చండ్రుగొండ: మండలంలో నిర్మించనున్న సీతారామ ప్రాజెక్ట్ ఉప కాల్వ నిర్మాణ సర్వేను రైతులు బుధవారం అడ్డుకున్నారు. మద్దుకూరు శివారు నుంచి అయన్నపాలెం, చండ్రుగొండ గ్రామాల మీదుగా ఉప కాల్వ చెరువుల మీదుగా వెళ్లనుంది. అయితే అనేకసార్లు కాల్వడిజైన్ మార్చడం వల్ల అవసరం లేని చోట విలువైన భూములు దెబ్బతింటు న్నాయని అయన్నపాలెం రైతులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సమాచారం అందుకున్న కాల్వ నిర్మా ణం విభాగం డీఈ నాగేశ్వరరావు, ఏఈ గణేశ్ అక్కడికి చేరుకున్నారు. ప్రధాన రైతులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, తుమ్మలపల్లి సురేశ్ ఆధ్వర్యంలో రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాల్వ పాత డిజైన్ ప్రకారం పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సమస్యను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే జారెఆదినారాయణకు ఫోన్ ద్వారా తెలిపారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే కాల్వపనులు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి కాల్వ సర్వే చేయాలని, వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రితోపాటు ఎమ్మెల్యేహామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.


