
గ్రామాలు, పట్టణ కాలనీల్లో ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు విద్యను మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. గ్రామాలు, పట్టణాల్లోని శివారు కాలనీల్లో 20 మంది విద్యార్థులున్నచోట ప్రభుత్వ పాఠశాల లేకుంటే వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇటీవల డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోగా, తాజాగా పాఠశాల విద్య డైరెక్టర్ అన్ని జిల్లాల డీఈవోలు, మండల విద్యాశాఖ అధికారులకు పాఠశాలల ఏర్పాటుపై ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థులుండి పాఠశాలు లేనిచోట వెంటనే ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో 359, గ్రామీణ ప్రాంతాల్లో 212 పాఠశాలలు అవసరమని అధికారులు నివేదిక రూపొందించారు. కొన్ని పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయులను కొత్తగా ఏర్పాటు చేసే పాఠశాలలకు పంపాలని సూచించారు.