పాక్‌ దౌత్య దూకుడు ఇకనైనా తగ్గేనా?

Pakistan Prime Minister Shahbaz Sharif Move On External Affairs Countries - Sakshi

పాకిస్తాన్‌ రాజకీయ సుస్థిరతకు సంబంధించిన ప్రధాన అవరోధం ఏమిటంటే కశ్మీర్‌కి సంబంధించినంతవరకు వ్యవస్థీకృతమైన ముట్టడిలో అన్ని పార్టీలూ ఇరుక్కోవడమే. అయితే భారత్, పాక్‌ దేశాల మధ్య ఆర్థిక పొత్తును మెరుగుపర్చుకోవడంపై ఆ దేశ నూతన ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ స్పష్టమైన వైఖరితో ముందుకొస్తారని భావిస్తున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అవలంబించిన దుస్సాహసిక విదేశీ విధానం సైన్యంతో సహా దేశంలోని పలు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నూతనంగా ఏర్పడిన పాకిస్తానీ ప్రభుత్వం కాస్త సంయమనంతో కూడిన, నష్టభయానికి వీలివ్వని తరహాలో తక్కిన ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్‌ నూతన ప్రధానిగా ఎంపికైన షెబాజ్‌ షరీఫ్‌ 2009 ఫిబ్రవరి 25న ఒక సాహసోపేతమైన ప్రకటన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా తననూ తన సోదరుడు నవాజ్‌ షరీఫ్‌నూ అనర్హులను చేస్తూ పాక్‌ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరసన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా సుప్రసిద్ధ పాక్‌ కవి హబీబ్‌ జాలిబ్‌ కవిత దస్తూర్‌ని షెబాజ్‌ చదివి వినిపించారు. నిరంకుశత్వ పునాదిపై నిలిచిన రాజకీయ వ్యవస్థపై మోగించిన శంఖారావం ఆ కవిత. విషాదం ఏమిటంటే ఆ పాకిస్తాన్‌ కవి, సుప్రసిద్ధ వామపక్ష కవి జాలిబ్‌ అదే వేదనతోనే మరణించారు. షరీఫ్‌లు నివసించే లాహోర్‌ నగరంలోనే ఆయనా జీవించారు. తమ వ్యాపార సామ్రాజ్యంతో పాకిస్తాన్‌లోనే అత్యంత సంపన్న కుటుం బాల్లో ఒకటిగా నిలిచిన షరీఫ్‌ సోదరులు జనరల్‌ జియా ఉల్‌ హక్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. జలంధర్‌లో జన్మించిన జనరల్‌ జియా 1977లో మార్షల్‌ లా ప్రకటించిన తర్వాత పాకిస్తాన్‌ అధ్యక్షుడై పోయారు. ఈయన హయాంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని జుల్ఫికర్‌ ఆలీ భుట్టోను ఉరితీశారు.

వర్గ, జాతి, భౌగోళికమైన తప్పుడు గీతల ప్రభావంతో నిత్యం ఘర్షించుకుంటున్న వలస పాలనానంతర దేశాలకులాగే, అణ్వా యుధాలు కలిగి ఉన్న పాకిస్తాన్‌ కూడా అదే బాటలో నడుస్తోంది. 22 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం అనేక ప్రహసనాల మధ్యే ఉనికి సాగి స్తోంది. పాకిస్తాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ నాలుగేళ్ల పాలన కూడా ఈ క్రమానికి మినహాయింపు కాదు. మొదటిది. పాకిస్తాన్‌ సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్‌ రాజకీయ ప్రాభవం మొదలైందని చెప్పవచ్చు. పాకిస్తాన్‌లో అత్యంత కీలకమైన సంస్థాగత శక్తి సైన్యం. కానీ ప్రధాని అయ్యాక సైన్యం మద్దతును ఇమ్రాన్‌ ఎంతో కాలం నిలుపుకోలేకపోయారు. మొదట్లోనే విభేదాలు వచ్చి ఉండవచ్చు కానీ ఐఎస్‌ఐ చీఫ్‌ నియామకం విషయంలో ప్రధానిగా ఇమ్రాన్‌ నేరుగా జోక్యం చేసుకోవడంతో సైన్యానికీ తనకూ మధ్య విభేదాలు బహిరంగమైపోయాయి. పాకిస్తాన్‌ రాజకీయాల్లో పౌర ప్రభుత్వ ఆధిక్యత ఎవరి చలవతో కొనసాగుతుందనేది ఇమ్రాన్‌ పాలన సాక్షిగా మరోసారి రుజువైపోయింది.

రెండోది. ఇమ్రాన్‌ నిష్క్రమణ అనేక సవాళ్లను విసురుతోంది. ఇస్లామిక్‌ ప్రపంచ నేతల్లో ఒకరిగా తనను తాను ప్రదర్శించుకోవడా నికి ఇమ్రాన్‌ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చేవారు. ఉక్రెయిన్‌పై సైనిక దాడి నేపథ్యంలోనే ఇమ్రాన్‌ రష్యాను సందర్శించి వచ్చారు. కానీ పాకిస్తాన్‌ విదేశీ ప్రాధాన్యతలు మధ్యప్రాచ్యం, చైనా, యూరప్, అమెరికా, భారత్‌తోనే ఉంటూవచ్చాయి. మధ్యప్రాచ్యంలోనూ ఇమ్రాన్‌ సౌదీ అరేబియా రాజరిక వ్యవస్థకు ఆగ్రహం తెప్పించారు. వాస్తవానికి పాకి స్తాన్‌కు అత్యధికంగా రుణ సహాయం చేసింది సౌదీనే. 57 దేశాలతో కూడిన ఇస్లామిక్‌ సహకార సంస్థ సమావేశాన్ని ఏర్పర్చకుండా సౌదీ రాజరికం అడ్డు తగులుతోందని 2020లో పాక్‌ విదేశీ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషి బహిరంగ విమర్శ చేసి షాక్‌ కలి గించారు. భారత్, పాక్‌ దేశాల మధ్య ఘర్షణ విషయంలో సౌదీ రాజరికం తొలినుంచీ సమాన దూరం పాటిస్తోంది. ఈ సందర్భంగా పాక్‌ వ్యవహారం సౌదీకి కోపాన్ని తెప్పించింది. ఇమ్రాన్‌ విదేశీ విధానం సౌదీ, టర్కీల మధ్య వైరాన్ని మరింతగా పెంచింది. 

వాస్తవానికి షరీఫ్‌ కుటుంబానికి సౌదీ రాజరికం ఎంతో కీలక మయింది. సౌదీ రాజు జోక్యంవల్లే మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ని పాక్‌ నుంచి వెళ్లిపోవడానికి నాటి సైనిక పాలకుడు ముషారఫ్‌ అనుమతిం చారు. ముషారఫ్‌ ఎనిమిదేళ్ల పాలనలో తొలి సంవత్సరాలలో నవాజ్‌ షరీఫ్‌ కుటుంబం సౌదీలోనే గడిపింది. కాబట్టి పాక్‌ ప్రస్తుత ప్రధాని నోట రాజకీయ మార్పు అనే ప్రకటన వెలువడిన ఉద్దేశం... సౌదీతో సంబంధాల పునరుద్ధరణే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.

ఇమ్రాన్‌ చేసిన మరో తప్పు ఏమిటంటే... అంత పెద్ద అమెరికా తోనే నేరుగా మాటల యుద్ధానికి దిగటం. పాక్‌లో రాజకీయ మార్పు లను ఎగదోసింది ప్రధానంగా అమెరికానే అని ఇమ్రాన్‌ ఆరోపిం చారు. కానీ పాకిస్తాన్‌ సైనిక సంపత్తిలో అధిక భాగం అమెరికా నుంచి వచ్చిందే అన్నది ఇమ్రాన్‌ మర్చిపోయారేమో కానీ పాక్‌ సైన్యం విస్మరించలేదు. పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ ఖ్వామర్‌ జావేద్‌ బజ్వా బహి రంగంగానే ఈ విషయాన్ని ఇటీవలే ప్రకటించారు కూడా. ఇమ్రాన్‌ దూకుడుగా చేపట్టిన అమెరికా వ్యతిరేక వైఖరిని పాక్‌ సైన్యం ఏమాత్రం సహించలేకపోయింది. దీంతో పాకిస్తాన్‌ పౌర సైనిక వ్యవస్థ అమెరికాతో సంబంధాల స్థిరీకరణకు పూనుకుంది. భౌగోళిక ప్రాధా న్యత కారణగా చైనాతో ఆరు దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కొనసాగించిన పాకిస్తాన్‌ అదే సమయంలో అమెరికా, చైనా మధ్య సమతౌల్యాన్ని పాటించడంలో కూడా అసాధారణమైన నేర్పును ప్రదర్శించగలిగింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ రష్యాను సందర్శించి రావడం యూరోపియన్‌ యూనియన్‌కి కోపకారణం అయ్యింది. ఐక్యరాజ్యసమితిలో రష్యన్‌ దాడిని ఖండించాలని ఈయూ చెప్పినా ఇమ్రాన్‌ ఖాతరు చేయలేదు. పైగా యూరోపియన్ల కపట ధోరణులను బహిరంగంగా ఇమ్రాన్‌ దుయ్యబట్టారు. యూరోపియన్‌ దిగుమతుల విషయంలో పాకిస్తాన్‌ ఆర్థిక ప్రయోజనాలను త్యాగం చేశారని నూతన ప్రధాని షెబాజ్‌ దుయ్యబట్టారు. పాకిస్తాన్‌ వస్త్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 50 శాతం యూరప్‌ దేశాలే దిగుమతి చేసుకుంటు న్నాయి మరి.

పాకిస్తాన్‌ రాజకీయ సుస్థిరతకు సంబంధించిన ప్రధాన అవ రోధం ఏమిటంటే కశ్మీర్‌కి సంబంధించినంతవరకూ వ్యవస్థీకృతమైన ముట్టడిలో అన్ని పార్టీలూ ఇరుక్కోవడమే. ఇది ఎలాంటి పరిస్థితిని సృష్టించిందంటే కశ్మీర్‌ సమస్యపై ఏ పాకిస్తాన్‌ రాజకీయ పార్టీ కూడా తన నిబద్ధతను ఎన్నడూ పలుచన చేసుకోలేదు. అయితే తన సోద రుడు నవాజ్‌ షరీఫ్‌తో పోలిస్తే యువ షెబాజ్‌ షరీఫ్‌ మాత్రం పాకి స్తాన్‌ సైన్యం గీచిన గీటు దాటకుండా తననుతాను చాలా తెలివిగా మల్చుకున్నట్లు కనబడుతోంది. భారత్, పాక్‌ దేశాల మధ్య ఆర్థిక పొత్తును మెరుగుపర్చుకోవడంపై కూడా షెబాజ్‌ స్పష్టమైన వైఖరితో ముందుకొస్తారని భావిస్తున్నారు. 

పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ, పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(ఎన్‌) పార్టీ రెండూ ఇప్పుడు షెబాజ్‌ ప్రధానగా సంకీర్ణ భాగస్వాములుగా ఉన్నాయి. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు భారత్‌కు సన్నిహితం కావడానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశాయి. కానీ పాకిస్తాన్‌ కేంద్రంగా పలు ఉగ్రవాద సంస్థలు భారత్‌పై దాడులు తలపెట్టడం, కార్గిల్‌ ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌ సైనిక యంత్రాంగం అవలంబించిన దుస్సాహసిక విధానాల కారణంగా ఈ రెండు పార్టీల ప్రయత్నాలు పట్టాలు తప్పాయనే చెప్పాలి.
2021 ఫిబ్రవరి 25న ఆధీన రేఖ పొడవునా కాల్పుల విరమణకు భారత్, చైనా సైన్య బలగాలు అంగీకారానికి వచ్చాక ఇంతవరకు ఆ ఒప్పందం సజావుగా కొనసాగుతోంది. సోదరుడు నవాజ్‌ షరీఫ్‌లాగే పాకిస్తాన్‌ నూతన ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ కూడా భారత్‌తో ఆర్థిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి మధ్యేవాద విధానాలను అవలంబిస్తారని, సానుకూల వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు చేస్తారని అందరూ భావిస్తున్నారు. అయితే జాతీయ అసెంబ్లీకి ఎన్ని కలు వచ్చే సంవత్సరమే జరగనున్నందున ఇంత స్వల్ప కాలంలో నూతన ప్రధాని షెబాజ్‌ షరీఫ్‌ పాలనాపరంగా, సంస్కరణల పరంగా, పొరుగునున్న భారత్‌ పరంగా సంబంధాల పునరుద్ధరణలో పెద్దగా సాధించేది ఏమీ ఉండదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఒకటి మాత్రం నిజం. ఇమ్రాన్‌ ఖాన్‌ అవలంబించిన దుస్సాహ సిక విదేశీ విధానం సైన్యంతో సహా దేశంలోని పలు వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కాస్త సంయమనంతో కూడిన, నష్టభయానికి వీలివ్వని తరహాలో తక్కిన ప్రపంచంతో సంబంధాలు నెలకొల్పుకుంటుందని అందరూ ఆశిస్తున్నారు.


లవ్‌ పురి,  వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top