యూరప్‌ దేశాల వ్యవసాయ సంక్షోభం వెనక...

The agricultural crisis of European countries - Sakshi

సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడి దారీ విధానం వలన ఆ యా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్‌ దేశాల్లో రైతుల ఆందో ళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశా లతో పాటు, ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గుర య్యారు. నేటి ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం వలన రష్యాతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలూ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.

ఈయూ దేశాల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనవి – పంటలకు న్యాయమైన ధరలూ, వాటి విక్ర యాలూ! రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్‌ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయిన సందర్భంలో అమెరికా సూచనల మేరకు యూరప్‌ దేశాలు ఉక్రెయిన్‌ నుంచి పెద్దయెత్తున చౌకగా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక రైతాంగం వ్యవ సాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి నష్టాలను ఎదుర్కొంటు న్నాయి. ఆహార దిగుమతులతో పాటు ఈయూ పర్యావరణ నిబంధనలు రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత రేకెత్తించాయి.

పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4 శాతం సాగు భూమిని శాశ్వతంగా ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్‌ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఇంతే కాకుండా ప్రతి ఏడాదీ పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. సాగు అవసరాలకు విని యోగిస్తున్న పెట్రోల్, డీజిళ్లపై ఇస్తున్న సబ్సిడీ ఎత్తి వేయాలని ఈయూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందు తున్నారు. యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్‌ రైతాంగం తమ పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్‌ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమ పుట్టి ముంచుతాయని స్పెయిన్‌ రైతాంగం భయపడుతున్నది.

కొద్ది సంవత్సరాలుగా ఈయూ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటిమట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతాంగం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్స్‌లో ‘వాల్‌’ నది నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. స్పెయిన్‌ ప్రధాన నదుల్లో ఒకటైన ‘గ్వాదల్‌ క్విలిర్‌’ నదిలో సాధారణ నీటిమట్టంలో నాలుగవ వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్‌లో వ్యవసాయం విస్తృతంగా ఉండటంతో నీటి అవసరాలు ఎక్కు వగా ఉన్నాయి. ఇటలీ లోనూ నీటి లభ్యత తగ్గింది.

ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి పాలకులు దిగుమతులు పెంచడంతో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ వస్తున్నాయి. దీంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు. ఫ్రాన్స్‌లో 10 నుంచి 15 శాతం పొలాలపై ఒక బిలియన్‌ యూరోలకు మించి రుణాలు ఉండటంతో రైతులు దివాళా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రే అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఈయూ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిర సిస్తూ ఈక్రింది డిమాండ్లకై రైతాంగం ఆందోళన బాట పట్టారు.
 
ఆహారోత్పత్తుల దిగుమతులను ఈయూ అరికట్టాలి. ఉక్రెయిన్‌ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్లించేలా చేయాలి. ఉక్రెయిన్‌ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపి వేయాలి. సాగుపై ప్రభుత్వ పరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. 4 శాతం భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలి. పర్యావరణ నిబంధనలు సడలించాలి. పెట్రోల్, డీజిళ్లపై సాగు సబ్సిడీలను కొనసాగించాలి. పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదు. నష్టపోయిన రైతులకు పరి హారం చెల్లించాలి వంటి అనేక డిమాండ్లతో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, రుమేనియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన బాట పట్టారు.

జర్మనీలో అధిక ఇంధన ధరలకు వ్యతిరేకంగా వారం రోజుల నిరసన కార్యక్రమంలో తమ ట్రాక్టర్లతో 10వేల మంది రైతులు సెంట్రల్‌ బెర్లిన్‌ వీధుల్లోకి వచ్చి ఆర్థిక మంత్రి క్రిష్టియన్‌ విండన్ కు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిబ్రవరి 2న ఉక్రెయిన్‌కు తాజాగా నిధులు మంజూరు చేయడానికి ఈయూ నాయకులు సమావేశం నిర్వహించగా బెల్జియం పార్లమెంట్‌ ఆవరణ వెలుపల వందలాది మంది రైతులు నిరసన తెలియ చేశారు.

గ్రీస్‌లో రెండవ అతిపెద్ద నగరమైన థెస్సులోనికి రైతులు ట్రాక్టర్లతో కవాతు తొక్కారు. ఫ్రాన్స్‌లో నిరసన తెలుపు తున్న రైతులు ప్యారిస్‌ వెలుపల, లియోన్, టౌలేస్‌ నగరాల్లో రోడ్లను బ్లాక్‌ చేశారు. యూరప్‌ దేశాల పాలకులకు వ్యతిరేకంగా రైతాంగ ఆందోళనకు మద్దతుగా 73 శాతం ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌కూ ఇతర దేశాల పాలకులకూ తీవ్ర ఆందోళన కలిగించింది. ఫలి తంగా  యూరప్‌ వ్యవసాయ సంక్షోభ నివారణ కోసమంటూ ఈయూ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది.

యుద్ధాలకు, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ సంక్షోభాలకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానమే కారణం. రెండు ప్రపంచ యుద్ధాలు దీన్నే రుజువు చేశాయి. పెట్టుబడిదారీ వ్యవ సాయం కూడా సంక్షోభానికి మినహాయింపు కాదనీ, అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యూహాత్మక విధానం వలన పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షోభానికి గురౌతున్నాయనీ గ్రహించాలి. 

- వ్యాసకర్త రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రైతుకూలీ సంఘం (ఏపీ) ‘ 98859 83526
- బొల్లిముంతసాంబశివరావు

whatsapp channel

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top