breaking news
Chalukyas
-
మధ్యయుగ వైద్య చరిత్రలో మేటి.. అగ్గలయ్య
యాదగిరిగుట్ట రూరల్: తెలంగాణ ప్రాంతంలో మధ్యయుగ కాలంలో వైద్య చరిత్రకు ఒక మూలస్తంభంగా, వైద్య వారసత్వానికి శక్తిమంతమైన చిహ్నంగా నిలిచిన ప్రముఖ జైన ఆయుర్వేద, శస్త్ర వైద్యుడు అగ్గలయ్య. ఈయనకు సంబంధించిన శాసనాలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ఉన్నాయి. ఈ శాసనాలు దక్షిణ, మధ్య భారతదేశంలో 6 నుంచి 12 శతాబ్దాల మధ్య పరిపాలించిన చాళుక్య రాజుల కాలం నాటివని ఆర్కియాలజీ అధికారులు గుర్తించారు. చాళుక్యుల రాజుల్లోని రెండవ జయసింహుడుతో పాటు మరి కొంతమంది రాజుల కాలంలో సామంతుడుగా ఉన్న జైన శస్త్ర వైద్యుడు అగ్గలయ్య (Aggalayya) గురించి ఈ శాసనంలో వివరించారు. అప్పట్లో అగ్గలయ్య చేసిన సేవలకు రెండవ జయసింహుడు అతని పేరు మీద కొన్ని మాన్యాలను ఈ సైదాపురం ప్రాంతంలో ఇచ్చారని ఈ శాసనంలో పొందుపరిచారు. ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో మాంత్రికుడు ఆయుర్వేదం, శస్త్ర చికిత్సలో అగ్గలయ్య మాంత్రికుడు. శస్త్ర వైద్యంలో జబ్బు నయం కానటువంటి వారిని, ఈ అగ్గలయ్య వద్దకు పంపించేవారని, ఈ శాసనం తెలుపుతుంది. భారత దేశంలోనే 11వ శతాబ్దం నాటికి ఒక సర్జన్ ఉన్నాడని ప్రాథమిక వనరుగా ఈ శిలాశాసనం తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. దక్షిణ భారతదేశంలో ఆయుర్వేద చరిత్రను తెలిపే అతి విలువైన శాసనం ఈ సైదాపురం శాసనం. మధ్యయుగం కాలంలో కొందరు వైద్యులు శస్త్ర చికిత్సలు చేసేవారు అని అనడానికి రుజువు ఈ శాసనం. అగ్గలయ్య చరిత్ర అగ్గలయ్య జైన మతానికి చెందిన శస్త్రచికిత్స వైద్యుడు. ఈయన దక్షిణ భారతదేశంలోని తెలంగాణ (Telangana) ప్రాంతానికి చెందిన గొప్ప వైద్యుడు. ఇతను సుమారుగా 1000 ఏడీలో జన్మించి, 1080 ఏడీలో మరణించాడు. ఈయన భార్య పేరు వల్లికాంభే. తెలంగాణలోని ఆలేరు సమీపంలోని ఇక్కురికే (ప్రస్తుతం ఇక్కుర్తి) గ్రామం ఈయన స్వస్థలం. ఈయన స్థాపించిన వైద్య రత్నాకర జినాలయాలు, అనేక చారిత్రక నిర్మాణాలు ఈ ఇక్కుర్తి ప్రాంతంలో ఉండేవని పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఇక్కుర్తి ప్రాంతంలోనే ఈయన సమాధి గత కొన్ని సంవత్సరాల కిందట వరకు ఉందని, కాలానుగుణంగా ఆ సమాధిని తవ్వకాల్లో తీసేశారని అధికారులు చెబుతున్నారు. శస్త్ర విద్యలో ప్రావీణ్యుడు చాళుక్యుల కాలంలో అగ్గలయ్య శస్త్ర చికిత్సలో ఓ వెలుగు వెలిగిన వైద్యుడు. ఇతర వైద్యులు నయం చేయని వ్యాధులను నయం చేసేవాడు. ఈయనకు నరవైద్యవర, ప్రాణాచార్య, వైద్యరత్నాకర, వైద్యశిఖామణి అనే బిరుదులు ఉన్నాయి. అగ్గలయ్యను రాజ వైద్యుడుగా పిలిచేవారు. జైనులకు శస్త్రచికిత్స, ఆయుర్వేద కళను బోధించేవాడు. విదేశాల నుంచి వచ్చే ఇతర వైద్యుల సందేహాలను నివృత్తి చేసేవాడు.సామంత రాజుగా అగ్గలయ్య అగ్గలయ్య చేసిన వైద్య సేవలకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తూ, ఆనాటి చాళుక్య రాజులు ఈయన్ను సామంత రాజుగా చేసుకున్నారు. నలుగురు రాజులు మారినా ఈయననే ఆస్థాన వైద్యుడిగా, సామంత రాజుగా కొనసాగించారు. జైన మతం అయినప్పటికీ.. అగ్గలయ్య జైన మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ, వైద్య శాస్త్రంలో ఆయన అభివృద్ధిని అడ్డుకోలేదని శాసనాలు చెబుతున్నాయి. అహింస జైన సూత్రం అయినా, శస్త్ర చికిత్సలో వైద్య విద్య కోసం, అభ్యాస కేంద్రాలను ఏర్పాటు చేసి, 9వ శతాబ్దంలో ఉగ్రాదిత్య వంటి జైన పండితులు వైద్య గ్రంథాలను ఏర్పాటు చేయడంలో అగ్గలయ్య తమ వంతు పాత్ర పోషించాడని చరిత్ర చెబుతుంది.సైదాపురంలో రెండు శాసనాలు సైదాపురం గ్రామంలో అగ్గలయ్యకు సంబంధించిన రెండు శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాలు రాతి స్తంభాలపై మూడువైపులా చెక్కబడి ఉన్నాయి. మొదట రెండు భాగాలు తెలుగు, కన్నడ లిపిలో ఉండగా, మూడో వైపు సంస్కృత భాషలో ఉన్నాయి.శాసనంలో మొదటి భాగం అగ్గలయ్య జైనుడని, ఆయనకు వైద్యరత్నాకరుడని, ప్రాణాచార్యుడని, నరవైద్యుడని బిరుదులు ఉన్నట్లు ఈ శాసనం తెలుపుతుంది. పూర్వ కాలంలో కొలిపాక, (నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక) పరిధిలో ఉన్న ముప్పనపల్లి గ్రామాన్ని అగ్గలయ్య నిర్మించిన జైన వసతులు (జైన సంప్రదాయాన్ని పాటించే సన్యాసులు, గురువులు, శిష్యులు నివసించే మఠాలు) వీటి నిర్వహణకు అప్పటి గ్రామ పెద్ద గవుండ బహుమానంగా ఇచ్చినట్లు ఈ శాసనం తెలుపుతుంది. శక సంత్సరం 956 నుంచి క్రీ.శ. 1034 జూన్ 4 గురువారం నాడు సంభవించిన చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని మహారాజు హైదరాబాద్‌కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న పొట్లకేరి (నేటి పఠాన్ చెరువు) విడిది చేసిన సందర్భంగా ఈ దానం చేశారు.శాసనంలో రెండవ భాగం శాసనంలో రెండవ భాగంలో బహుమానంగా ఇచ్చిన భూమి, దానిపై వచ్చే రాబడి అంశాల వివరాల గురించి ఉంది.మూడవ భాగం అగ్గలయ్య జైనమత వాలంభి, మంచివారికి ఎల్లప్పుడూ సహాయం చేయాలని అనుకునే వాడు. తోటి వైద్యుల సందేహాలను నివృత్తి చేస్తూ, జయసింహుని ఆస్థానంలో వర్ధిల్లిన ఇతర ఆయుర్వేద పండితులకు, బ్రహ్మస్వరూపమని, చికిత్సా విధానంలో పాండిత్యుడని, మందులకు లొంగని మొండి వ్యాధులకు ఉపశమనం లభించినా, ప్రాణాపాయ స్థితి నుంచి తప్పినా, అది అగ్గలయ్య చేతి చలవేనని చెబుతుంది. స్వయంగా జయసింహుని ముదిరిన వ్యాధి (ప్రకర్ష) దశలో ఉన్నప్పుడు ఎందరో వైద్యులు కాపాడాలని యత్నించి విఫలం కాగా, తన చేతి వాటంతో చికిత్స చేసి, వ్యాధిని తగ్గించిన ఘనుడు అగ్గలయ్య. తంత్ర శాస్త్రంలోని ఉమా తంత్రం, సంగ్రహ పరిచ్ఛేదాలో కూడా అగ్గలయ్య నిపుణుడని ఈ శాసనం తెలుపుతుంది.సిరూర్ శాసనాలు అగ్గలయ్య గురించి మరి కొన్ని విషయాలు సంగారెడ్డి జిల్లాలోని సిరూర్ గ్రామంలో వెలువడిన మరో రెండు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాలు పశ్చిమ చాళుక్య రాజైన భువనైకమల్లదేవ (సోమేశ్వర–2) క్రీ.శ 1069లో వేసిందిగా గుర్తించారు. ఈ శాసనంలో అగ్గలయ్య ప్రశంసలను, జైనమత దేవత పద్మావతితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తుంది. అదేవిధంగా 1074లో వేసిన మరో శాసనంలో ఆయనను వైద్య శిఖామణి అని స్పష్టంగా సూచిస్తుంది. అలాగే మహాసామంత రాజుగా ఆయన హోదాను నిర్ధారిస్తుంది. అగ్గలయ్య పండితులకు, రుషులకు వారి జీవనోపాధి కోసం, భూములు, ఇళ్ల స్థలాలను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ శాసనం ఆయన భార్య లక్షణాలను, సమాజం, సంక్షేమ పట్ల నిబద్ధతను చూపిస్తుంది. ప్రస్తుతం ఈ శాసనాలు పురావస్తు శాఖ అధికారులు మ్యూజియంలో భద్రపరిచారు.అగ్గలయ్య పేరు మీద గుట్ట అగ్గలయ్యకు ఉన్న విస్తృత గుర్తింపు శాసనాలకే పరిమితం కాకుండా, ప్రదేశాలకు కూడా విస్తరించి ఉన్నాయి. వరంగల్‌లోని హనుమకొండ సమీపంలో ఉన్న ఒక కొండకు అగ్గలయ్య గుట్ట (అగ్గలయ్య దిబ్బ) అనే పేరును ఆ కాలంలోని రాజులు పెట్టారు. ఈ ప్రాంతం 9, 10 శతాబ్దాల్లో అనేక జైన శిల్పాలకు నిలయంగా ఉంది. ఈ కొండపైన ఒక పెద్ద విగ్రహం ఉంది, అది అగ్గలయ్య విగ్రహమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రముఖ చరిత్ర కారుడు శ్రీ రామోజీ హరగోపాల్ అగ్గలయ్య గురించి పలు పరిశోధనలు చేసి వెలుగులోకి తీసుకొచ్చారు. ఎన్ఐఎమ్హెచ్ బృందం పరిశోధనలు హైదరాబాద్‌లోని ఎన్ఐఎమ్హెచ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్) బృందం, డాక్టర్ జీపీ ప్రసాద్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, డాక్టర్ పి.సాకేత్ రామ్ రీసెర్చ్ ఆఫీస్ (ఆయుర్వేద), పి.మురళీ మనోహర్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (క్యురేటర్) తెలంగాణలో ప్రముఖ పరిశోధన, చరిత్ర కారుడు, కవి రామోజు హరగోపాల్ సహాయ సహాకారాలతో ఈ సైదాపురం అగ్గలయ్య శాసనాల్లో పరిశోధనలు జరిపి, వైద్య శాసనాలను గుర్తించారు. ఈ శాసనాల వివరాలను ఫ్రేమ్ రూపంలో ఎన్ఐఎమ్హెచ్లో పొందుపరిచారు.చదవండి: అర్థం చేసుకోవాలి.. అనర్థాలు నివారించుకోవాలి!చాళుక్యుల కాలంలో గొప్ప వైద్యుడు గొప్ప వైద్యుడు అగ్గలయ్య. వివిధ దేశాల నుంచి వైద్యులు అగ్గలయ్య వద్దకు సర్జరీలో మెళకువలను నేర్చుకునేవారు. కొన ఊపిరితో ఉన్న వారిని కూడా అగ్గలయ్య బతికించేవాడు. క్రీస్తు పూర్వం సుశ్రుతుడు వైద్య సేవలందించగా, క్రీస్తు శకంలో అగ్గలయ్య వైద్య సేవలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ సంపదను కాపాడాలి. – డాక్టర్ జీపీ ప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్చార్జి, ఎన్ఐఎమ్హెచ్, హైదరాబాద్ -
చాళుక్య వంశ మూలపురుషుడి జన్మస్థలం.. ‘పెద్దముడియం’
జమ్మలమడుగు: ప్రాచీన మధ్య యుగ దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన రాజవంశాలలో చాళుక్యవంశం ఒకటి. బాదామి(వాతాపి) చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కల్యాణి చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు ఇలా శాఖోపశాఖలుగా దక్షిణ భారతదేశంలో వివిధ ప్రాంతాలను సుదీర్ఘంగా పలించిన చాళుక్య వంశంలో మూల పురుషుడు విష్ణువర్థనుడు. విష్ణువర్థనుడు దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేయడం గురించి వీరచోడుడు వేయించిన చెల్లూరు(తూర్పుగోదావరి జిల్లా) తామ్రా శాసనం వివరిస్తుంది. ఈ శాసనం ప్రకారం చాళుక్యులు అయోధ్యా నగరానికి చెందిన చంద్రవంశరాజులు. వీరి పరంపరలో ఉదయనుడు అనే రాజు తరువాత 59 మంది రాజులు అయోధ్యను పాలించారు. తరువాత ఆ వంశంలోని విజయాదిత్యుడు అనే రాజు దక్షిణ జనపథానికి వచ్చాడు. విజయాదిత్యుడు పల్లవ రాజు త్రిలోచనుడుకి జరిగిన యుద్ధంలో విజయాదిత్యుడు మరణించాడు. విజయాదిత్యుడి భార్య అప్పటికే గర్భవతి. ఆమె ముదివేము అనే అగ్రహారంలో విష్ణుభట్ట సోమయాజి అనే బ్రహ్మణుడి వద్ద ఆశ్రయం పొందింది. ఆమెకు మగ శిశువు జన్మించగా తమకు ఆశ్రయం ఇచ్చిన విష్ణుభట్ట పేరుమీద ఆ రాణి ఆ బాలుడికి విష్ణువర్థనుడు అని పేరు పెడుతుంది. విష్ణువర్థనుడు పెరిగి పెద్దయిన తర్వాత జరిగిన చరిత్రంతా తల్లి ద్వారా తెలుసుకుని చాణ్యు గిరికి వెళ్లి నందాదేవిని ఆరాధించి, కుమార నారాయణ, మాతృగణములను తృప్తి పరచి రాజచిహ్నాలైన శ్వేతా పత్రంలో శంఖము, పంచ మహా శబ్దము జెండా(పాలికేతన) వరాహా లాంఛనములు, పింఛ కుంత(బల్లెము) సింహాసనం మొదలైన వాటిని తీసుకుని కాదంబ, గాంగ రాజులను ఓడించి సమస్త దక్షిణ పథమును ఏలినాడు. ఈ విష్ణువర్థనుడే బాదామి చాణక్యులకు మూల పురుషుడు. చెల్లూరు శాసనంలో ముదివేము నేడు కడప జిల్లాలో ఉన్న పెద్దముడియం అని 1903లో జమ్మలమడుగు తాలూకా డివిజన్ ఆఫీసర్ అయిన శ్రీరామయ్య పంతులు ప్రతిపాదించారు. నేడు కడప జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో పెద్దముడియం మండలకేంద్రంగా కుముద్వతీ (కుందూ)నది తీరాన ఉన్నది పెద్దముడియం. విష్ణు వర్థనుడి తండ్రి విజయాదిత్యుడు యుద్ధం చేసింది త్రిలోచన పల్లవుడితో కాగా పెద్దముడియం ఆగ్రహారాన్ని దానమిచ్చింది కూడా త్రిలోచన పల్లవుడే. పెద్దముడియం శాసనాలలో విష్ణు వర్ధునుడి జన్మ వృత్తాంతానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. -
చాళుక్య కళా సృష్టికి కొత్త రూపు
సాక్షి, హైదరాబాద్: విశాలమైన ఆలయ ప్రాంగణం.. అద్భుత శిల్పకళ.. నగిషీలు చెక్కిన స్తంభాలు.. గర్భగుడిలోనే అంతర్గత ప్రదక్షిణ పథం ఉన్న సాంధార నమూనా మందిరం.. కాకతీయుల కులదైవంగా భావిస్తున్న ఏకవీర ఎల్లమ్మదిగా చరిత్రకారులు పేర్కొంటున్న ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారు. ఇందులో మూలవిరాట్టు లేకపోవటంతో ఇంతకాలం ఎవరూ పట్టించుకోవడం లేదు. శిథిలావస్థలో చెట్లు, పొదల మధ్య చిక్కుకుపోయిన ఈ ఆలయానికి మహర్దశ రానుంది. తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటి కావడంతో దీనిని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ శివార్లలోని మొగిలిచెర్ల గ్రామంలో ఉన్న ఈ ఏకవీర ఆలయాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ప్రతిపాదించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఆకట్టుకునే జైన గుహలు ఈ ఆలయ సమీపంలోని రాళ్లలో తొలిచిన జైన గుహలు ఆకట్టుకుంటాయి. పెద్ద రాతి గుండ్లను తొలిచి గుహలుగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతంలో జైనమత ప్రాబల్యం ఉండటంతో వరంగల్ పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో జైనుల ఆవాసాలు ఏర్పడ్డాయి. వారి విద్యాలయాలు కొనసాగాయి. ఆ క్రమంలోనే జైన మునులు ధ్యానం చేసుకునేందుకు ఇలాంటి గుహలు ఏర్పాటు చేశారని చెబుతారు. ఏకవీర ఆలయం సమీపంలో ఇలాంటి మూడు గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఆలయ పునరుద్ధరణలో భాగంగా వాటినీ ప్రాచుర్యంలో తేనున్నట్టు పేర్వారం రాములు ‘సాక్షి’కి వెల్లడించారు. ఇబ్బందుల మధ్య.. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఏకవీర ఆలయం పునరుద్ధరణ జరగాల్సి ఉంది. 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి దీనికి రూ.40 లక్షలు కేటాయించారు. పురావస్తు శాఖ టెండర్లు కూడా పిలిచినా.. పనులు మొదలుపెట్టలేదు. తర్వాత ఆ నిధులను వేరే పనులకు మళ్లించారు. ప్రస్తుతం ఈ ఆలయానికి వెళ్లేందుకు దారి కూడా లేదు. చుట్టూ పట్టాభూములు కావటంతో రోడ్డు నిర్మాణం జరగలేదు. ఈ నేపథ్యంలో స్థానికులతో మాట్లాడి రోడ్డు నిర్మించటంతోపాటు విద్యుత్ వసతి కల్పించనున్నారు. పునరుద్ధరణ తర్వాత ఇది కూడా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు. అరుదైన తరహాలో.. సాధారణంగా దేవాలయాల్లో గర్భ గుడి చుట్టూరా ప్రత్యేక మంటపాలు ఉండవు. భక్తులు గర్భగుడి వెలుపల.. ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ సాంధార నమూనాలో నిర్మించే ఆలయాల్లో ప్రదక్షిణ పథం అంతర్గతంగానే ఉంటుంది. గర్భాలయం చుట్టూ భక్తులు తిరిగేందుకు ప్రత్యేకంగా నిర్మాణం ఉంటుంది. ఇలాంటి తరహా ఆలయాలు అరుదుగా కనిపిస్తాయి. వరంగల్‌లోనే ఉన్న భద్రకాళి మందిరం, పరకాల–ఘన్పూర్ దారిలో ఉన్న గుడిమెట్ల శివాలయం, బయ్యారంలోని ఓ పురాతన మందిరం.. ఇలా వేళ్లమీద లెక్కించే సంఖ్యలో ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. కాకతీయులకు పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన కళ్యాణి చాళుక్యులు ఏకవీర ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఇందులో ఏకవీర ఎల్లమ్మను కొలిచినట్లు పూర్వీకుల ద్వారా తెలిసినా.. దానికి సంబంధించి శాసనాలు, ఆధారాలేమీ లభించలేదు. ఇక మొగిలిచెర్ల ఊరు అసలు పేరు మొగిలి చెరువుల అని.. అక్కడి చెరువుల్లో విస్తృతంగా మొగిలిపూల వనం ఉండటంతో ఆ పేరొచ్చిందని చెప్పే శాసనాలు మాత్రం లభించినట్టు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిల్లో ఈ దేవాలయం ప్రస్తావన కొద్దిగానే ఉందని, ఏకవీర ఎల్లమ్మ ప్రస్తావనేదీ లేదని పేర్కొంటున్నారు. అయితే ఏకవీర ఎల్లమ్మను కులదైవంగా భావించిన కాకతీయులు ఈ దేవాలయంలో నిత్యం పూజలు నిర్వహించేవారని మాత్రం చరిత్రకారులు చెబుతారు. కాకతీయుల పతనం తర్వాత ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. అందులోని మూలవిరాట్టును ఎవరో ఎత్తుకుపోయారు. మూల విరాట్టు లేక, పూజలు నిలిచిపోవటంతో భక్తుల రాక ఆగిపోయింది. చివరికి ఆలయం శిథిలావస్థకు చేరింది. అద్భుత శిల్పసంపదతో కూడిన స్తంభాలు పక్కకు ఒరిగిపోయాయి. -
‘కళ్యాణి’ నగర నిర్మాత ఎవరు?
వేములవాడ చాళుక్య రాజు ఒకటో వినమాదిత్య యుద్ధమల్లుడి మనువడైన మొదటి నరసింహవర్మ వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించాడని దేవాలయ ప్రాంగణంలోని శాసనాల ద్వారా తెలుస్తోంది. వేములవాడలోనే ఉన్న మరో దేవాలయం ‘భీమేశ్వరాలయం’. ఇది బదేగేశ్వర దేవాలయమని, దీన్ని ‘బద్దేగ’ అనే రాజు (క్రీ.శ. 850 - 895) నిర్మించాడని అక్కడి శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. కళ్యాణీ చాళుక్య రాజైన రాజాదిత్య క్రీ.శ. 1083లో వేయించిన శాసనంలో వేములవాడ చాళుక్యుల ప్రస్తావన ఉంది. చాళుక్యులు శాతవాహనుల తర్వాత దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలన్నింటిలో సుప్రసిద్ధమైంది చాళుక్యవంశం. వీరు క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు పాలించారు. వీరు వాకాటకులకు సామంతులుగా ఉండేవారు. స్వతంత్రులై మొదట బీజాపూర్ (కర్ణాటక) ప్రాంతాన్ని పాలించారు. వీరి రాజధాని బీజాపూర్‌లోని ‘బాదామి’. అందువల్ల వీరిని బాదామి చాళుక్యులని, పశ్చిమ చాళుక్యులని పిలుస్తారు. వీరి వంశ స్థాపకుడు ‘జయసింహ వల్లభుడు’. వీరు నవీన పల్లవులకు సమకాలీకులు. బాదామి చాళుక్యుల్లో ప్రముఖుడు రెండో పులకేశి. ఇతడు దక్షిణాపథంలో హర్షవర్ధనుడి జైత్రయాత్రను అడ్డుకున్నాడు. నర్మదానది ఒడ్డున హర్షవర్ధనుడిని ఓడించి, ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు. పల్లవ మహేంద్ర వర్మను కూడా ఓడించాడు. ఇతడు వేంగీ ప్రాంతాన్ని జయించి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనున్ని దానికి రాజుగా చేశాడు. రెండో పులకేశి కాలంలో హ్యూయాన్‌త్సాంగ్ చాళుక్యరాజ్యాన్ని (క్రీ.శ. 640 - 641) సందర్శించాడు. శాతవాహన వంశానికి చెందిన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత దక్షిణా పథాన్ని పూర్తిగా జయించి, పాలించిన మొదటి సార్వభౌముడిగా రెండో పులకేశి కీర్తిపొందాడు. ఇతడి విజయాలను ప్రముఖ జైన పండితుడైన ‘రవికీర్తి’ ఐహోల్ శాసనంలో వివరించాడు. పారశీక చక్రవర్తి రెండో ఖుస్రూ ఇతడితో దౌత్య సంబంధాలను పెట్టుకున్నట్టుగా ఆధారాలున్నాయి. మణిమంగళ యుద్ధంలో పల్లవ మొదటి నరసింహవర్మ చేతిలో పులకేశి ఓడిపోయి మరణించాడు. ఈ పరాజయంతో చాళుక్యరాజ్యం చిన్నాభిన్నమైంది. వీరిలో చివరి రాజు రెండో కీర్తివర్మ. ఇతడు రాష్ట్రకూట రాజైన దంతిదుర్గుడి చేతిలో ఓడిపోవడం వల్ల చాళుక్య వంశం పతనమైంది. రెండో పులకేశి మరణం తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు స్వతంత్ర రాజుగా వేంగీచాళుక్య వంశ పాలనను ప్రారంభించాడు. వీరినే తూర్పు చాళుక్యులు అని కూడా అంటారు. అదేవిధంగా కళ్యాణి ప్రాంతంలో కళ్యాణి చాళుక్యులు, వేములవాడ ప్రాంతంలో వేములవాడ చాళుక్యులు స్వతంత్ర రాజులుగా చెలామణిలోకి వచ్చారు. ఐహోల్, పట్టడగల్, బాదామి, ఆలంపూర్లోని దేవాలయాలు బాదామి చాళుక్యుల కాలంనాటివే. హరిహర, త్రిలోకేశ్వర, విజయేశ్వర, విరూపాక్ష, స్వర్గబ్రహ్మ దేవాలయాలు వారి వాస్తు శిల్ప కళా నైపుణ్యానికి మంచి నిదర్శనాలు. అజంతా కుడ్యచిత్రాలు, శ్రావణ బెళగోళా (కర్ణాటక)లో అతి పెద్ద గోమఠేశ్వర విగ్ర హం వీరి కాలం నాటివే. క్రీ.శ. 7వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు పాలించిన వేంగీ చాళుక్యుల్లో ఒకరైన చాళుక్య భీముడు ద్రాక్షారామం, భీమవరం, చేబ్రోలులో భీమేశ్వరాలయాలను నిర్మించాడు. అమరావతిలోని అమరేశ్వరాలయం, పాలకొల్లులోని క్షీర రామేశ్వరాలయం, రామలింగేశ్వరాలయం వీరి కాలం నాటివే. రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి ‘నన్నయ బట్టారకుడు’ మహాభారతాన్ని తెలుగులో రెండున్నర పర్వాలు (ఆది, సభా పర్వాలు, అరణ్యపర్వంలో కొంతభాగం) అనువదించాడు. ఈ విషయంలో నన్నయ్యకు కన్నడ కవి నారాయణబట్టు సహాయపడ్డారు. నన్నయ్య ‘ఆంధ్ర శబ్ద చింతామణి’ అనే మొదటి వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో కన్నడ త్రయం (పంప, రన్న, పొన్న) లో మొదటివాడైన ‘పంపకవి’ ఉండేవాడు. కొన్ని గ్రామాల సముదాయాన్ని ‘విషయం’ అని, కొన్ని విషయాలను ‘నాడులు’ అని, కొన్ని నాడులను‘మండలం’ అని వ్యవహరించేవారు. గ్రామాలను ‘గ్రామేమక’ అనే అధికారులు పర్యవేక్షించేవారు. మాడ, గద్య, చిన్న అనే నాణేలు వాడుకలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామాలను ‘అగ్రహారాలు’ అనేవారు. దేవాలయాలకు అనుబంధంగా ఉండే విద్యా సంస్థలను ‘ఘటికలు’ అని పిలిచేవారు. ప్రధానంగా వేంగీ చాళుక్యుల కాలంలోనే తెలుగు సాహిత్యం ఆవిర్భవించి, గుర్తింపు పొందింది. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు దీనికి ఆద్యుడు. వేములవాడ చాళుక్యులు వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటరాజులకు సామంతులుగా ఉండేవారు. కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘వేములవాడ’ రాజధానిగా వీరు పాలించారు. క్రీ.శ. 750 నుంచి 975 వరకు సుమారు 200 ఏళ్లు పాలించినట్లుగా చరిత్రకారులు భావిస్తున్నారు. వీరికి సంబంధించి పూర్తి ఆధారాలు లేవు. ఖమ్మం జిల్లాలోని ముదిగొండ కేంద్రంగా ముదిగొండ చాళుక్యులు కొంతకాలం పాలించారని వేంగీచాళుక్యుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ముదిగొండ చాళుక్యులు వేంగీ చాళుక్యులకు సామంతులుగానే పాలించారు. వీరు స్వతంత్ర రాజులు కారని ముదిగొండ శాసనం తెలియజేస్తోంది. మాదిరి ప్రశ్నలు 1. రెండో పులకేశి, పల్లవ మహేంద్ర వర్మను ఎక్కడ జరిగిన యుద్ధంలో ఓడించాడు? 1) మణిమంగళ 2) హలేబీడు 3) పుల్లలూర్ 4) రాయదుర్గ 2. బాదామి చాళుక్యుల మూల పురుషుడు? 1) జయసింహ వల్లభుడు 2) పులకేశి3) యుద్ధమల్లుడు 4) దంతిదుర్గుడు 3. ‘ఐహోలు’ శాసనకర్త? 1) కీర్తివర్మ 2) రాజా సింహ 3) రవికీర్తీ 4) పులకేశి 4. ఐహోలు శాసనం ఏ రాజు గురించి వివరిస్తోంది? 1) మొదటి పులకేశి 2) రెండో పులకేశి 3) కుబ్జ విష్ణువర్ధనుడు 4) విక్రమాదిత్యుడు 5. రెండో పులకేశి పాలనాకాలంలో అతడి రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? 1) పాహీయాన్ 2) ఇత్సింగ్ 3) రెండో ఖుస్రూ 4) హ్యూయాన్‌త్సాంగ్ 6. వాతాపి (బాదామి) నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దిన చాళుక్యరాజు? 1) రెండో పులకేశి 2) మొదటి కీర్తివర్మ 3) మొదటి విజయాదిత్య 4) మంగలేశుడు 7. పశ్చిమ చాళుక్యుల్లో ప్రముఖ రాజు? 1) జయసింహవల్లభుడు 2) కీర్తివర్మ 3) నరసింహవర్మ 4) రెండో పులకేశి 8. ఎవరిని ఓడించడం వల్ల రెండో పులకేశి ‘పరమేశ్వర’ అనే బిరుదు పొందాడు? 1) నరసింహవర్మ 2) మహేంద్రవర్మ 3) హర్షవర్ధనుడు 4) శ్రీకృష్ణుడు 9. ‘వాతాపికొండ’ బిరుదు ఎవరిది? 1) చాళుక్య కీర్తివర్మ 2) చాళుక్య రెండో పులకేశి 3) పల్లవ మహేంద్రవర్మ 4) పల్లవ నరసింహవర్మ 10. {పాచీన భారతదేశ, మధ్యయుగ భారతదేశ చరిత్రకు మధ్య సంధి యుగంగా ఎవరి పాలనా కాలాన్ని భావిస్తారు? 1) పల్లవులు 2) చాళుక్యులు 3) రాష్ట్రకూటులు 4) గుప్తులు 11. కళ్యాణి చాళుక్యుల రాజ్యస్థాపకుడు? 1) రెండో తైలపుడు 2) మొదటి సోమేశ్వరుడు 3) రెండో పులకేశి 4) రెండో జయసింహవల్లభుడు 12. కళ్యాణి చాళుక్యుల రాజధాని? 1) వెంగీ 2) వాతాపి 3) మాన్యఖేతం 4) ధాన్యకటకం 13. ‘కళ్యాణి’ నగర నిర్మాత? 1) రెండో తైలపుడు 2) సత్యాశ్రయుడు 3) మొదటి సోమేశ్వరుడు 4) మొదటి విక్రమాదిత్యుడు 14. కళ్యాణి చాళుక్య వంశానికి చెందిన మొదటి సోమేశ్వరుడి అనుమతితో ‘హనుమకొండ’ కు స్వతంత్ర రాజైన కాకతీయ రాజు? 1) మొదటి ప్రోలరాజు 2) కాకర్త్య గండన 3) మొదటి ప్రతాపరుద్రుడు 4) మొదటి బేతరాజు 15. ‘విక్రమాంకదేవచరిత్ర’ను రచించింది? 1) రవికీర్తి 2) బిల్హణుడు 3) నాగార్జునుడు 4) కాళీదాసు 16. వేములవాడ రాజరాజేశ్వర దేవాలయాన్ని నిర్మించినవారు? 1) నరసింహవర్మ 2) మహేంద్రవర్మ 3) మొదటి రాజాదిత్య 4) మొదటి యుద్ధమల్ల 17. వేములవాడ చాళుక్యుల ఆస్థాన కవి? 1) బాణబట్టుడు 2) నన్నెచోడుడు 3) బిల్హణుడు 4) పంప 18. హర్షవర్ధనుడి ఆస్థాన కవి? 1) కాళీదాసు 2) బాణుడు 3) నారాయణబట్టు 4) పాల్కురికి సోమనాథుడు 19. పుష్యభూతి వంశస్థుల ప్రథమ రాజధాని? 1) స్థానేశ్వర్ 2) కనోజ్ 2) బీజాపూర్ 4) పాటలీపుత్రం సమాధానాలు 1) 3; 2) 1; 3) 3; 4) 2; 5) 4; 6) 2; 7) 4; 8) 3; 9) 4; 10) 2; 11) 1; 12) 3; 13) 3; 14) 1; 15) 2; 16) 1; 17) 4; 18) 2; 19) 1.