
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.
న్యూస్‌పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.
గతంలో ఎలా ఉండేది?
నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి.
అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.
ఇవాళ ఎలా ఉంది?
వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.
మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.
1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి
మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.
2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.
3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.
4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.
5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.
6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్‌లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.
7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.
ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.
పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?
పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి.