మతం సాకుతో కుట్రాజకీయం

kommineni Srinivasa Rao On Andhra Pradesh Politics - Sakshi

ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయంగా ఎదుర్కోలేక చతికిలపడుతున్న ఏపీ ప్రతిపక్షాలు చివరకు మతాన్ని కూడా అడ్డుపెట్టుకుని కుట్రాజకీయం చేయడానికి వెనుకాడటం లేదు. అంతర్వేది  ఘటనలో కుట్రకోణం ఉంటే కఠినంగా చర్య తీసుకోవలసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే జగన్‌ ప్రభుత్వం సకాలంలో స్పందించిందా లేదా అన్నది చూడాలి. కొత్త రథానికి రూ. 95 లక్షలు మంజూరు చేశారా లేదా? తనకు అన్ని కులాలు, మతాలు సమానమే అని  ముఖ్యమంత్రి ప్రకటించారా? లేదా అన్నది పరిశీలించాలి. వీటిలో ఏది జరగకపోయినా ప్రభుత్వాన్ని తప్పు పట్టవచ్చు. కానీ ఉన్నవి, లేనివి పులిమి జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న దుష్ట తలంపు ఉన్నవారికి మాత్రం ఇవన్నీ జీర్ణం కాని విషయాలే. 

రాజకీయాలు రానురాను అథమ స్థాయికి చేరుతున్నాయి. ఒక చిన్న ఘటనో, పెద్ద ఘటనో జరగడం ఆలస్యం.. కొన్ని రాజకీయ పార్టీల నేతలు తమ జుట్టు విరబోసుకుని వికృతంగా విరుచుకుపడడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. కొందరు సనాతన ధర్మం అంటూ ఆ పదాన్ని తామే కని పెట్టినట్లు నటిస్తున్నారు. మతపరంగా విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలా అని చూసేవారికి ఒక వర్గం మీడియా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తూ అన్నిటినీ భూతద్దంలో చూపే ప్రయత్నం సహజంగానే చేస్తోంది. ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యత చేపట్టిన తర్వాత ఎలా ఆయనను ఇబ్బంది పెట్టాలి, ప్రభుత్వాన్ని ముందుకు సాగనివ్వకుండా ఎలా అడ్డుపడాలి? న్యాయ వ్యవస్థ ద్వారా ఎలా అడ్డుకోవాలి అని పదేపదే ప్రయత్నాలు సాగిస్తున్నారు.. 

ఇలాంటి కుట్రల ద్వారా జగన్‌ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నంలో ప్రతిపక్షం ప్రధానంగా టీడీపీ వారే అప్రతిష్టపాలవుతున్నారు. అయినా దానిపై ఆత్మ విమర్శ చేసుకోవాలని వారు అనుకుంటున్నట్లు లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ఒక రథం దగ్ధమైన ఘటనను చూడండి. అది దురదృష్టకరం. అలాంటివాటిని ఎవరూ సమర్థించరు. హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని ఎవరూ కోరుకోరు. కానీ జరిగిన ఘటనకన్నా దాని ద్వారా రెచ్చగొట్టి ప్రజలను మభ్యపెట్టాలన్న తాపత్రయం చూస్తుంటే.. ప్రతిపక్షాలకు చెందిన కొందరు నేతలు ఇప్పుడే హిమాలయాల నుంచి కఠోర తపస్సు చేసి వచ్చిన రుష్యపుంగవుల మాదిరి హిందూ ధర్మ పరిరక్షణకు అంకితమైన సాధు పుంగవుల్లా నటిస్తున్న తీరు వారి కపటత్వానికి అద్దం పడుతోందని చెప్పవలసి వస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఆ ఘటనను ఖండించి సరైన దర్యాప్తు చేయించండి అని చెప్పి ఉంటే తప్పు లేదు. కానీ ఆ పార్టీల నేతలు కొందరు  చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలు వారిలో రగిలిపోతున్న విద్వేషాన్ని పదేపదే బయటపెట్టేస్తున్నాయి. 

ఒక ప్రముఖ రాజకీయ నేత నల్లటి గడ్డంతో దీక్ష చేశారని ఫొటో చూశాం. ఆయన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారట. సనాతన ధర్మంలో తలజుట్టు, గడ్డం ట్రిమ్‌ చేసి రంగువేసుకోవాలన్న సూత్రం ఉందా అన్న డౌటు వచ్చింది. అంతేకాదు ఆ ఫొటోలో చెట్లు కనిపిస్తే అడవిలో ఈయన కఠోర దీక్ష చేశారేమో అన్న భ్రమ కలిగిస్తుంది. తీరా చూస్తే ఆయన ఎంజాయ్‌ చేయడానికి పెంచుకున్న వ్యవసాయ క్షేత్రం అని అర్థం అవుతుంది. ఈ మధ్య కాలంలో కోట్ల ఖరీదైన విలాసవంతమైన భవంతులలో దీక్షలు చేయడం ఫ్యాషన్‌గా మారింది. కోట్ల రూపాయల ఖరీదైన అధునాతన కార్లలో వెళ్లి ధర్నాలు చేయడం కొత్త ధర్మంగా కనిపిస్తుంది. పోనీ మంచి ఫామ్‌ హౌస్, భారీ భవంతిలో దీక్ష చేసినా ఫర్వాలేదులే.. నిజంగానే ధర్మానికి కట్టుబడి ఉంటే అనుకోవడానికి లేకుండా పోవడం కూడా ఒక విషాదమనిపిస్తుంది. వీరు ఆంధ్ర ప్రజ లను పిచ్చివాళ్లను చేయాలన్న తాపత్రయంలో ఉన్నట్లుగా ఉంది. 

ఒక నాయకుడు ఇద్దరు హిందూ యువతులను పెళ్లాడి విడాకులు తీసుకున్నారు. అది సనాతన ధర్మమా? ఆధునిక ధర్మమా? అక్కడితో ఆగలేదు. ఒక క్రిస్టియన్‌ మహిళను అది కూడా విదేశీ మహిళను పెళ్లాడి, ఆమెకు పుట్టిన బిడ్డ క్రిస్టియన్‌ అని ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. ఇదేమిటి? హిందూ మహిళలకు విడాకులు ఇవ్వడం ఏమిటి. అంత సనాతనవాది క్రిస్టియన్‌ మహిళను పెళ్లాడడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే కోపం రావచ్చు. నిజానికి చట్టబద్ధంగా ఆ నేత చేసినదానిలో తప్పు లేదు. కానీ సనాతన ధర్మం డ్రామా ఆడుతుండేసరికి ఈ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. అంతేకాదు. చేగువేరా కొంతకాలం ఆదర్శంగా చెప్పుకున్నారు. బీజేపీ, టీడీపీలతో కొంతకాలం చెట్టపట్టాలు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీలతో ఎన్నికల పొత్తు.. సనాతన ధర్మాచారాలు పాటించేవారు మతం మత్తుమందు వంటిది అని చెప్పిన కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాన్ని నమ్మే కమ్యూనిస్టులతో కలవడం ఏమిటంటే ఏమని చెప్పాలి? సరే ఆయన మళ్లీ బీజేపీ వారి సిద్ధాంతం వైపు వచ్చేశారు కనుక ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకులుగా మారవచ్చు. 

ఇక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా రాష్ట్రంలో జరిగిన చిన్నా చితకా ఘటనలన్నీ కలిపి దేవాలయాల పవిత్రతను ప్రభుత్వం దెబ్బతీస్తోందని బాధపడ్డారు. నిజమే.. ఏ ఆలయం పవి త్రత అయినా కాపాడాల్సిందే. కానీ మరి ఇదే చంద్రబాబు గోదావరి పుష్కరాలలో తన సినిమా షూటింగ్‌ కోసం జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోతే ఏమని చెప్పారు. ఇదేమైనా కావాలని జరిగిందా? కుంభమేళాలో చనిపోలేదా? జగన్నా«థ రథం కింద పడి చనిపోలేదా? రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా అని ప్రశ్నించారు. తన వల్ల, తన ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎందరు ప్రాణాలు కోల్పోయినా దానికి అసలు పెద్ద విలువ లేదు. అప్పుడు పవిత్రత మంట కలవలేదు. కానీ తాను ఓడిపోయి మరో ప్రభుత్వం వస్తే మాత్రం అన్నీ గుర్తుకు వస్తాయి. 

అంతేకాదు.. 2017 అక్టోబర్‌లో పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన హయాంలో ఒక ర«థం దగ్ధం అయితే దానికి ఇంత రాద్దాంతం జరగలేదే? అంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ సంయమనంగా ఉందని అర్థం అవుతుంది. కానీ ఇప్పటి ప్రతిపక్షం బరి తెగించి విద్వేషాన్ని రెచ్చగొడుతోందన్నమాట. ఇంకో మాట కూడా చెప్పాలి. చంద్రబాబు క్రైస్తవ సమావేశానికి వెళ్లి  క్రీస్తును నమ్మితే విజయానికి ఢోకా ఉండదని సెలవిచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా మాట్లాడడాన్ని తప్పుపట్టరాదు. కానీ ప్రతిపక్షంలోకి రాగానే హిందూ జనోద్ధారకుడి మాదిరి మాట్లాడితేనే చిక్కు వస్తుంది. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో అనేక ఆలయాలు కూల్చినప్పుడు రాని పవిత్రత ఇప్పుడు మాత్రం గుర్తుకు వస్తోంది. 

అంతేకాదు మసీదులు కూల్చే బీజేపీకి ఓట్లు వేస్తారా అని కూడా ఒకప్పుడు చంద్రబాబు తప్పు పట్టారు. ఇక ఆయన కుమారుడు లోకే‹శ్‌ కూడా చాలా బాధపడ్డారు. విశేషం ఏమిటంటే ఈయన చదివింది క్రిస్టియన్‌ మిషనరీ స్కూల్‌లో. ఆ తర్వాత అమెరికాలో చదువుకున్నారు. ఆ సమయంలో ఆయనకు గానీ, ఆయన తండ్రికి గానీ హిందూదేశంలోనే, హిందూ విలువలతో చదువుకోవాలని అనిపించలేదు. అప్పుడు క్రిస్టియన్‌ మతం పాటించే స్కూల్‌ కావాల్సి వచ్చింది. క్రిస్టియన్‌ మతాన్ని నమ్మే దేశం కావాల్సి వచ్చింది. ఈ విషయాలలో వారు తప్పు చేశారని నేనైతే అనడం లేదు. కానీ ఇప్పుడు ఏ చిన్న ఘటన జరిగినా మతం రంగు పులిమి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారమో, విష ప్రచారమో చేస్తున్నప్పుడు ఇలాంటివి అన్నీ ప్రస్తావనకు వస్తాయి. 

ఇక బీజేపీ నేతలు సహజంగానే ఎక్కడ ఇలాంటివి జరిగినా తమకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తారు. కాకపోతే గత ప్రభుత్వంలో జరిగిన వాటిని కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసి కొంత బ్యాలెన్స్‌ చేశారు. వీటన్నిటికి విరుగుడుగా ముఖ్యమంత్రి జగన్‌ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇచ్చేశారు. ప్రతిపక్షాలు మాట్లాడడానికి పెద్దగా లేకుండా చేశారు. నిజానికి అంతర్వేది ఆలయం కింద ఉన్న భూములు తదితర విషయాలలో అక్కడ స్థానికంగా కొన్ని వర్గాల మధ్య తగాదాలు కూడా ఉన్నాయట. ఆ ఘటనను ఎవరైనా కుట్రపూరితంగా చేసి ఉంటే కఠినంగా చర్య తీసుకోవాలి. మొత్తం వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే జగన్‌ ప్రభుత్వం సకాలంలో స్పందించిందా లేదా అన్నది చూడాలి. కొత్త రథానికి రూ. 95 లక్షలు మంజూరు చేశారా? లేదా? తనకు అన్ని కులాలు, మతాలు సమానమే అని ముఖ్యమంత్రి ప్రకటిం చారా? లేదా అన్నది పరిశీలించాలి. 

వీటిలో ఏది జరగకపోయినా ప్రభుత్వాన్ని తప్పు పట్టవచ్చు. కానీ ఉన్నవి, లేనివి పులిమి జగన్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న దుష్ట తలంపు ఉన్నవారికి మాత్రం ఇవన్నీ జీర్ణం కాని విషయాలే. వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలులో దూసుకుపోతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇలాంటి మతపరమైన విషయాలతో ఇబ్బంది పెట్టాలని ప్రతిపక్ష టీడీపీ, జనసేన వంటి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కానీ జనం వీరి దురాలోచనను గమనించలేనంత అమాయకంగా లేరని పదే, పదే రుజువు అవుతున్నా వీరి ధోరణి మారడం లేదు. అందుకే ఆ ప్రతిపక్ష పార్టీలు అన్నీ ప్రజలలో రాజకీయంగా పలుచన అవుతున్నాయని చెప్పాలి.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు,  సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top