ఏ ‘వెలుగులకు’ ఈ కొత్త చట్టం?

KG Raghavendra reddy Article Union Government Changes in Electricity Act - Sakshi

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్‌ చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది. 2014 నుంచీ జరుగుతున్న ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు బ్రేకులు పడుతున్నప్పటికీ ఈ దఫా మాత్రం 2003 నాటి విద్యుత్‌ చట్టంలో మార్పులు చేయాలనే పట్టుదలను కేంద్రం కనబరుస్తోంది. ప్రధానంగా విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్నాయనీ, దాని నుంచి బయటపడవేసేందుకే ఈ కొత్త చట్టమనే అభిప్రాయాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ పెద్దలు చెబుతున్నారు. ఇది అంతి మంగా డిస్కంలను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకేనని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు, విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ అంశంపై కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్‌ బిల్లు–2022పై మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

విద్యుత్‌ చట్టం–2003లో మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని తెచ్చేందుకు 2014 నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై గతంలోనే కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గారు. 2019లో కూడా మరోసారి ప్రయత్నం జరిగింది. మెజార్టీ రాష్ట్రాలు, విద్యుత్‌ ఉద్యో గులు, రైతు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో మరోసారి కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు మాత్రం వ్యతిరేకతను లెక్క చేయకుండా చట్టం చేసేందుకు కేంద్రం ప్రయత్నించింది. మరోసారి అదే వ్యతిరేకత వచ్చిన ఫలితంగా పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా విద్యుత్‌ (సవరణ) బిల్లు –2022 కాస్తా పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ చెంతకు చేరింది. అయినప్పటికీ గెజిట్ల జారీ ద్వారా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తూ కేంద్రం ముందుకే అడుగులు వేస్తోంది.

దేశంలోని డిస్కంల ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ (జెన్‌కో)లకు చెల్లించాల్సిన బకాయిల వ్యవహారం కేంద్రానికి కొత్త మార్పులకు ఊతమిస్తోందని చెప్పకతప్పదు. 1998–99 నుంచి విద్యుత్‌ రంగంలో తెచ్చిన కాలానుగుణ సంస్కరణలు డిస్కంలు, జెన్‌ కోలను కాపాడలేకపోయావనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. దేశ వ్యాప్తంగా 57 డిస్కంలు ఏకంగా 1.40 లక్షల కోట్ల మేర అప్పుల్లో ఉన్నాయి. ఇందులో ఆయా ప్రభుత్వాలు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం రూ.76 వేల కోట్లు ఉండగా... మిగిలిన 64 వేల కోట్ల మేర ఆయా ప్రభుత్వశాఖలు చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లుల బకాయిలు. అయితే, విద్యుత్‌ను తీసుకున్నందుకుగానూ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ(జెన్‌కో)లకు డిస్కంలు రూ.1.10 లక్ష కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. అటు డిస్కంలు, ఇటు జెన్‌కోలను కాపాడే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త చట్టం తెస్తున్నామనేది కేంద్ర పెద్దల ఉవాచ. విద్యుత్‌ పంపిణీ రంగంలో కేవలం ఒకరే కాకుండా ఎక్కువ మంది ఉండాలనీ, తద్వారా డిస్కంలలో పోటీతత్వంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుతాయనీ కేంద్రం చెబుతోంది. అందుకే డిస్కంలల్లో ప్రైవేటీకరణకు తాజా చట్టం తెరలేపింది. 

ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో ప్రైవేటు డిస్కంలు సేవలందిస్తు న్నాయి. ఇక ఒడిశాలో ఏకంగా 4 ప్రైవేటు డిస్కంలు విద్యుత్‌ పంపిణీ రంగంలో పనిచేస్తున్నాయి. అయితే, మరింత విస్తృతంగా కొత్త నెట్‌ వర్క్‌ అవసరం లేకుండానే ప్రస్తుతం ఉన్న నెట్‌వర్క్‌లోనే ప్రైవేటు డిస్కంలకు తలుపులు తెరిచేందుకే కొత్త చట్టం వస్తోందని తెలు స్తోంది. దీనితో పాటు కొత్త చట్టంలో మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు.

అవి: 1. విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) చైర్మన్, సభ్యుల నియామకానికి త్రిసభ్య కమిటీ స్థానంలో నలుగరు సభ్యుల కమిటీని ముసాయిదా బిల్లు ప్రతిపాదించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ ప్రతి నిధి ఇందులో భాగస్వామ్యం కానున్నారు. తద్వారా రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం తలదూర్చనుందన్న విమర్శలు వస్తున్నాయి.

2.ఒక రాష్ట్రం కాకుండా 2,3 రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ను రాష్ట్రాల ఈఆర్‌సీలు కాకుండా కేంద్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (సీఈ ఆర్‌సీ) ఇవ్వనుంది. తద్వారా రాష్ట్రాల ఈఆర్‌సీల పాత్ర నామ మాత్రంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

3.విద్యుత్‌ కొనుగోళ్లకు అయ్యే వ్యయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోగా చెల్లించకపోతే నేరుగా విద్యుత్‌ సరఫరాను నిలిపివేసే అధికారం జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ)ల చేతుల్లోకి వెళ్లనుంది. తద్వారా రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్ల (ఎస్‌ఎల్‌డీసీ) అధికారం కుంచించుకుపోనుందన్న ఆందోళన నెలకొంది.

4. ప్రస్తుతం ఉన్న చట్టంలో యూనివర్సల్‌ సప్‌లై ఆబ్లిగేషన్‌ అనే నిబంధన ఉంది. ఒక రైతు కోసం కూడా కొత్తగా లైన్ల అవసరం ఏర్పడితే డిస్కంలు వేయా ల్సిందే. తాజా చట్టంలో ఈ ఆబ్లిగేషన్‌ను తొలగించారు. తద్వారా సామాన్య వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ చట్టంపై మరింత లోతైన చర్చ జరగాల్సిందేనన్న వైఎస్సార్‌సీపీ అభిప్రాయా నికి సానుకూల స్పందన వస్తోంది. 

అనుమానాలు నిజమేనా?
ప్రస్తుతం అమలులో ఉన్న విద్యుత్‌ చట్టం–2003లో రూపొందిం చారు. కాలక్రమంలో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో  సవరణలు చేసి కొత్త బిల్లును తెరమీదకు తెచ్చింది ఇప్పుడే. అంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత విద్యుత్‌రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్త బిల్లు ముందుకు వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. అయినప్పటికీ బిల్లులోని కొన్ని అంశాలు కేంద్ర వైఖరిపై అనుమానం వ్యక్తం చేసే విధంగానే ఉన్నాయి. విద్యుత్‌ చట్టం 2003 ప్రకారం సెక్షన్‌ 14, 42లల్లో ఏమని పేర్కొన్నారంటే... ‘‘విద్యుత్‌ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్‌ కోసం ఏ సంస్థకైనా, ఏ వ్యక్తికైనా సంబంధిత కమిషన్‌ లైసెన్స్‌ను జారీచేస్తుంది. డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్స్‌ పొందిన సంస్థ లేదా వ్యక్తులు తమ పరిధిలోని వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ (విద్యుత్‌ లైన్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌) వగైరా)ను సొంతంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది.’’ అయితే, కొత్త బిల్లులో ఈ రెండు క్లాజ్‌లలో మార్పులు చేస్తున్నారు. ఎటువంటి లైసెన్సు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో పాటు, ఇప్పటికే ప్రభుత్వరంగ డిస్కంల పరిధిలో ఉన్న విద్యుత్‌ పంపిణీ నెట్‌వర్క్‌ను ఉపయోగించే వెసులుబాటును కల్పించారు. ఈ రెండు క్లాజులలో చేయనున్న మార్పులను గమనిస్తే ప్రైవేటు సంస్థలకు విద్యుత్‌ పంపిణీ రంగంలోకి బార్లా తలుపులు తెరుస్తున్నారన్న విమర్శ వినిపిస్తోంది. ప్రస్తుతం మునిసిపాలిటీ/ జిల్లా పరిధిలో మాత్రమే ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్‌ లైసెన్సులకు అవకాశం ఉండేది. తాజాగా సెప్టెంబరు 8వ తేదీ కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో మాత్రం మునిసిపాలిటీ/ మూడు జిల్లాలతోపాటు ఏదైనా పేర్కొన్న చిన్న ప్రాంతంలో కూడా విద్యుత్‌ పంపిణీ లైసెన్సును పొందే అవకాశం ఉందని పేర్కొంది. ((తద్వారా కేంద్రం తాజా అడుగులు మరింత ఆందోళనను పెంచే విధంగానే ఉన్నాయని చెప్పకతప్పదు.))

విస్తృత చర్చ జరగాల్సిందే!
ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా 52 అంశాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. ఈ జాబితాలోని అంశాలపై అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రాలకూ అధికారం ఉంటుందని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఈ జాబితాలో విద్య, ధరల నియంత్రణ, ఫ్యాక్టరీలు, బాయిలర్స్‌ వంటి అంశాలతో పాటు విద్యుత్‌ కూడా ఒక అంశం. ఈ ఉమ్మడి జాబితాలోని అంశాలపై ఏవైనా మార్పు చేర్పు లతో పాటు కొత్త చట్టాలు చేసే సమయంలో రాష్ట్రాల అభిప్రాయం కూడా కేంద్రం తీసుకోవడం పరిపాటి. ముసాయిదా విద్యుత్‌ (సవ రణ) నిబంధనలు–2022 విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై అనేక పార్టీలు గుర్రుమంటున్నాయి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ అంశంపై కొత్త చట్టం తెస్తున్న నేపథ్యంలో దీనిపై విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది. ప్రతిపాదించిన బిల్లులో ఉన్న లోపాలు, చేయాల్సిన మార్పులపై కూడా తన అభిప్రాయాన్ని పార్లమెంటు సాక్షిగా వెల్లడించింది. భిన్న అభిప్రాయాలు, అనుమానాల నేపథ్యం లోనే పార్లమెంటులో ఆగస్టు 8న కేంద్రం ఈ ముసాయిదాను ప్రవేశ పెట్టింది. ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చిన ఒత్తిళ్లతో చివరకు విద్యుత్‌పై పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ ముందు ఉంచనున్నట్టు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు. దీంతో వివాదం కాస్తా తాత్కాలికంగా సద్దుమణిగింది. విశాల ప్రజానీకంలో నెలకొన్న సందే హాల నివృత్తి తర్వాతే కేంద్రం ముందుకు వెళితే ఆమోదయోగ్యంగా ఉంటుంది.

– కె.జి. రాఘవేంద్రారెడ్డి
సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top