అక్కడ ఇంగ్లిష్‌! ఇక్కడేమో హిందీనా?

Kancha Ilaiah Guest Column On English Language - Sakshi

విశ్లేషణ

భారతదేశంలో ఇంగ్లిష్‌ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్‌ 5 నాటికి 204 ఏళ్లవుతుంది. ఇంగ్లిష్‌ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. కానీ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి. ఇది దళిత, బీసీ, శూద్ర, ఆదివాసీ యువతకు ఇంగ్లిష్‌ను దూరం చేయడంలో భాగమే. 

భారతదేశంలో ఇంగ్లిష్‌ భాష జీవం పోసుకొని 2021 అక్టోబర్‌ 5 నాటికి 204 సంవత్సరాలవుతుంది. ప్రతి ఏటా ఆ రోజున భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 1817 అక్టోబర్‌ 5న కోల్‌కతాలో మొట్టమొదటి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల ప్రారంభమైంది మొదలుకొని ఇంగ్లిష్‌ భాషను లేకుండా చేయడానికి భారతదేశం ఎన్నడూ అనుమతించలేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ నేడు ఇంగ్లిష్‌ వృద్ధి చెందుతోంది. ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాలను సవాలు చేస్తున్న చైనా... మాండరిన్‌ భాషతో పాటు ఇంగ్లిష్‌ని కూడా తన సొంతం చేసుకుంది. భారత్, చైనా రెండూ తమ మాతృభాషలతోపాటు ఇంగ్లిష్‌ని తమ పిల్లలందరికీ బోధించినట్లయితే, (ఉదాహరణకు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ లాగా) ఎవరూ ఊహించలేనంత వేగంగా అది అంతర్జాతీయ అనుసంధానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని మార్చివేస్తుంది.

చాలా కాలం క్రితం ఒక ఇజ్రాయెల్‌ ప్రవక్త, ప్రపంచమంతా ఒకే భాషను మాట్లాడే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. అయితే ఆ భాష ఏది అని ఆయన అప్పట్లో చెప్పలేదు. ఇప్పుడు ఆ భాష ఇంగ్లిషేనని మనం చెప్పవచ్చు.  భూమండలంలోని అత్యధిక సంఖ్యాక ప్రజలు మాట్లాడుతున్న, రాస్తున్న, అర్థం చేసుకుంటున్న భాష ఇంగ్లిష్‌ మాత్రమే. ప్రపంచంలో మాట్లాడే, రాసే భాషలకు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ఇంగ్లిష్‌ వల్లే, ప్రపంచం నలుమూలల్లో ఉన్న మానవులు మరింతగా అనుసంధానమయ్యారు. పరస్పరం జ్ఞానాన్ని పెంచుకున్నారు. మానవ చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి గుణాత్మక మార్పు జరగలేదు.

చరిత్రలో చాలాకాలం పాటు అనేక తెగలు అతి చిన్న బృందాలతో భావవ్యక్తీకరణ చేసుకునే భాషా యంత్రాంగాలతో జీవించేవి. ఒకే ప్రాంతంలో లేదా ఒకే దేశంలోని ఇతర భాషా బృందాలతో ఇవి వ్యక్తీకరణ సామర్థ్యాన్ని కలిగి ఉండేవి కాదు. కానీ ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఇలాంటి పరిమిత స్థాయిలోని అనేక బృందాల్లోకి ఇప్పుడు ఇంగ్లిష్‌ భాష కొద్దో గొప్పో చొచ్చుకుపోయింది. ఇలాంటి అనేక భాషా బృందాలకు పదాలు, వాక్యాల రూపంలో చేరువైన ఇంగ్లిష్‌ భాష... వారిని ఇంతవరకు తమకు తెలియని స్థలాల్లోని పెద్ద పెద్ద మార్కెట్లతో కూడా భావ ప్రసారం జరుపుకొనేలా చేసింది.

పరస్పరం భావ వ్యక్తీకరణ, భావ ప్రసారం చేసుకోలేని వేలాది చిన్న చిన్న భాషా బృందాల ఉనికికి భారతదేశం ఒక ప్రామాణిక ఉదాహరణగా నిలుస్తుంది. తమకు సమీపంలోనే ఉంటున్న ఇతర భాషా బృందాలకు, పట్టణ మార్కెట్లకు పెద్దగా పరిచయం కాకుండానే మనుగడ సాగిస్తున్న తెగలు, పర్వత ప్రాంతాల్లో నివసించే భాషా బృందాలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. ఇతర సంస్కృతులకు, జీవన విధానాలకు పరిచయం కాకుండానే నివసిస్తున్న భారతీయ ఉత్పాదక ప్రజారాశులకు భాషే ప్రధాన అవరోధం. కానీ కేవలం 200 సంవత్సరాలలోపే ఈ భాషాపరమైన అవరోధాన్ని ఇంగ్లిష్‌ తొలగించివేసింది. ప్రత్యేకించి గత 30 ఏళ్లుగా ప్రపంచీకరణ, దేశ ప్రజలను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడంతో ప్రజల భావ వ్యక్తీకరణలో చాలా మార్పులొచ్చాయి. పాఠశాలల్లో విద్యార్థులకు క్రమబద్ధమైన ఇంగ్లిష్‌ నేర్పింది ప్రభుత్వాలు కాదు. ప్రపంచవ్యాప్తంగా నిరక్షరాస్యులకు, వివిధ భాషా బృందాలకు ఇంగ్లిష్‌ నేర్పుతూవచ్చింది మార్కెట్‌ మాత్రమే.

ఒక భాషగా ఇంగ్లిష్‌ని మాట్లాడటం, రాయడం తెలీనప్పటికీ సమాజానికీ లేదా మార్కెట్‌కీ ప్రాణాధారమైన విషయాలను మనం ఇంగ్లిష్‌ ద్వారానే తెలుసుకుంటూ వస్తున్నాము. ఆ భాష తెలీకున్నా వాటర్, ఫుడ్, బస్, ట్రెయిన్, సాల్ట్, రైస్, టికెట్, మిల్క్, టీ, బెడ్, ఫోన్, లిక్కర్, ప్లేట్‌ వంటి ఎన్నో ఇంగ్లిష్‌ పదాలను మనం సాధారణ అవగాహనతో అర్థం చేసుకుంటున్నాము. ప్రపంచంలోని నలుమూలల్లో ఇంగ్లిష్‌ ఇలాంటి పదాలతో చొచ్చుకుపోయింది.

అత్యంత వెనుకబడిన ప్రాంతంలోని తెలుగు మాట్లాడే ఓ కుగ్రామంలోని సగటు నిరక్షరాస్యుడైన కూలీకి కూడా ఇప్పుడు కనీసం 250 నుంచి 300 వరకు ఇంగ్లిష్‌ పదాలు తెలుసు. దేశవ్యాప్తంగా రిక్షా తోలేవారు, ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, ధాన్యం, కూరగాయలు అమ్మేవారు, కార్మికులకు కూడా ఇంగ్లిష్‌ పదాలతో  పరిచయమైపోయింది. మరే స్థానికేతర భాషా పదాలు కూడా ఇంగ్లిష్‌ లాగా జనజీవితంలో ఈ స్థాయిలో ప్రవేశించలేదు. భారతదేశంలో ఎక్కువమంది ప్రజలు మాట్లాడే, రాసే భాష హిందీ అని తెలుసు. కానీ దేశం నలుమూలల్లో హిందీ కంటే ఎక్కువగా ఇంగ్లిష్‌ పదాలే ఎక్కువ మంది ప్రజల వాడుకలోకి వచ్చేశాయి.

వివిధ యాసలతో కూడిన సాధారణ సంభాషణకు సంబంధించి 250 నుంచి 300 పదాలను తెలుసుకుంటే చాలు... మనకు తెలియని మార్కెట్లో కూడా ఇతరులతో భావ వ్యక్తీకరణ సాధ్యమవుతుంది. కాబట్టి భారతీయ గ్రామం నుంచి ఒక కూలీని మనం ఆఫ్రికన్‌ లేదా లాటిన్‌ అమెరికన్‌ దేశంలోకి పంపించినట్లయితే, అక్కడి స్థానిక భాషను నేర్చుకోకపోయినా అతిముఖ్యమైన ఇంగ్లిష్‌ మార్కెట్‌ పదాల సహాయంతో వాళ్లు ఆ దేశాల్లో మనగలుగుతారు. ఇక స్థానిక భాషను కూడా నేర్చుకుని ఇంగ్లిష్‌ని మెరుగుపర్చుకుంటే మరింత మెరుగ్గా జీవించగలరు. కొన్ని పదాలను తెలుసుకోవడం ద్వారా యావత్‌ ప్రపంచంలో ఇంత సులభంగా జీవించగల, మనుగడ సాధించగల అవకాశాన్ని ఇంగ్లిష్‌ తప్ప మరే భాషా కల్పించడం లేదు.

ఇంగ్లిష్‌ పదాలు, భాష ప్రపంచంలోని నలుమూలలకు ఇంత విస్తృతంగా ఎలా విస్తరించాయి అంటే ప్రపంచీకరణ మార్కెట్టే అని చెప్పాలి. చారిత్రకంగా సంస్కృతంపై నియంత్రణ సాధిస్తూవచ్చిన బ్రాహ్మణులు, ఇతర ద్విజ కులస్థులు... ఇప్పుడు వారు ఏ పార్టీలో లేదా ఏ సంస్థలో ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై అదుపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. పురాతనకాలంలో సంస్కృతం లాగా, నాణ్యమైన ఇంగ్లిష్‌ ఇప్పటికే వీరికి ఆలంబనగా మారిపోయింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ఇటీవలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్, భారతీయ జనతా పార్టీలు ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.

అదేమిటంటే శూద్రులు, దళితులు, ఆదివాసీలు, ఇతర పేదప్రజల పిల్లలు మాతృభాషలోనే చదువుకోవాలట! ఇంగ్లిషేతర భాషే విద్యా మాధ్యమంగా ఉండాలట! చివరకు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో పీహెచ్‌డీ సిద్ధాంత పత్రాలను కూడా హిందీలోనే రాసి సమర్పించేలా హిందీని బోధనా మాధ్యమంగా మార్చేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదేసమయంలో ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, పాఠశాలలు, కాలేజీల్లో ఇంగ్లిష్‌నే బోధించేలా, పరిశోధనను కూడా ఇంగ్లిష్‌లోనే చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందించాయి.

దేశంలో అగ్రవర్ణాల (బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖాత్రీలు, క్షత్రియులు) యాజమాన్యంలోని గుత్త పారిశ్రామిక కంపెనీలు అశోక, అమిటీ, ఓపీ జిందాల్‌ వంటి అత్యున్నత ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలను నెలకొల్పాయి. ఇవి ఇంగ్లిష్‌ మాధ్యమంలో బోధించేందుకు యూరో–అమెరికన్‌ సిలబస్‌ని చేపడుతున్నాయి. మరోవైపున ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటినీ ప్రాంతీయ భాషలో ప్రధానంగా హిందీ మీడియంలో బోధన చేసేలా కేంద్ర ప్రభుత్వం పథక రచన చేస్తోంది. దీని పర్యవసానంగా దళితులు, ఓబీసీలు, శూద్రులు, ఆదివాసీ యువత పూర్తిగా చలనరహితంగా ఉండిపోతారు. మెరుగైన విద్యా, జీవన అవకాశాల కోసం ఇక వారు ఎక్కడికీ వెళ్లలేరు. ఉత్పాదక కులాల నుంచి ఇంగ్లిష్‌ చదవగల, రాయగల మేధావులు ఉద్భవించకూడదని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కోరుకుంటున్నాయి.

కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో చదువుకుంటున్న యువత భారతీయ ఇంగ్లిష్‌ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలి. సంపన్న అగ్రవర్ణ యువతతో సమానంగా అంతర్జాతీయ భాషను నేర్చుకుంటున్న దళిత, ఆదివాసీ, శూద్ర యువతకు వ్యతిరేకంగా పథక రచన చేస్తున్న శక్తులను ఆ విధంగా ఓడించగలగాలి.


ప్రొ. కంచ ఐలయ్య షెపర్డ్‌
వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top