లాభం శూన్యం... నష్టాలు అనంతం!

Devinder Sharma Article On Indian farmer Situation - Sakshi

విశ్లేషణ

ఒక సగటు భారతీయరైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన స్థితిలో ఉన్నాడని జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) నివేదిక సూచిస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా దేశంలో రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీ ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది ప్రతిఫలంగానే చెప్పాల్సి ఉంటుంది. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వరుసగా అమలు చేస్తూ వచ్చిన వ్యవసాయ వ్యతిరేక విధానాల ఫలితమే. గ్రామీణ ప్రజలను వ్యవసాయం నుంచి పక్కకు నెట్టడమే వీటి లక్ష్యం. అందుకే కొన్ని దశాబ్దాలుగా రైతులకు దక్కుతున్నది శూన్యం. కష్టాలు, కడగండ్లు మాత్రం అనంతం.

ప్రపంచ వాణిజ్య సంస్థ 1995లో ఉనికిలోకి వచ్చిన కొన్నేళ్ల తర్వాత లండన్‌కి చెందిన ‘ది ఎకాలజిస్టు’ పత్రిక నన్ను ఆహ్వానించి, భారతీయ రైతును యూరోపియన్‌ రైతుతో పోలుస్తూ ఒక వ్యాసం రాయమని కోరింది. భారత్‌లో సాపేక్షికంగా తక్కువ ఖర్చుతో సాగే వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రపంచ వాణిజ్యానికి తలుపులు తెరిచాక భారతీయ రైతులు ఆర్థికంగా ఎలా ప్రయోజనం పొందారు అనేది ఆ వ్యాసం లక్ష్యంగా ఉండాలని నాకు సూచించారు. పెరుగుతున్న పట్టణీకరణ వేగంగా ఆర్థిక వృద్ధికి దారితీస్తుందని, వ్యవసాయాన్ని క్షీణింపజేస్తుందని,  రైతులు సాగును వదిలిపెట్టి వలసపోతారన్నది ఆ పత్రిక అభిప్రాయం. రైతుల వ్యతిరేకత పెరుగుతున్నప్పటికీ ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో చేరవలసిన అవసరాన్ని సమర్థించుకోవడానికి ఆనాడు ప్రధాన స్రవంతి ఆర్థికవేత్తలు సాధారణంగా పేర్కొంటూ వచ్చిన అభిప్రాయమిది. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒప్పందం అనేక అవకాశాలను కల్పించి రైతులకు స్వర్గ ద్వారాలను తెరుస్తుందనేంత విపరీత అభిప్రాయాన్ని కూడా వీరిలో ఒకరు వ్యక్తపరిచారు. వ్యవసాయ ఎగుమతులు పుంజుకోనుండటంతో వ్యవసాయ రాబడులు కూడా పెరుగుతాయని, దీంతో భారతీయ వ్యవసాయ రంగ దశ పూర్తిగా మారిపోతుందని ఇలాంటి వారు ఊదరగొడుతూ వచ్చారు. దీనికి ఎలాంటి ఆధారమూ లేనందున, వాస్తవానికి నేను ఆనాడు రాసిన వ్యాసంలో భారతీయ రైతును యూరోపియన్‌ ఆవుతో పోల్చి ముగించాను.

ప్రపంచ వాణిజ్య సంస్థను ప్రారంభించి దాదాపు 26 ఏళ్లు గడచిన తర్వాత, గ్రామీణ భారతంలోని వ్యవసాయ కుటుంబాల ఆదాయాలపై జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) అత్యంత నిరాశా చిత్రణతో కూడిన తాజా నివేదికను గత వారం విడుదల చేసింది. వ్యవసాయ పరిస్థితుల సర్వేపై (ఎస్‌ఓఎస్‌) రూపొందించిన ఈ నివేదికను 2018–19 సంవత్సరంలో నిర్వహించారు. భారతీయ రైతు సాధారణ కూలీ కంటే ఘోరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాడనే భయంకర వాస్తవాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. 75 ఏళ్ల స్వాతంత్య్రానంతరం కూడా రైతులు పంట సాగు ద్వారా కంటే రోజు కూలీల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తున్నారంటే, వ్యవసాయ రాబడులను ఉద్దేశపూర్వకంగా తగ్గించివేసిన ఆర్థిక నమూనాలకు ఇది పరాకాష్ట. నగరాల్లో జరిగే నిర్మాణ పనులకు కారు చౌక శ్రమ అవసరం కాబట్టి గ్రామీణ ప్రాంతాలనుంచి పట్టణాలకు వలసలను భారీగా ప్రోత్సహించడాన్ని మన విధాన నిర్ణేతలు కొనసాగిస్తూ వచ్చిన ఫలితమే ఇది.

చివరిసారిగా వ్యవసాయ పరిస్థితుల సర్వేని 2012–13 సంవత్సరంలో నిర్వహించినప్పుడు, దేశంలోని సగటు వ్యవసాయ కుటుంబం 48 శాతం ఆదాయాన్ని పంట సాగు ద్వారా ఆర్జించేది. 2018–19 సర్వే నాటికి ఇది 38 శాతానికి పడిపోయింది. ఇదే కాలంలో రోజుకూలీ ద్వారా రైతు కుటుంబ ఆదాయం 32 శాతం నుంచి 40 శాతానికి పెరిగింది. సగటు వ్యవసాయ కుటుంబం రోజుకూలీ ద్వారానే ఎక్కువగా సంపాదించడం మొదలైంది. కొన్ని వ్యవసాయ ఖర్చులను ముందుగానే చెల్లించివేయడం ప్రాతిపదికన, సగటు వ్యవసాయ కుటుంబానికి నెలకు రూ. 10,218 రూపాయల ఆదాయం వస్తుందని లెక్కగట్టారు. 2012–13 సంవత్సరంలో రైతుకుటుంబ ఆదాయం నెలకు రూ. 6,426లతో పోలిస్తే, ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక గత పదేళ్లలో పెరిగిన వ్యవసాయ కుటుంబ ఆదాయం 16 శాతం మాత్రమేనని తెలుస్తుంది. 2018–19 సంవత్సరంలో సగటు వ్యవసాయ కుటుంబ ఆదాయం నెలకు రూ. 8,337లకు చేరుకుంది. రైతు పెట్టే సొంత పెట్టుబడి, వేతనాలు చెల్లించని శ్రమ, సొంత పనిముట్లు, సొంత విత్తనాలు వంటివాటిని ముందుగానే చెల్లించే వ్యవసాయ ఖర్చుల కింద లెక్కగడుతున్నారని గమనించాలి.

ఇక పంట సాగు విషయానికి వస్తే సగటు వ్యవసాయ కుటుంబం 2018–19 సంవత్సరంలో రూ. 3,798లను సంపాదించేది. వాస్తవానికి ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేశాక, వ్యవసాయ ఆదాయం 2012– 13 నుంచి 2018–19 మధ్య కాలంలో 8.9 శాతం క్షీణించిపోవడం గమనార్హం. ఒక పత్రిక చేసిన ఆసక్తికరమైన విశ్లేషణ బట్టి పంట సాగు ద్వారా రోజుకు రూ. 27ల రాబడి మాత్రమే రైతుకుటుంబానికి దక్కుతోందని తెలుస్తుంది. జాతీయ ఉపాధి పథకంలో భాగంగా పనిచేసే కూలీ సైతం ఇంతకంటే ఎక్కువగా సంపాదిస్తుంటాడు. నేను చాలా కాలం నుంచి పదే పదే చెబుతున్నట్లుగా, పంట పండిస్తున్నందుకు రైతుపై జరిమానా విధిస్తున్నారని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సాగు ద్వారా రైతుకు వస్తున్న ఆదాయం రోజువారీగా ఆవుపాల ద్వారా వచ్చే ఆదాయం కంటే చాలా తక్కువ అని స్పష్టమవుతోంది. 

వ్యవసాయ రాబడి ఎంత తక్కువగా వస్తే, అంత ఎక్కువగా వివిధ మార్గాల్లో రైతు తీసుకునే అప్పులు పెరిగిపోతుంటాయి. 2012– 13 సంవత్సరంలో రూ. 47 వేలుగా ఉన్న సగటు రైతు కుటుంబం అప్పు 2018–19 నాటికి రూ. 74,100లకు పెరిగిపోయింది. దేశంలోని వ్యవసాయ కుటుంబాల్లో 50.2 శాతం అలివిమాలిన రుణభారంలో చిక్కుకుపోయి ఉన్నారు. 2021 మార్చి చివరినాటికి దేశంలో పేరుకుపోయిన రైతు రుణాల మొత్తం రూ. 16.8 లక్షల కోట్లకు పెరిగిందని పార్లమెంటుకు ప్రభుత్వం వివరించింది. 

దేశంలో దాదాపు 77 శాతం వ్యవసాయ కుటుంబాలు స్వయం ఉపాధిని ఆధారం చేసుకుంటున్న విషయాన్ని పరిశీలిస్తే, 70.8 శాతం వ్యవసాయ కమతాలు హెక్టారు కంటే తక్కువగా ఉన్నాయన్న వాస్తవం కలవరపెడుతుంది. 9.9 శాతం వ్యవసాయ కమతాలు మాత్రమే ఒకటి నుంచి రెండు హెక్టార్ల పరిమాణంలో ఉంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి ద్వారా, అనుబంధ పనుల ద్వారా రూ. 4,000 కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తూ, సంవత్సరంలో కనీసం ఒక కుటుంబ సభ్యుడు ప్రధానంగా వ్యవసాయ కార్యకలాపాల్లో ఉంటాడన్న అంచనాపైనే వ్యవసాయ కుటుంబాన్ని నిర్వచిస్తున్నాము. గ్రామీణ కుటుంబాల్లో 0.2 శాతం మాత్రమే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కలిగి ఉన్నారన్న వాస్తవాన్ని గమనిస్తే రైతు ఆందోళనలు బడా రైతుల ప్రయోజనం కోసమే జరుగుతున్నాయని ఆరోపించడం పచ్చి అబద్ధమేనని తేటతెల్లమవుతుంది.

రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు వరుసగా అమలు చేస్తూ వచ్చిన రైతు వ్యతిరేక విధానాల ఫలితమే. గ్రామీణ ప్రజలను వ్యవసాయం నుంచి పక్కకు నెట్టడమే వీటి లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల నుంచి జనాభాను పెద్ద ఎత్తున పట్టణాలకు తరలించడంపై ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఊదరగొడుతూ చేసిన ప్రచారం సమకాలీన ఆర్థిక చింతనపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టణీకరణ దశను పెంచడం అనేది ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని, వ్యవసాయాన్ని ఉద్దేశపూర్వకంగా క్షీణింపజేస్తూ వస్తే రైతులు తమ భూములు వదులుకుని వలస పోయే పరిస్థితులు ఏర్పడతాయన్నది ఈ ఆర్థిక చింతన సారాంశం. వ్యవసాయ పరిస్థితుల సర్వే 2018–19 పేర్కొన్న వాస్తవాలను కూడా మన ఆర్థికవేత్తలు తమకు అనుకూలంగా మల్చుకుని, పట్టణాలకు వలస ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విధానాలను మార్పుచేయాలని ప్రతిపాదిస్తే నేనేమాత్రం ఆశ్చర్యపోను.

ఈ రైతు వ్యతిరేక విధానాలను పూర్తిగా తిరగతోడాల్సి ఉంది.  ప్రతి ఏటా ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతూనే ఉంది. కానీ వ్యవసాయ రంగ ఆదాయాలు మాత్రం తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణ చట్టాలు వ్యవసాయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని రైతులు స్పష్టంగానే గ్రహించి జాగరూకతతో ఉన్నారు. రైతులు కోరుతున్నదల్లా ఒకటే... వ్యవసాయ ఆదాయ విధానాల పట్ల పునరాలోచన చేయాలనే.


దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త ఆహార, వ్యవసాయరంగ నిపుణులు
ఈ–మెయిల్‌: hunger55@gmail.com
(ది ట్రిబ్యూన్‌ సౌజన్యంతో...)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top