India 75th Independence Day 2021: తెలుగు రైతుల శోభ

India 75th Independence Day 2021: Azadi Ka Amrut Mahotsav Telugu Farmers - Sakshi

2002 ఆగస్ట్‌ 15 నుంచి భారతదేశ స్వరాజ్య ఫలసిద్ధి అమృతోత్సవం. ఇప్పటి తరం వారికి దేశభక్తి, పట్టుదల, కష్టసహి ష్ణుత, సాంస్కృతిక సదవగాహన కలిగించే ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం తలపెట్టింది. ‘మాదీ స్వతంత్య్ర జాతి, మాదీ స్వతంత్య్ర దేశం’ అని అప్పటి తరాల వారు గానం చేశారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి గొప్ప వాగ్గేయకారుడు ‘మాదీ స్వతంత్ర జాతి, మాదీ స్వతంత్ర దేశం’ అని అప్పట్లో ఉత్సాహోద్దీప్తంగా గానం చేశామని ఒక సభలో ఇటీవల ప్రసక్తం చేశాడు. 

మనకు స్వరాజ్యం లభించి, మన పెద్దల దీక్ష ఫలించి 75 సంవత్సరాలు అవుతున్నాయి. సాటి ప్రపంచంలో మేటి గౌరవం లభించిన తరుణం భారతీయులంతా గొప్పగా తలచుకొనవలసినది. ఈ శుభ సమయం సంఘటించి 75 సంవత్సరాలే అవుతున్నా, దీనికి సుమారు రెండు శతాబ్దాల పూర్వ నేపథ్యం ఉంది. ఈ తలంపు ఆనందప్రదం. 

అఖిల భారత జాతీయ కాంగ్రెసు ఆవిర్భవించిన(1885) పది సంవత్సరాల తరువాత తన ‘వివేకవర్ధని’ పత్రికలో దేశీయ మహా సభయు, దాని యుద్దేశములును’ అని వీరేశలింగం జాతీయ కాంగ్రెసు లక్ష్యాలు, ఆదర్శాలు, ఆశయాలు ఏమిటో తెలుగువారికి తెలియ జెప్పాడు. వీరేశలింగం జాతీయవాది కాదనటం సరికాదు. అట్లా అంటే గురజాడను కూడా తప్పుపట్టవలసి ఉంటుంది. 

1892 నాటికే గుంటూరులో ‘రేట్‌ పేయర్స్‌ అసోసియేషన్‌’ అనే సమాజ హిత పోరాట సంస్థ ఆవిర్భవించింది. వ్యక్తిగత విజ్ఞప్తులు, విన్న పాలు కాక సంస్థా సంఘటిత విధానంలో ప్రభుత్వం వారి పన్ను వసూలు అనే చిత్రాన్ని చాటిచెప్పడం ఈ సంస్థ లక్ష్యం. ఈ సంస్థ వారికి పూనాలోని ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ సంస్థను నడుపుతున్న గోపాల కృష్ణ గోఖలే మహాశయుడి సలహా సంప్రదింపులు, కార్యక్రమ అనుసంధానం ఉండేది. 

ఎవరు ఉత్సహించకపోయినా, పట్టుదల చూపకపోయినా తెలుగు వారు ఒక్కరే పూనుకొని మనకు స్వాతంత్య్రం తేవటానికి సమర్థులు అని మహాత్మాగాంధీ తెలుగు వారి ధైర్యస్థైర్యాలను ప్రశంసించినట్లు కొండ వెంకటప్పయ్య చరిత్ర వక్కణం. దక్షిణాఫ్రికా నుంచి స్వదేశం తిరిగి వచ్చిన తరువాత మహాత్మాగాంధీ (1915) నెల్లూరు దర్శించాడు. నెల్లూరులోని ప్రజాచైతన్య విజ్ఞాన సంవర్ధన సంస్థ వర్ధమాన సమాజంలో బహిరంగ సభ జరిపినప్పుడు గాంధీ మహాత్ముణ్ణి దర్శించటానికి నెల్లూరు పరిసరాల రైతులు వచ్చారు. తలపాగాలు ధరించి, వదనాలపై దైవీయ శోభ తొలుకాడగా వచ్చిన ఆ రైతులను చూసి గాంధీజీ– ఇంతటి దృఢగాత్రులు, కష్ట శరీరులున్న మన దేశానికి పారతంత్య్రమా, దరిద్రమా అని ఖేదం చెందినట్లు బెజవాడ గోపాలరెడ్డి నెల్లూరులో ఒక సభలో చెప్పారు. ఈ రైతులు తమ గుజరాత్‌ రైతుల వలెనే ఉన్నారని ఆయన అన్నారట. 

– అక్కిరాజు రమాపతిరావు
రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top