అంబేడ్కర్‌ పేరు ఎందుకు పెట్టాలంటే...

Kancha Ilaiah Special Article On Naming Ambedkar Name To New Parliament Building - Sakshi

ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశస్థులూ తమ పార్లమెంట్‌ భవనానికి ఒక వ్యక్తి పేరు పెట్టుకున్న దాఖలాలు లేవు. కానీ భారత నూతన పార్లమెంట్‌ భవనానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న డిమాండ్‌ బయలుదేరింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణమిది. కొంతమంది ఇది సమంజసమైనది కాదంటున్నారు.

కానీ ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సంక్షేమం, లౌకికత్వం వంటి ప్రజాస్వామ్య లక్షణాలు పాదుకొల్పడానికీ, అవి సజావుగా మనగలగడానికీ రాజ్యాంగంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినవారు అంబేడ్కర్‌. అటువంటి వ్యక్తి పేరు ప్రజాస్వామ్యానికి వాహికైన పార్లమెంట్‌ భవనానికి పెట్టడం ముమ్మాటికీ సబబే అని మరికొందరు అంటున్నారు. పేరు అంటూ పెట్టాల్సి వస్తే రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించడంలో కీలక పాత్ర పోషించిన అంబేడ్కర్‌ పేరు పెట్టడమే సముచితం.

ప్రపంచానికి పరివర్తన సంకేతం
ప్రస్తుతం ఒక సరికొత్త డిమాండ్‌ పుట్టుకొచ్చింది. న్యూఢిల్లీలోని సెంట్రల్‌ విస్టాలో నిర్మించిన కొత్త పార్లమెంట్‌ భవనానికి తప్పకుండా అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్నదే ఆ డిమాండ్‌. హైదరాబాద్‌ నగరంలో కొత్తగా నిర్మి స్తున్న సచివాలయ భవనానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం 2022 సెప్టెంబర్‌ 15న ప్రకటించింది. కొత్త పార్లమెంట్‌ భవనానికి ‘అంబేడ్కర్‌ పార్లమెంట్‌’ అని పెట్టాల్సిందిగా తాను ప్రధానికి ఉత్తరం రాస్తానని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు.

దీని చుట్టూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో సోషల్‌ మీడియా చర్చలు మొదలైపోయాయి. దీనిపై రెండు ముఖ్య మైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వ్యక్తికి ఎంత స్థాయి, ఆమోదనీ యత ఉన్నా సరే... దేశం కోసం దీర్ఘకాలంగా చట్టాలను రూపొందిస్తున్న పార్లమెంట్‌కు ఆ వ్యక్తి పేరు పెట్టవచ్చా? భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలుగా నిలిచిన మరికొందరిని పక్కనబెట్టి ఈ కొత్త భావనకు అంబేడ్కర్‌ అర్హుడేనా?

తొలి ప్రశ్నకు సమాధానం పూర్తిగా నైతిక పరమైనది. సాధారణంగా పార్లమెంట్‌ భవంతికి ఒక వ్యక్తి పేరు పెట్టరు. ఆ వ్యక్తి ఎంత గొప్ప వారైనా సరే. కానీ భారతదేశంలో ప్రతి విషయానికీ వ్యక్తుల పేర్లను తగిలించే పద్ధతి, సంస్కృతి ఉన్నాయి కదా. అలాంటప్పుడు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్మించడంలో గొప్పగా దోహదం చేసిన ఏ వ్యక్తి పేరయినా పార్లమెంట్‌ భవనానికి ఎందుకు పెట్టకూడదు?

ఇక రెండో ప్రశ్నకు సమాధానంగా భారత దేశంలో రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీక రించడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు వ్యక్తులను తులనాత్మకంగా మదింపు చేయవలసి ఉంది. వారెవరో కాదు. అంబేడ్కర్, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభాయి పటేల్‌. వీరిలో నెహ్రూ పట్ల ద్వేషపూరిత దృక్పథం రాజ్యమేలుతోంది.  ప్రధాని మోదీ ఇప్పుడు నెహ్రూతో, ఆయన కుటుం బంతో ప్రత్యక్షంగా ఘర్ష ణాత్మక వైఖరితో వ్యవహ రిస్తున్నారు. మోదీ ప్రభుత్వం సానుకూలత ప్రద ర్శించడానికి అవకాశం గల పేర్లు రెండే. అవి అంబేడ్కర్, పటేల్‌.  

పటేల్‌ నేపథ్యం, పరిణామక్రమం చూస్తే ఆయన గొప్ప పోరాటయోధుడిగా, కార్యకర్తగా, నేతగా, పాలనా దురంధరుడిగా నిరూపించుకున్నారు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఐక్యం చేసిన వానిగా నిలిచిపోయారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. కానీ పటేల్‌ ఎన్నడూ న్యాయ తత్వ వేత్త, చరిత్రకారుడు, ఆర్థికవేత్త, ప్రాపంచిక వ్యవహారాలలో నిపుణుడు కాలేదు. 

మరోవైపు దయనీయంగా అస్పృశ్యతను అను భవించి వచ్చిన అంబేడ్కర్, అనేకమందిలో ఒకే ఒక్కడుగా పరిణమించారు. ఆయన కూడా పోరాట యోధుడు, యాక్టివిస్టు, లీడర్, తనదైన కోణంలో పాలనా దురంధరుడు కూడా. న్యాయ, నైతిక పరమైన తత్వవేత్త. చరిత్ర, సామాజిక శాస్త్రం, రాజకీయ అర్థ శాస్త్రం వంటి అంశాలలో శిక్షణ పొందారు. భారతీయ చరిత్రపై, బౌద్ధ, వైదిక, జైన, ఇస్లాం, క్రైస్తవ వగైరా బహుళ ప్రాపంచిక ఆలోచనా విధానాలపై  అపారమైన పట్టు ఉండేది. రాజ్యాంగ రచన చేస్తూ, దాంట్లోని అన్ని ఆర్టికల్స్‌నీ రాజ్యాంగ సభలో ఆమోదింపజేసుకుంటున్నప్పుడు ఆయన దీక్ష గానీ, ఆయన జోక్యం చేసు కున్న తీరు గానీ మరే వ్యక్తిలో కంటే ఎక్కువగా ప్రదర్శితమయ్యేవి.

ఢిల్లీ అధికార వ్యవస్థలు కాంగ్రెస్‌ పూర్తి నియం త్రణలో ఉన్నంతకాలం ఆయన్ను నిర్లక్ష్యం చేశారు. మండల్‌ కమిషన్‌ అనంతర కాలంలో భారత్‌ అంబేడ్కర్‌ను అధికాధికంగా కనుగొంది. రాజ్యాంగ సభలో ఆయన రాసిన రచనలు, చేసిన ప్రసంగాలు భారత్‌ సంక్షోభంలోకి ప్రవేశించిన ప్రతి సందర్భంలోనూ ప్రజాస్వామ్య రక్షణకు ఆయుధాలుగా మారాయి. అందుకే భారతీయ ప్రజాస్వామ్యం, అంబేడ్కర్‌ పర్యాయ పదాలైపోయాయి. ‘మండల్‌’ అనంతర కాలాలు భారత్‌ను ఒక జాతిగా మల్చడంలో ఆయన నిబద్ధతా శక్తిని పునరుత్థానం చెందించాయి. భారతీయ ప్రజాస్వామిక సంప్రదాయ జ్ఞానాన్ని ఆయన సంశ్లేషించారు.

ప్రత్యేకించి బౌద్ధులు, గిరిజన జనాభాకు చెందిన సంప్రదాయిక జ్ఞానాన్ని ఆయన రాజ్యాంగంలోకి తీసుకురావడమే కాదు.. రాజ్యాం గంలోని ప్రతి ఒక్క నిబంధనకు న్యాయం చేయడా నికి, రాజ్యాంగ సభ ఉపన్యాసాలలో వాటిని పొందుపర్చారు. ప్రత్యేకించి ఇంగ్లండ్, అమెరికా ల్లోనూ; ఇంకా అనేక దేశాల్లోనూ ఉద్భవించిన పాశ్చాత్య రాజ్యాంగ మూల సూత్రాలు ఆయనకు తెలిసినప్పటికీ, భారతీయ చరిత్ర నుంచి సాధికారి కమైన సందర్భోచితమైన ఎన్నో మూలసూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. అందుచేత మన జాతీయవాదాన్ని ఆయన ఏ ఒక్కదాని కంటే మిన్నగా ఉన్నత స్థానంలో నిలిపారు. బుద్ధుడి ఉపమానాలను, అశోకుడి పాలనా సూత్రాలు, చిహ్నాలను ఆధునిక కాలంలో కూడా పునశ్చరణ కావడానికి అంబేడ్కరే కారణం.

ఫ్రెంచ్‌ ఆలోచనా విధానం నుంచి కాకుండా, మన ప్రాచీన భారత చరిత్ర నుండి ప్రజా స్వామ్యం, స్వేచ్చ, సమానత్వం–సౌభ్రాతృత్వం అనే మూడు కీలక సూత్రాలను పదే పదే వల్లించేవారు. ఆయన జాతీయవాదానికి మూలాలు... పురాణాల్లో కాకుండా భారతీయ ప్రజారాశుల సజీవ ఉత్పాదకతా జీవితం నుంచి పుట్టు కొచ్చాయి. చారిత్రకంగా పీడితులైన దళితులు, ఆదివాసులు, శూద్ర ప్రజానీకం ఈరోజు తమ జీవితాల్లో నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా మార్పులు వస్తున్నందుకు అంబేడ్కర్‌కు రుణపడి ఉంటున్నారు.

ఈ అన్ని కారణాల వల్ల భారత నూతన పార్లమెంట్‌ భవంతికి అంబేడ్కర్‌ పేరు పెట్టినట్ల యితే, భారతదేశంలో ఒక నిజమైన నాగరికతా పరివర్తన చోటు చేసుకుంటోందని ప్రపంచం గుర్తిస్తుంది. అప్పుడు మాత్రమే భారతీయ సంపూర్ణ నిర్వలసీకరణ ప్రక్రియ కొత్త ఉదాహర ణను ప్రతిష్ఠించుకుంటుంది. (క్లిక్: ప్రత్యామ్నాయ భావజాల దార్శనికుడు)


- కంచె ఐలయ్య షెపర్డ్‌
ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top