అయోధ్య రాముడా? మధుర కృష్ణుడా?

Kancha Ilaiah Guest Column Political Strategy About 5 State Elections - Sakshi

విశ్లేషణ

రామాలయం, రామరాజ్యం వంటి అంశాలతో ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయడానికి యూపీలో బీజేపీ ప్రయత్నిస్తోంది. తాజాగా సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌... శూద్ర, ఓబీసీలకు అత్యంత ఆమోదనీయుడైన శ్రీకృష్ణుడిని రంగంమీదికి తీసుకొచ్చారు. శ్రీకృష్ణ రాజ్యమే సమాజ్‌ వాదీ పార్టీ సోషలిస్టు రాజ్యమని అఖిలేష్‌ ఇచ్చిన నినాదం బీజేపీ రామరాజ్య భావన కంటే మించిన మనోభావాలను ఇప్పుడు శూద్ర, ఓబీసీ వర్గాల్లో కలిగిస్తోంది. గోపాలకుడిగా, పిల్లనగ్రోవిని ధరించి ఉండే శ్రీకృష్ణుడి ఇమేజిని అఖిలేష్‌ తాజాగా ప్రయోగించారు. కేంద్రప్రభుత్వ వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఈ గోపాలకులకు, ఆహార ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా నిలిచాయి కాబట్టి అఖిలేష్‌ మొదలెట్టిన ఈ కొత్త ప్రయోగం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితం, 2024లో జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తుందన్నది తెలిసిన వాస్తవమే. ప్రత్యేకించి యూపీ, పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోదీకి కీలక సవాలు కానున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణ చట్టాలపై రైతులు చేసిన పోరాటంలో ప్రధాని ప్రతిష్ఠ మసకబారింది. సంవత్సరం తర్వాత ఆ చట్టాలను బేషరతుగా ఉపసంహరించుకోవడంతో మోదీ ప్రభుత్వం నైతికంగా,  రాజకీయంగా ఓటమి చెందినట్లేనని చెప్పాలి.

దాదాపు 14 నెలల పాటు రైతులు చేసిన చారిత్రక పోరాటం, ఆ క్రమంలో 750 మంది రైతులు మరణించడం... మోదీ పాలనలో సాధించిన సానుకూల ఫలితాలను తోసిరాజనడం గమనార్హం. మోదీ స్వయంగా ఎంచుకున్న గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ (ఈయన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కి చెందిన జాట్‌ కావడం విశేషం) ప్రధాని అధికారాన్ని నేరుగా ప్రశ్నించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రధానికీ, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌కీ మధ్య సమరంగా ముద్రపడ్డాయి. మోదీ ఈ సమరంలో ఓడిపోయినట్లయితే, భారతదేశ భవిష్యత్తు కొత్త దిశలో నడుస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే అఖిలేష్‌ యాదవ్‌ యువ కుడు మాత్రమే కాదు... ఇప్పటికే జాతీయస్థాయిలో అనుభవజ్ఞుడైన నిపుణ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు.

చారిత్రకంగా శూద్రులుగా గుర్తింపు పొందిన దేశీయ ఆహార ఉత్పత్తి శక్తులు ఇప్పుడు నరేంద్రమోదీకి వ్యతిరేకంగా తిరగబడు తున్నాయి. 2014లో మోదీ ఇచ్చిన ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌’ నినాదంలో ఇక ఏమాత్రం విశ్వసనీయత లేదని రైతులు గ్రహించారు. దేశ ఆహార ఉత్పత్తిదారుల ప్రయోజనాలకు ఆరెస్సెస్, బీజేపీ వ్యతి రేకమన్నది నిరూపిత సత్యం. ఆరెస్సెస్, బీజేపీ మెజారిటీవాదం అనే భావన అర్థరహితమైనదని కేంద్రప్రభుత్వంపై రైతుల సుదీర్ఘ పోరాటం స్పష్టంగా నిరూపించింది. వ్యవసాయ సంస్కరణ చట్టా లను ఉపసంహరించుకునేలా మోదీని ఒత్తిడికి గురి చేసింది మన దేశంలోని మెజారిటీ శూద్ర, ఓబీసీ ఆహార ఉత్పత్తిదారులేనని మర్చి పోరాదు.

గుజరాత్‌కు చెందిన రెండు లేదా మూడు గుత్తపెట్టుబడిదారీ కుటుంబాల ప్రయోజనాల కోసమే కేంద్ర పాలకులు పనిచేస్తున్నారని మన దేశ రైతులు యావత్‌ ప్రపంచానికీ స్పష్టం చేశారు. మోదీ, అమిత్‌ షా కూడా గుజరాత్‌ నుంచి వచ్చారు. అలాగే మోహన్‌ భగవత్, దత్తాత్రేయ హొసబలే వంటి ఆరెస్సెస్‌ అగ్రశ్రేణి నేతలు కూడా ఈ రాష్ట్రం నుంచే వచ్చారు. శూద్ర, ఓబీసీ, దళిత్, ఆదివాసీ శక్తులు ఇప్పుడు ఈ వాస్తవాన్ని గ్రహించారు కూడా. ఈ గ్రహింపు ఇక ఓటర్ల చైతన్యంలో ఇంకిపోవడమే జరగాల్సింది. ప్రతిపక్ష పార్టీలపై ప్రత్యే కించి యూపీలో ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీపై డబ్బు, అధికార బలాన్ని ఉపయోగించి దెబ్బకొట్టాలని చూస్తున్న కేంద్ర పాలకుల విధానాలను ఓటర్లు అధిగమించాల్సి ఉంది. 

వాస్తవానికి అఖిలేష్‌ యాదవ్‌ వంటి యువ, నిపుణ శూద్ర నేత యూపీ పరిధిని దాటి రాజకీయంగా ఎదగడం చూసి ఆరెస్సెస్, బీజేపీ శక్తులు కలవరపడుతున్నాయి. అందుకే వీరు రామాలయం, రామ రాజ్యం వంటి అంశాలతో ఓటర్ల మనోభావాలను ప్రభావితం చేయ డానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాజాగా అఖిలేష్‌ యాదవ్‌... శూద్ర, ఓబీసీలకు అత్యంత ఆమోదనీయుడైన శ్రీకృష్ణుడిని రంగం మీదికి తీసుకురావడం ద్వారా చాలా నైపుణ్యంతో బీజేపీపై పోరా టాన్ని ప్రారంభించారు. అయోధ్య, ముస్లిం వ్యతిరేక వైఖరి వంటి అంశాలను దాటి ఇప్పుడు అన్నిటికంటే ప్రజల జీవితాలే కీలక సమస్యగా ముందుకొచ్చాయి. ప్రత్యేకించి, ఆరెస్సెస్, బీజేపీ ప్రచారం లోకి తీసుకొచ్చిన ‘హమ్‌ సబ్‌ హిందూ’ నినాదాన్ని ఇప్పుడు రైతులు ఏమాత్రం నమ్మడం లేదు.

ఇటీవలిదాకా ఆరెస్సెస్, బీజేపీ నేతలు ముస్లింలను శత్రువులుగా భావిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం, ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగి ప్రాణాలు కోల్పోయిన రైతులను తమకు అత్యంత ప్రధాన శత్రువులుగా చూస్తున్నారు. సనాతన వర్ణధర్మ మనస్తత్వంతో, భారతీయ రైతులకు వ్యతిరేకంగా రామరాజ్య భావన ఎలా పనిచేస్తుందో వీరు ఇటీవలిదాకా చేసి చూపించారు. శ్రామికులు, రైతులు, చేతివృత్తులవారి ప్రయోజనాలకు ఆరెస్సెస్‌ భావజాలం వ్యతిరేకమైనదనే గ్రహింపు ఇదివరకు శూద్రులు, ఓబీసీ లకు ఉండేది కాదు. అయితే వ్యవసాయ చట్టాలపై పోరాటంలో, రైతులు చూపించిన మార్గం తాము ఎలా ఉండాలనే విషయంపై వీరికి ఇప్పుడు పూర్తి గ్రహింపు నిచ్చాయి. 

శ్రీకృష్ణ రాజ్యమే సమాజ్‌ వాదీ పార్టీ సోషలిస్టు రాజ్యమని అఖిలేష్‌ యాదవ్‌ ఇచ్చిన నినాదం బీజేపీ రామరాజ్య భావన కంటే మించిన మనోభావాలను ఇప్పుడు శూద్ర, ఓబీసీ వర్గాల్లో కలిగి స్తోంది. గోపాలకుడిగా, పిల్లనగ్రోవిని ధరించి ఉండే శ్రీకృష్ణుడి ఇమేజిని అఖిలేష్‌ తాజాగా ప్రయోగించారు. బీజేపీ తీసుకొచ్చిన రామరాజ్య భావన కంటే అఖిలేష్‌ ప్రతిపాదించిన కృష్ణ రాజ్య భావనను ప్రజులు ఇప్పుడు మరింత ఎక్కువగా విశ్వసిస్తారు. ఎందుకంటే కేంద్రప్రభుత్వ వ్యవసాయ సంస్కరణ చట్టాలు ఈ గోపాలకులకు, ఆహార ఉత్పత్తిదారులకు వ్యతిరేకంగా ఎదురు నిలిచాయి. పౌరాణిక గాథలతో ప్రజల మనోభావాలను జ్వలింప చేయడం, వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి జరుగుతోంది.

ఒక అభిప్రాయం ప్రకారం, కృష్ణుడు ఎన్నడూ బ్రాహ్మణ గురువుల అనుయాయిగా వ్యవహరించలేదు. తనకు తానే ‘దేవుళ్లకు దేవుడు’గా ప్రకటించు కున్నాడు. పైగా తన విశ్వరూప ప్రదర్శన ద్వారా మహాభారతంలో బ్రాహ్మణులకు వారి చోటు ఎక్కడుందో చూపించాడు. గోపాలకుడిగా ఉంటూ బ్రాహ్మణులకంటే ఆధిక్యతా స్థానంలో ఉన్నందువల్లే శ్రీకృష్ణుడి ఇమేజిని ఆరెస్సెస్‌ ప్రోత్సహించలేదు. శ్రీకృష్ణుడి స్వయం సత్తాక ఆధ్యాత్మిక ఘనతను శూద్రులు, ఓబీసీలు గుర్తించాల్సి ఉంది. అప్పుడు మాత్రమే వారు అఖిలేష్‌ యాదవ్‌ తాజాగా ఇచ్చిన కృష్ణ రాజ్య నినాదాన్ని తమ సొంతం చేసుకుంటారు.

ఈ ఏడేళ్లలో గ్రామీణ పేదలు, రైతులు, విద్యార్థుల ప్రయో జనాలకు వ్యతిరేకంగా బీజేపీ పాలన వ్యవస్థీకృతంగా నడిచింది. స్టార్టప్‌ బిజినెస్‌ ప్రారంభించిన ఆహారేతర ఉత్పత్తిదారు లకు కొంత సంపదను పంపిణీ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం శూద్రులు, ఓబీసీలు, దళితులు, ఆదివాసీల్లో ఒక్కరంటే ఒక్కరిని కూడా బడా వాణిజ్య నెట్‌వర్క్‌ లోకి ప్రోత్సహించిన పాపాన పోలేదు. అప్రతిష్ఠ పాలైన యోగీ ఆదిత్యనాథ్‌ను బలపర్చడానికి మోదీ ప్రభుత్వం పాటుపడుతోంది. తాజాగా, సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల ఇళ్లపై దాడి చేసేందుకు సీబీఐ, ఆదాయ పన్ను అధికారులును పంపించారు.

ఇంతవరకు జైన వ్యాపార వర్గాలపై మోదీ, అమిత్‌ షా కన్ను పడలేదు. యూపీలోని జైనుల్లో చాలామంది బీజేపీ మద్దతుదారులే. కానీ అఖిలేష్‌ యాదవ్‌ని బలపరుస్తున్న జైనులపై ఇప్పుడు దాడి చేశారు. పొరపాటుగా బీజేపీ మద్దతు దారుడైన జైన్‌ ఇంటిపై కూడా దాడి చేస్తే పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడింది. ఏ రాష్ట్రంలో అయినా సరే... ఎన్నికల్లో గెలవడానికి తగిన ఆర్థిక దన్ను ఉన్న ప్రతిపక్షాన్నీ, దాని మద్దతుదారులనూ కేంద్ర పాలకవర్గం అసలు సహించబోదని ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. ఒక సమగ్రమైన రాజ్యాంగంతో ఏర్పడిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ తమకు ఆమోదనీయం కాదని ఆరెస్సెస్, బీజేపీ ప్రతిరోజూ తమ చర్యల ద్వారా నిరూపిస్తూ వస్తు న్నాయి. ఎన్నికల నియమాలను తమకు అనుకూలంగా మార్చు కోవడం ద్వారా భారత ప్రజాస్వామ్య నిర్వచనాన్నే వీరు తోసి పుచ్చుతున్నారు. దీనివల్ల మొత్తం వ్యవస్థ కుప్పగూలిపోతుంది. ప్రజాస్వామ్య భావనకు తూట్లు పొడుస్తున్న ప్రస్తుత కేంద్రపాలక పార్టీ విధానంపై జాతీయ స్థాయిలో అన్ని ప్రతిపక్షాలూ కలసి పోరాడాల్సి ఉంది. 


ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top