
మణుగూరు టౌన్: ఓ యాచకుడు అడుక్కుంటూ వచ్చే ఆదాయంతోనే భార్యాబిడ్డను పోషించేవాడు.. ఆయన మృతితో భార్య కుటుంబ పెద్దగా యాచననే ఎంచుకుంది. ఈక్రమంలోనే బిడ్డను కూడా వెంట తీసుకెళ్తుండటం గమనించిన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమెకు నచ్చజెప్పారు. ఆ బిడ్డను బడిలో చేర్పించి స్థానికుల మన్ననలు అందుకున్నారు.
మణుగూరు మున్సి పాలిటీ కార్యాలయానికి సమీపాన రహదారి వెంట ఉంటున్న ధన.. తన బిడ్డ యేసుమణిని సైతం యాచనకు తీసుకెళ్తోంది. గతనెలలో నిర్వహించిన బడిబాటలో మండలంలోని శివలింగాపురం పాఠశాల ఉపాధ్యాయుడు మాలోతు భద్రు తదితరులు ధనకు అవగాహన కల్పించగా పాఠశాలలో చేర్పించింది. ఒకటి, రెండు రోజులు యేసుమణి పాఠశాలకు వచ్చినా.. ఆ తర్వాత నుంచి రావడం లేదు.
ఈ నేపథ్యంలో, శుక్రవారం భద్రు తల్లిబిడ్డను రోడ్డు పక్కన గుర్తించాడు. దీంతో యేసుమణిని పాఠశాలకు పంపించాలని కోరారు. పుస్తకాలు, పెన్నులు కొనడం తనవల్ల కాదని ధన బదులిచ్చింది. ఈమేరకు పాఠశాల నుంచి యూనిఫాం తెప్పించిన ఉపాధ్యాయుడు యేసుమణికి వేయించి.. షాప్‌కు తీసుకెళ్లి బ్యాగ్, ఇతర సామగ్రి కొనిచ్చారు. అనంతరం తన బైక్‌పైనే పాఠశాలకు తీసుకెళ్లారు. రోజూ విద్యార్థిని పాఠశాలకు పంపించేలా పర్యవేక్షిస్తానని కూడా స్పష్టం చేసిన ఉపాధ్యాయుడు భద్రును స్థానికులు అభినందించారు.
చదవండి: 20 మంది విద్యార్థులుంటే కొత్తగా స్కూల్