ఇల్లెందురూరల్: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం కొమరారం గ్రామంలో తాగునీటి ట్యాంకును సర్పంచ్.. కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. కార్మికులతో కలిసి వాటర్ ట్యాంకు పైకి ఎక్కిన సర్పంచ్ బిచ్చా.. లోపలికి దిగి ట్యాంక్ మొత్తం శుభ్రం చేయడంతో ప్రజలు ఆయన్ను అభినందించారు.
పత్తి చేలల్లో
జీవాలకు మేత
బూర్గంపాడు: పత్తితీతలు పూర్తికావడంతో ప్రస్తుతం గొర్రెలు, మేకలకు కడుపు నిండా మేత దొరుకుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వేలసంఖ్యలో గొర్రెలు మేత కోసం బూర్గంపాడు మండలానికి వచ్చాయి. ఏటా పత్తితీతలు పూర్తయ్యే సమయంలో గొర్రెల మందలు అక్కడి నుంచి ఇక్కడకు వస్తాయి. ఈ సారి మండలానికి సుమారు లక్ష గొర్రెల వరకు వచ్చాయి. రైతులు వాటిని నాలుగు రోజులు చేలల్లో ఉంచడం వల్ల అవి మేత మేసి, పెంట వేస్తాయి. అది భూసారం పెరగడానికి దోహ దం చేస్తుంది. సేంద్రియ సాగుపై దృష్టి పెడుతున్న రైతులు జీవాలను తమ పొలాల్లో మంద కట్టిస్తున్నారు.
ఎరువుల వాడకం
తగ్గించాలి
చండ్రుగొండ: పంటల సాగులో మందుల వాడకాన్ని తగ్గించుకోవాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ భరత్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన రైతు శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. సాగులో ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని, పంటలపై మోతాదుకు మించి ఎరువులను వినియోగిస్తే భూసారం దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపుతుందని తెలిపారు. నానో యూరియా, నానో డీఏపీ వల్ల కలిగే ప్రయోజనాలు, వరిలో ప్రస్తుతం ఉన్న వంగడాలు, ఆయిల్ పాం సాగు, సాయిల్ హెల్త్ కార్డు ఉపయోగం, నేచురల్ ఫార్మింగ్, కిచెన్ గార్డెనింగ్ గురించి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ రవికుమార్, ఏఓ వినయ్, ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శివ పాల్గొన్నారు.
ఎరువులతో
నాణ్యమైన దిగుబడి
ములకలపల్లి: నాణ్యమైన పంట దిగుబడికి ఎరువులు దోహదపడుతాయని ఫెర్టిలైజర్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) జనరల్ మేనేజర్ రామ్మోహన్‌రావు అన్నారు. ‘ప్రత్యామ్యాయ ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం’పై జగన్నాథపురం రైతువేదికలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. కృషివిజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్ డాక్టర్ భరత్, డాక్టర్ హేమచంద్ర, బి.శివ పలుఅంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశ్వారావుపేట ఏడీఏ రవికుమార్, ఎంఏఓ అరుణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు
అశ్వారావుపేటరూరల్: గతేడాది డిసెంబర్‌లో జరిగిన గోదావరి తెలుగు ప్రతిభా పరీక్షలో అశ్వారావుపేట ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి సత్తా చా టారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో అశ్వారావుపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థి సాయిల లక్కీప్రశాంత్, ఉన్నత పాఠశాల విద్యార్థి అమీసాఫాతిమా, కె.మైథిలి, పేరాయిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థి నార్లపాటి ఐశ్వర్య రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకులు సాధించారు. బీసీకాలనీ పాఠశాలకు చెందిన జ్ఞానేశ్, కె.తేజరాంచరణ్, జి.భవ్యశ్రీ ద్వితీయ ర్యాంకులు సాధించినట్లు కాంప్లెక్స్ హెచ్‌ఎం హరిత తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి, త్వరలోనే ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని వివరించారు.


