబసు కలకత్తా నుంచి ఢిల్లీలోని కేంద్రమంత్రి సుఖ్‌రామ్‌కు కాల్‌ చేయడంతో మనదేశంలో మొబైల్‌ ఫోన్ల వినియోగం ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగేళ్లకు చంద్ర బాబు భాగ స్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. తాను అప్పటి ప్రధాని వాజ్‌ పేయిని ఎడ్యుకేట్‌ చేసి ఒప్పించిన తర్వాతనే దేశంలో మొబైల్‌ ఫోన్లు ప్రారంభమయ్యాయని బాబు, ఆయన అనుంగు యెల్లో మీడియా ప్రచారం చేసుకోవడం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నిండా ఏడాది కూడా సమయం లేదు. భారీ శాంపుల్స్‌తో పెద్ద పెద్ద జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేలు మరోసారి బాబు పార్టీకి చావు డప్పు మోగిస్తున్నాయి. తన పార్టీకి ఏదో ఒక ఎజెండా తక్షణావసరం. ఇంకో రెండు మూడు జెండాలు అండగా నిలబడాలి. ఈ రెండు కర్తవ్యాలను నిర్వహించడం కోసం ఆయన బ్యాక్‌ ఆఫీసు బ్రోకర్లూ, ఢిల్లీ లాబీయిస్టులూ రౌండ్‌ ది క్లాక్‌ చెమటలు కక్కుతున్నట్టు భోగట్టా. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలను బాబు విమర్శించలేడు. పైగా ఏమాత్రం సంకోచం లేకుండా వాటిని కొనసాగిస్తానని కూడా చెప్పు కొస్తున్నాడు. ఇది సరిపోదు. చంద్రబాబుకు ఇంకేదో మేకోవర్‌ కావాలి. మొన్నటి పదవీకాలంలో చెప్పుకోవడానికి చేసిందేమీ లేదు. పాతికేళ్ల కింద యెల్లో మీడియా చంద్రబాబుకు వేసిన విజనరీ వేషాన్నే మళ్లీ వేయాలని సంకల్పించారు. గొప్ప విజన్‌ (దూరదృష్టి) గలవాడిగా ప్రచారం చేయడానికి అట్టహాసంగా కొన్ని కార్యక్రమాలను ప్లాన్‌ చేశారు.

ఎంతసేపూ యెల్లో మీడియా పొగిడితేనే సరిపోదు కనుక, కొంచెం పాపులర్‌ వ్యక్తులను కూడా రంగంలోకి దించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ శతజయంతిని ఇందుకోసం వాడుకున్నారు. ఎన్టీఆర్‌ మీద ప్రేమ ఉంటే శతజయంతి సభను గొప్పగానే నిర్వహించేవారు. నిండా నాలుగు వేలమంది కూడా రాని సభతో మమ అనిపించారు. కానీ, వారి ప్రయోజనం వేరు. బాబుకు విజనరీ (దార్శనికుడు)గా డప్పేయడం కోసం ఈ వేదికను వాడుకో వడం. ఆ డప్పు వాయించే పనిని రజనీకాంత్‌కు అప్పగించాలని నిర్ణయించారు. వృద్ధనారీ పతివ్రతల్లాంటి ఇద్దరు సినీ ప్రముఖులు నడుం కట్టి రజనీకాంత్‌ చేతికి స్క్రిప్టును అంద చేశారట. ఈ ఇద్దరూ కృష్ణా జిల్లా నేపథ్యం కలిగినవారే. ఒకరు రిటైర్డ్‌ దర్శకుడు. మరొకరు రిటైర్డ్‌ నిర్మాత. ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచినప్పుడు హైదరాబాద్‌కు వచ్చి మరీ చంద్రబాబును ఆశీర్వదించిన చరిత్ర రజనీకాంత్‌ది. కానీ నిన్నటి సభలో ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేయడం ఆశ్యర్యం కలిగించింది. అంతకంటే ఆశ్చర్యం ఎన్టీఆర్‌ కోసం చంద్రబాబు నటించిన ఆరాటం. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చే వరకు పోరాటం ఆపడట! ఇటువంటి సందర్భాలను బట్టే సామెతలు పుడతాయి. ‘చెప్పేవాడికి లేకపోతే వినేవాడికన్నా సిగ్గుండాలి కదా’ అనే సామెత కూడా ఇలాంటిదే.

చంద్రబాబు వాజ్‌పేయి ప్రభుత్వంలో భాగస్వామి. ఆయన చెవిలో చెప్పి ఇండియాకు సెల్‌ఫోన్లు తెప్పించారు. కలామ్‌ను రాష్ట్రపతిగా చేశారు. స్వర్ణ చతుర్భుజి వంటి భారీ రహదారులను నిర్మింపజేశారు (ఆయన చెప్పుకున్నవే). ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఎందుకు ఇప్పించలేదో అనే అనుమానం ఎవరికీ రాదని ఆయన నమ్మకం. ప్రజల వివేచనాశక్తి మీద, జ్ఞాపకశక్తి మీద ఆయనకున్న చులకన భావానికి ఇది నిద ర్శనం. రజనీకాంత్‌ ప్రసంగం మాత్రం ఎన్టీఆర్‌ కోసం వచ్చినట్టని పించలేదు. చంద్రబాబుపై చేసిన పొగడ్తలు కూడా సహజంగా లేవు. బాలకృష్ణపై చేసిన ప్రశంసలు వెటకారంలా ధ్వనించాయి. సినిమా రక్తి కట్టలేదు. ‘బాషా’ను తీయబోతే ‘బాబా’ తయారైంది.

విజనరీ మేకోవర్‌ కోసం ఈ వారంలోనే మరో కార్యక్రమాన్ని ఢిల్లీ లాబీయిస్టులు కుదిర్చారు. రిపబ్లిక్‌ టీవీ వారు గత మంగళ వారం నాడు ఒక సదస్సును నిర్వహించారు. ఇందులో చంద్ర బాబుతో ప్రశ్నలు–జవాబుల కార్యక్రమం ఉండేలా లాబీయి స్టులు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందే ఓ రెండుసార్లు ఛానల్‌ హెడ్‌తో బాబు చేత మాట్లాడించారట! కార్యక్రమంలో చంద్రబాబునుద్దేశించి యాంకర్‌ అడిగిన ప్రశ్నలు చూస్తే హాస్యా స్పదంగా ఉంటాయి. ప్రశ్నలూ–జవాబులూ లాబీయిస్టులే తయారు చేసినట్టు చిన్నపిల్లవాడికైనా అర్థమవుతుంది. ‘మీరు గొప్ప దార్శనికులు. ప్రధాని కూడా దార్శనికుడు. ఇద్దరూ కలిస్తే మంచిదే కదా?’, ‘మీ మాటల్ని బట్టి చూస్తే మోదీ అంటే మీకు చాలా ఇష్టమని తెలుస్తున్నది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినందుకు చింతిస్తున్నారా?’, ‘ఎన్డీఏ మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో ఒకే రకంగా ఉంటాయి. మీరిద్దరూ దేశం కోసం పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పనిచేయడం మీకు సమ్మతమేనా?’ ఇలా ఉన్నాయి యాంకర్‌ ప్రశ్నలు.

ప్రధానమంత్రి కటాక్షం కోసం, బీజేపీ పొత్తు కోసం రిపబ్లిక్‌ టీవీ ఛానల్‌ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నట్టుగా సాగిందా కార్య క్రమం. వాస్తవంగా దాని ఉద్దేశం కూడా అదే! బీజేపీతో పొత్తు విజ్ఞాపనతో పాటు చంద్రబాబు ఒక దార్శనికుడని పలుమార్లు పలకడం మేకోవర్‌ వ్యూహంలో ఒక భాగం. ఇంతకూ ఏమిటి చంద్రబాబు విజన్‌? తన దార్శనికతకు దర్పణంగా ఆయన రాసు కున్న ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని ఎందుకు దాచిపెట్టారు? వ్యవసాయ రంగాన్ని సంక్షోభం పాల్జేసి వేలాది మంది రైతులను ఆత్మహత్యలకు పురికొల్పినది చంద్రబాబు విజన్‌ కాదా? ప్రభుత్వ పాఠశాలలను శిథిలం చేసి పేద బిడ్డల్ని చదువులకు దూరం చేసిన విజన్‌ చంద్రబాబుదే కాదా? ప్రభుత్వాసు పత్రుల్లోకి వెళ్లే నిరుపేదల గోళ్లూడగొట్టి యూజర్‌ చార్జీలు వసూలు చేసిన దార్శనికత ఆయనదే కదా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను వ్యతిరేకించింది ఆయన విజనే కదా? ప్రభుత్వ ఉద్యోగులెందుకు దండగని ఔట్‌సోర్సింగ్‌ బాటలు వేసిన విజన్‌ ఆయనదే కదా! అదిగో అదే విజన్‌తో మళ్లీ ముందుకొస్తున్నాడు విజనరీ. ప్రజలను మభ్యపెట్టేందుకు మాత్రం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తానని చెబుతున్నాడు. ముఖ్యమంత్రి మొన్న ఒక సభలో చెప్పి నట్టు చెరువు పక్కన ముసలి పులి పొంచి కూర్చున్నది. బంగారు కడియాన్ని చూపెట్టి కవ్విస్తున్నది. అఖిలాంధ్ర జనులారా తస్మాత్‌ జాగ్రత్త!

- వర్ధెల్లి మురళి, 
vardhelli1959@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top