అశోక్‌ గెహ్లోత్‌ (రాజస్థాన్‌ సీఎం) రాయని డైరీ | Ghulam Nabi Azad Resigns Congress Blaming Rahul Gandhi By Rayani Diary | Sakshi
Sakshi News home page

అశోక్‌ గెహ్లోత్‌ (రాజస్థాన్‌ సీఎం) రాయని డైరీ

Aug 28 2022 1:11 AM | Updated on Aug 29 2022 12:22 PM

Ghulam Nabi Azad Resigns Congress Blaming Rahul Gandhi By Rayani Diary - Sakshi

‘అమ్మా.. నీ కొడుకు సమర్థుడు కాదు’ అనేనా?! మరి యాభై ఏళ్లుగా సమర్థుడిగా ఉండి, ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిందేమిటి?

రాహుల్‌ని నిందిస్తూ సోనియాజీకి గులామ్‌ నబీ ఆజాద్‌ రాసిన ఐదు పేజీల రాజీనామా లేఖ నాకెంతో ఆవేదనను కలిగించింది. ఒక తల్లికి ఆయన ఏం చెప్పదలచుకున్నారు? ‘అమ్మా.. నీ కొడుకు సమర్థుడు కాదు’ అనేనా?! మరి యాభై ఏళ్లుగా సమర్థుడిగా ఉండి, ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీకి చేసిందేమిటి? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పించిన పద్మభూషణ్‌ని రెండు చేతులతో అపురూపంగా స్వీకరించడమేనా! అవార్డు కోసం ఆయన పట్టిన చేతులు ఎక్కడివి? కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినవే కదా. కాంగ్రెస్‌ లేనిదే తను లేనన్న సంగతిని మరిచి, కాంగ్రెస్‌కు ఎవరూ లేకుండా పోతున్నప్పుడు ప్రధాన ద్వారం వద్ద తను కాపలా ఉండి, కాంగ్రెస్‌ని కాయాల్సింది పోయి, ‘నేనూ వెళ్లిపోతున్నాను – ఇట్లు ఆజాద్‌’ అని ఉత్తరం రాసి వెళ్లిపోతారా?! 

రాహుల్‌ పట్టించుకోనందువల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని ఆరోపిస్తున్న ఆజాద్‌.. తనెందుకు కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా రాహుల్‌లోని ‘అపరిపక్వత’ను పట్టించుకుంటున్నారు?! తన పరిపక్వతను ప్రదర్శించుకోడానికా? ‘‘మేడమ్‌జీ, నేనుంటాను కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా..’’ అని భరోసాగా పగ్గాలెందుకు అడిగి తీసుకోలేకపోయారు?

ఇస్తే తీసుకుందాం అని చూస్తున్నవాళ్లా, ఇస్తున్నా తీసుకోడానికి ఆసక్తి చూపనివాళ్లా .. ఎవరు అసమర్థులు? తల్లి మెడికల్‌ చెకప్‌ కోసం ఆ కుటుంబం దేశం దాటి వెళ్లిన సమయం చూసి, తనిక్కడ గడప దాటి కాంగ్రెస్‌ కుటుంబ గౌరవాన్ని బయటపడేశారు ఆజాద్‌! ఆ గౌరవం తిరిగి నిలబడాలంటే  రాహుల్‌ గాంధీ పార్టీ ప్రెసిడెంట్‌ అవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. వట్టి మార్గం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన వాళ్లందరికీ గట్టి సమాధానం కూడా. 

వెళ్లినవాళ్లు హూందాగా ఒక్కరైనా వెళ్లారా! రాహుల్‌పై ఒక రాయి విసిరే వెళ్లారు. పార్టీని బతికించుకుందామని అనుకున్నవాళ్లు పార్టీలో ఉండి, పార్టీతో పోరాడతారు. పార్టీలో తమకు బతుకు లేదనుకున్నవాళ్లే ఇలా గులామ్‌ నబీ ఆజాద్‌లు, జైవీర్‌ షేర్గిల్‌లు, కపిల్‌ సిబాల్‌లు, ఆశ్వినీ కుమార్‌లు, ఆర్పీయన్‌ సింగ్‌లు, సునీల్‌ జాఖడ్‌లు, జ్యోతిరాదిత్య సింథియాలు అవుతారు. ఈ రాళ్లన్నిటికీ తిరుగులేని జవాబు.. రాహుల్‌ బాబు.  రాహుల్‌కి ఫోన్‌ చేశాను. న్యూయార్క్‌లో స్టే చేసినట్లున్నారు. ‘‘మేడమ్‌ ఎలా ఉన్నారు రాహుల్‌?’’ అని అడిగాను.  ‘‘ఇంకెలా ఉంటారు అశోక్‌జీ. పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండేందుకు మీరు అంగీకరించి ఉండాల్సింది అని మమ్మీ ఇంతక్రితం కూడా అన్నారు. ఇప్పుడే చెకప్‌ కోసం లోపలికి వెళ్లారు’’ అన్నారు రాహుల్‌. ‘‘గాంధీలు కాకుండా వేరొకరు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా ఉండటం దేశానికి కలిసిరాలేదు రాహుల్‌బాబూ. ఇండియా తిరిగి రాగానే మీరు మీ సహజమైన కృతనిశ్చయం ప్రతిఫలించే చిరునవ్వుతో పార్టీ బాధ్యతలు స్వీకరించాలి’’ అని అభ్యర్థించాను.

రాహుల్‌ పెద్దగా నవ్వారు. ‘‘ఏంటి రాహుల్‌ నవ్వుతున్నారు?’’ అన్నాను. ‘‘నా సహజమైన కృతనిశ్చయం దేనికి సంబంధించినదో తెలిసుండి కూడా అందుకు పూర్తి విరుద్ధమైన ప్రతిఫలనాన్ని మీరు నాలో ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంటే నవ్వొచ్చింది అశోక్‌జీ..’’ అన్నారు! ఆ మాటకు ముగ్ధుడినైపోయాన్నేను. అంత క్లారిటీని ఇంతవరకు నేను ఏ కాంగ్రెస్‌ నాయకుడిలోనూ చూళ్లేదు! పార్టీ అయోమయంలో ఉండొచ్చు. రాహుల్‌ స్పష్టంగానే ఉన్నారు.  తమకేం కావాలో పైకి చెప్పని గులామ్‌ నబీ ఆజాద్‌ వంటి వాళ్ల కన్నా, తనకేం వద్దో తెగేసి చెబుతూ వస్తున్న రాహుల్‌బాబే ఎప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీని గట్టెక్కించగల నాయకుడని నాకనిపించింది. (క్లిక్‌: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement