
అగ్గలయ్య నమూనా చిత్రం
చాళుక్య రాజైన జయసింహ–2 ఆస్థానంలో గొప్ప శస్త్రచికిత్స వైద్యుడు
జైన ఆయుర్వేద, శస్త్ర చికిత్సలో ప్రత్యేక గుర్తింపు
యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామంలో అగ్గలయ్య శాసనాలు
ఆయుర్వేద చరిత్రను తెలిపే అతి విలువైనదిగా సైదాపురం శాసనం
యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ ప్రాంతంలో మధ్యయుగ కాలంలో వైద్య చరిత్రకు ఒక మూలస్తంభంగా, వైద్య వారసత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచిన ప్రముఖ జైన ఆయుర్వేద, శస్త్ర వైద్యుడు అగ్గలయ్య. ఈయనకు సంబంధించిన శాసనాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ఉన్నాయి. ఈ శాసనాలు దక్షిణ, మధ్య భారతదేశంలో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన చాళుక్య రాజుల కాలం నాటివని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. చాళుక్యుల రాజుల్లోని రెండవ జయసింహుడుతో పాటు మరి కొంతమంది రాజుల కాలంలో సామంతుడుగా ఉన్న జైన శస్త్ర వైద్యుడు అగ్గలయ్య (Aggalayya) గురించి ఈ శాసనంలో వివరించారు. అప్పట్లో అగ్గలయ్య చేసిన సేవలకు రెండవ జయసింహుడు అతని పేరు మీద కొన్ని మాన్యాలను ఈ సైదాపురం ప్రాంతంలో ఇచ్చారని ఈ శాసనంలో పొందుపరిచారు.
ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో మాంత్రికుడు
ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో అగ్గలయ్య మాంత్రికుడు. శస్త్ర వైద్యంలో జబ్బు నయం కానటువంటి వారిని, ఈ అగ్గలయ్య వద్దకు పంపించేవారని, ఈ శాసనం తెలుపుతుంది. భారత దేశంలోనే 11వ శతాబ్దం నాటికి ఒక సర్జన్ ఉన్నాడని ప్రాథమిక వనరుగా ఈ శిలాశాసనం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆయుర్వేద చరిత్రను తెలిపే అతి విలువైన శాసనం ఈ సైదాపురం శాసనం. మధ్యయుగం కాలంలో కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేవారు అని అనడానికి రుజువు ఈ శాసనం.
అగ్గలయ్య చరిత్ర
అగ్గలయ్య జైన మతానికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు. ఈయన దక్షిణ భారతదేశంలోని తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన గొప్ప వైద్యుడు. ఇతను సుమారుగా 1000 ఏడీలో జన్మించి, 1080 ఏడీలో మరణించాడు. ఈయన భార్య పేరు వల్లికాంభే. తెలంగాణలోని ఆలేరు సమీపంలోని ఇక్కురికే (ప్రస్తుతం ఇక్కుర్తి) గ్రామం ఈయన స్వస్థలం. ఈయన స్థాపించిన వైద్య రత్నాకర జినాలయాలు, అనేక చారిత్రక నిర్మాణాలు ఈ ఇక్కుర్తి ప్రాంతంలో ఉండేవని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇక్కుర్తి ప్రాంతంలోనే ఈయన సమాధి గత కొన్ని సంవత్సరాల కిందట వరకు ఉందని, కాలానుగుణంగా ఆ సమాధిని తవ్వకాల్లో తీసేశారని అధికారులు చెబుతున్నారు.
శస్త్ర విద్యలో ప్రావీణ్యుడు
చాళుక్యుల కాలంలో అగ్గలయ్య శస్త్ర చికిత్సలో ఓ వెలుగు వెలిగిన వైద్యుడు. ఇతర వైద్యులు నయం చేయని వ్యాధులను నయం చేసేవాడు. ఈయనకు నరవైద్యవర, ప్రాణాచార్య, వైద్యరత్నాకర, వైద్యశిఖామణి అనే బిరుదులు ఉన్నాయి. అగ్గలయ్యను రాజ వైద్యుడుగా పిలిచేవారు. జైనులకు శస్త్రచికిత్స, ఆయుర్వేద కళను బోధించేవాడు. విదేశాల నుంచి వచ్చే ఇతర వైద్యుల సందేహాలను నివృత్తి చేసేవాడు.
సామంత రాజుగా అగ్గలయ్య
అగ్గలయ్య చేసిన వైద్య సేవలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ, ఆనాటి చాళుక్య రాజులు ఈయన్ను సామంత రాజుగా చేసుకున్నారు. నలుగురు రాజులు మారినా ఈయననే ఆస్థాన వైద్యుడిగా, సామంత రాజుగా కొనసాగించారు.
జైన మతం అయినప్పటికీ..
అగ్గలయ్య జైన మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, వైద్య శాస్త్రంలో ఆయన అభివృద్ధిని అడ్డుకోలేదని శాసనాలు చెబుతున్నాయి. అహింస జైన సూత్రం అయినా, శస్త్ర చికిత్సలో వైద్య విద్య కోసం, అభ్యాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 9వ శతాబ్దంలో ఉగ్రాదిత్య వంటి జైన పండితులు వైద్య గ్రంథాలను ఏర్పాటు చేయడంలో అగ్గలయ్య తమ వంతు పాత్ర పోషించాడని చరిత్ర చెబుతుంది.
సైదాపురంలో రెండు శాసనాలు
సైదాపురం గ్రామంలో అగ్గలయ్యకు సంబంధించిన రెండు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు రాతి స్తంభాలపై మూడువైపులా చెక్కబడి ఉన్నాయి. మొదట రెండు భాగాలు తెలుగు, కన్నడ లిపిలో ఉండగా, మూడో వైపు సంస్కృత భాషలో ఉన్నాయి.
శాసనంలో మొదటి భాగం
అగ్గలయ్య జైనుడని, ఆయనకు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని బిరుదులు ఉన్నట్లు ఈ శాసనం తెలుపుతుంది. పూర్వ కాలంలో కొలిపాక, (నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక) పరిధిలో ఉన్న ముప్పనపల్లి గ్రామాన్ని అగ్గలయ్య నిర్మించిన జైన వసతులు (జైన సంప్రదాయాన్ని పాటించే సన్యాసులు, గురువులు, శిష్యులు నివసించే మఠాలు) వీటి నిర్వహణకు అప్పటి గ్రామ పెద్ద గవుండ బహుమానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలుపుతుంది. శక సంత్సరం 956 నుంచి క్రీ.శ. 1034 జూన్ 4 గురువారం నాడు సంభవించిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మహారాజు హైదరాబాద్‌కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పొట్లకేరి (నేటి పఠాన్ చెరువు) విడిది చేసిన సందర్భంగా ఈ దానం చేశారు.

శాసనంలో రెండవ భాగం
శాసనంలో రెండవ భాగంలో బహుమానంగా ఇచ్చిన భూమి, దానిపై వచ్చే రాబడి అంశాల వివరాల గురించి ఉంది.
మూడవ భాగం
అగ్గలయ్య జైనమత వాలంభి, మంచివారికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని అనుకునే వాడు. తోటి వైద్యుల సందేహాలను నివృత్తి చేస్తూ, జయసింహుని ఆస్థానంలో వర్ధిల్లిన ఇతర ఆయుర్వేద పండితులకు, బ్రహ్మస్వరూపమని, చికిత్సా విధానంలో పాండిత్యుడని, మందులకు లొంగని మొండి వ్యాధులకు ఉపశమనం లభించినా, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పినా, అది అగ్గలయ్య చేతి చలవేనని చెబుతుంది. స్వయంగా జయసింహుని ముదిరిన వ్యాధి (ప్రకర్ష) దశలో ఉన్నప్పుడు ఎందరో వైద్యులు కాపాడాలని యత్నించి విఫలం కాగా, తన చేతి వాటంతో చికిత్స చేసి, వ్యాధిని తగ్గించిన ఘనుడు అగ్గలయ్య. తంత్ర శాస్త్రంలోని ఉమా తంత్రం, సంగ్రహ పరిచ్ఛేదాలో కూడా అగ్గలయ్య నిపుణుడని ఈ శాసనం తెలుపుతుంది.
సిరూర్ శాసనాలు
అగ్గలయ్య గురించి మరి కొన్ని విషయాలు సంగారెడ్డి జిల్లాలోని సిరూర్ గ్రామంలో వెలువడిన మరో రెండు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలు పశ్చిమ చాళుక్య రాజైన భువనైకమల్లదేవ (సోమేశ్వర–2) క్రీ.శ 1069లో వేసిందిగా గుర్తించారు. ఈ శాసనంలో అగ్గలయ్య ప్రశంసలను, జైనమత దేవత పద్మావతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అదేవిధంగా 1074లో వేసిన మరో శాసనంలో ఆయనను వైద్య శిఖామణి అని స్పష్టంగా సూచిస్తుంది. అలాగే మహాసామంత రాజుగా ఆయన హోదాను నిర్ధారిస్తుంది. అగ్గలయ్య పండితులకు, రుషులకు వారి జీవనోపాధి కోసం, భూములు, ఇళ్ల స్థలాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ శాసనం ఆయన భార్య లక్షణాలను, సమాజం, సంక్షేమ పట్ల నిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ శాసనాలు పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.

అగ్గలయ్య పేరు మీద గుట్ట
అగ్గలయ్యకు ఉన్న విస్తృత గుర్తింపు శాసనాలకే పరిమితం కాకుండా, ప్రదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయి. వరంగల్‌లోని హనుమకొండ సమీపంలో ఉన్న ఒక కొండకు అగ్గలయ్య గుట్ట (అగ్గలయ్య దిబ్బ) అనే పేరును ఆ కాలంలోని రాజులు పెట్టారు. ఈ ప్రాంతం 9, 10 శతాబ్దాల్లో అనేక జైన శిల్పాలకు నిలయంగా ఉంది. ఈ కొండపైన ఒక పెద్ద విగ్రహం ఉంది, అది అగ్గలయ్య విగ్రహమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రముఖ చరిత్ర కారుడు శ్రీ రామోజీ హరగోపాల్ అగ్గలయ్య గురించి పలు పరిశోధనలు చేసి వెలుగులోకి తీసుకొచ్చారు.
ఎన్‌ఐఎమ్‌హెచ్ బృందం పరిశోధనలు
హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎమ్‌హెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్) బృందం, డాక్టర్ జీపీ ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్జి, డాక్టర్ పి.సాకేత్ రామ్ రీసెర్చ్ ఆఫీస్ (ఆయుర్వేద), పి.మురళీ మనోహర్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (క్యురేటర్) తెలంగాణలో ప్రముఖ పరిశోధన, చరిత్ర కారుడు, కవి రామోజు హరగోపాల్ సహాయ సహాకారాలతో ఈ సైదాపురం అగ్గలయ్య శాసనాల్లో పరిశోధనలు జరిపి, వైద్య శాసనాలను గుర్తించారు. ఈ శాసనాల వివరాలను ఫ్రేమ్ రూపంలో ఎన్‌ఐఎమ్‌హెచ్‌లో పొందుపరిచారు.
చదవండి: అర్థం చేసుకోవాలి.. అనర్థాలు నివారించుకోవాలి!
చాళుక్యుల కాలంలో గొప్ప వైద్యుడు
గొప్ప వైద్యుడు అగ్గలయ్య. వివిధ దేశాల నుంచి వైద్యులు అగ్గలయ్య వద్దకు సర్జరీలో మెళకువలను నేర్చుకునేవారు. కొన ఊపిరితో ఉన్న వారిని కూడా అగ్గలయ్య బతికించేవాడు. క్రీస్తు పూర్వం సుశ్రుతుడు వైద్య సేవలందించగా, క్రీస్తు శకంలో అగ్గలయ్య వైద్య సేవలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సంపదను కాపాడాలి.
– డాక్టర్ జీపీ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్‌చార్జి, ఎన్‌ఐఎమ్‌హెచ్, హైదరాబాద్