breaking news
Vedic mantras
-
అర్థం చేసుకోవాలి... అనర్థాలు నివారించుకోవాలి
పెళ్లి మంత్రాల్లో ఏ అర్థం ఉందో తెలుసుకోరు చాలామంది. పెళ్లిలో ఎలాంటి విధానంతో మెలగాలో తెలుసుకోరు ఎంతకాలమైనా. బడిలో ఒకటో తరగతి నుంచి పాఠాలు చదువుతారుగాని పెళ్లిలో ఏ అవగాహన పాఠాలు చదవకుండానే నెట్టుకొచ్చేయాలనుకుంటారు. వర్తమానంలో దంపతుల మధ్య జరుగుతున్న అనర్థాలు ప్రతి ఒక్కరినీ ఆగి, తమ వైవాహిక జీవనాన్ని తరచి చూసుకోమని కోరుతున్నాయి. సరి చేసుకుని ఆనందమయం చేసుకోమంటున్నాయి.న్యూస్పేపర్లు తెరిస్తే భార్యాభర్తల విడాకులు, హత్యోదంతాలు, ఆత్మహత్యలు... సోషల్ మీడియాలో చూస్తే వీధికెక్కి రచ్చ చేసుకోవడం, ఇంటి గుట్టు బయటపడేయడం... వివాహం వార్తగా మారడం... వివాహ గొడవలే ప్రధాన వార్తలుగా చలామణి కావడం చూస్తుంటే మనం ఎటువంటి సమాజం నుంచి ఎటువంటి సమాజానికి చేరుకుంటున్నామనేది పరిశీలించుకోవాలి.గతంలో ఎలా ఉండేది?నలభై, యాభై ఏళ్ల క్రితం వివాహ వ్యవస్థలో ఘోరమైన ఉదంతాలు ఇంత విస్తృతంగా కనిపించేవి కాదు. దంపతులు, పిల్లలు, అవ్వా తాతలు... కుటుంబ వ్యవస్థ కొనసాగుతూ ఉండేది. భార్యాభర్తల కీచులాటలు టీకప్పులో తుఫానులా ఉండేవి. చెప్పాలంటే కొందరు భార్యాభర్తల గొడవలు వీధిలో ఉన్నవారికి నవ్వులాటగా ఉండేవి. అంటే భార్యాభర్తలు చీటికి మాటికి కీచులాడుకోవడం నవ్వదగ్గ విషయంగా, వారి చేతగాని విషయంగా ఉండేది. విడాకులు అనే మాట చాలా అరుదుగా వినవచ్చేది. విడాకుల నిర్ణయానికి ఇటువైపు వర్గం, అటువైపు వర్గం వ్యతిరేకంగా నిలిచేది. యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. వివాహాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నం విడిపోవడానికి పట్టుపట్టడంలో ఉండేది కాదు.ఇవాళ ఎలా ఉంది?వివాహ వ్యవస్థను గౌరవించకపోవడం, ఒకరి పట్ల ఒకరు చూపాల్సిన నిజాయితీ లోపించడం, పిల్లల మీద కక్ష తీర్చుకోవడం, సమస్యకు బదులుగా భార్యనో భర్తనో నిర్మూలించడమే ఏకైక పరిష్కారం అనుకోవడం, వివాహం జీవితానికి ఒక గుదిబండగా మారిందని దాని నుంచి ఎలాగైనా బయటపడాలని చెడు మార్గాలు వెతకడం, హాయిగా ఉన్న ఇంటి నుంచి దూరంగా వెళ్లి ఆ నునుపైన కొండలపై మరింత హాయిగా గడపాలనుకోవడం... ఇవన్నీ అందమైన జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. పరేషానీలోకి నెట్టేస్తున్నాయి. మానసిక, శారీరక కష్టాలు తెచ్చి భవిష్యత్తును చావు దెబ్బ తీస్తున్నాయి.మీ వివాహం సమస్యల్లో ఉంటే–మీ వివాహం సమస్యల్లో ఉంటే మీ వివాహ బంధంలో ఈ విషయాలను చెక్ చేసుకోండి.1. నిజాయితీ: మీరు మీ జీవిత భాగస్వామి పట్ల నిజాయితీతో ఉన్నారా? నిజమైన ప్రేమతో ఉన్నారా? నిజమైన ప్రేమ పొందేలా మీ చర్యలు ఉన్నాయా? ప్రేమను ప్రదర్శిస్తున్నారా? నువ్వంటే నాకు చాలా ప్రేమ అని ఒకసారైనా చెప్పగలుగుతున్నారా. ప్రేమ వివాహానికి మూలం. ప్రేమను వ్యక్తం చేయనప్పుడు ప్రేమ పొందలేరు.2. కమ్యూనికేషన్: మీ మనసులో ఉన్నది స్పష్టంగా మీ జీవిత భాగస్వామికి చెబుతున్నారా? చెప్పి వారికి అది అర్థం చేసుకోవడానికి సమయం ఇస్తున్నారా? అన్నీ మనసులో పెట్టుకుని మౌనంగా ఉంటే అది హింస కిందకు వస్తుంది. మౌనంతో హింసించే విధానం మానుకుంటే వివాహంలో మాట, మంచి మాట మెల్లగా వస్తాయి.3. వింటున్నారా?: వినడం తెలిస్తే సగం సమస్యలు పోతాయి. మీ జీవితభాగస్వామి ఏదైనా చెప్పబోతే మధ్యలోనే తుంచేస్తే, ఎదురు చెప్తే ఇక ఏమీ ముందుకు వెళ్లదు. ఎదుటి వారు చెప్తున్నది పూర్తిగా విని, సమయం తీసుకొని అందులోని మంచి చెడు పట్ల మీ అభిప్రాయం మెత్తగా, స్పష్టంగా చెప్పగలిగితే, అరవడాలు కరవడాలు లేకుండా మాట్లాడుకోగలిగితే చాలు. వివాహం వర్థిల్లుతుంది.4. గౌరవం ఉండాలి: ఒక మనిషి మరో మనిషిని ఎప్పుడు ఇష్టపడతాడంటే ఆ మనిషి తనను గౌరవిస్తున్నాడని తెలిసినప్పుడే. మనం వెళితే గౌరవించి టీ ఇచ్చే ఇంటికే మనం వెళ్తాం తప్ప ముఖాన తలుపు వేసే వారింటికి వెళతామా? భార్యాభర్తల విషయం కూడా అంతే. చులకన భావం వివాహానికి ప్రథమ విరోధి. భార్య/భర్త ఒకరినొకరు చులకన భావంతో చూస్తే వివాహం చులకనకు లోనవుతుంది. ఆ తర్వాత హేళన, ఆపైన తిట్టు, అటుపై కొట్లాట, తదుపరి నువ్వెంతంటే నువ్వెంత అనే మాటలు వచ్చేస్తాయి. చులకన వద్దు.5. సహానుభూతి: పని చేసి అలసిపోయి ఉంటాడేమో, వంటపని, ఇంటి పనితో డస్సిపోయిందేమో అని ఒక నిమిషం పరస్పరం ఆలోచిస్తే... సానుభూతి అందిస్తే ఎంతో ఓదార్పుగా ఉంటుంది. అలసిపోయి ఉన్న జీవిత భాగస్వామిని ‘ఆ.. పెద్ద చేశావులే’ అనే ఒక్క మాటతో శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. సహానుభూతి చూపితే అది పెద్ద సహాయం చేస్తుంది. ఎమోషనల్ ఇంటిమసీ చాలా ముఖ్యం.6. హద్దులు: మీరు వివాహం చేసుకున్నారు కాని ΄÷లంలో పని చేసే ఎద్దును తెచ్చుకోలేదు. వివాహంలో హద్దులు ఉంటాయి. భార్య/భర్తల పర్సనల్ స్పేస్లో ఎంతవరకు వెళ్లాలో తెలుసుకొని ఉండాలి. ఉమ్మడి ఇష్టాలను కలిసి నిర్వహించుకోవాలి.7. ఆర్థికం: ఆర్థిక విషయాలలో భార్యాభర్తల మధ్య అవగాహన అన్నింటి కంటే ముఖ్యం. అప్పులు, అధిక ఖర్చులు ఇద్దరిలో ఎవరు చేసినా ఆ వివాహం ప్రమాదంలో ఉన్నట్టు. అలాగే ప్రతి పైసా గీచిగీచి లెక్క అడిగినా ప్రమాదమే. ఇంటి ఖర్చు, ΄÷దుపు, బాధ్యతలకు అవసరమైన సహాయం... వీటిని జాగ్రత్తగా చూసుకుంటే అంతటా అనుకూలమే.ఈ ఏడు సలహాలు వివాహం ముందుకెళ్లడానికి ఏడడుగులు.పెళ్లి అర్థం కాకుండా పెళ్లెందుకు చేసుకున్నారు?పెళ్లి బొమ్మలాట కాదు. అది పెద్ద బాధ్యత. జీవితాన్ని ఫలవంతం చేసే దశ. ఒంటరి మనిషికి కుటుంబం అనే అందమైన బాంధవ్యాన్ని ఇచ్చే వరం. సంతానాన్ని ఇచ్చి ఎనలేని తృప్తినిచ్చే మార్గం. వివాహంలో అడుగుపెట్టాలంటే మానసికంగా, శారీరకంగా సిద్ధమయ్యి అన్నీ ఆలోచించుకుని ఉండాలి. కాని గతంతో పోలిస్తే ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు లేదు. అమ్మాయి, అబ్బాయిల ఇష్టాయిష్టాలు తమకు తాము పట్టించుకోకపోవడం, కుటుంబాలు నిర్లక్ష్యం చేయడం, పొంతన కుదురుతుందో లేదో చూడకపోవడం, అబ్బాయికి అమ్మాయికి ఉన్న ఉపాధి మార్గాలు వారిని కలిపి ఉంచుతాయా... ఎక్కువ పని గంటల వల్ల గాని, ఇతర ఊర్లకు వెళ్లి పని చేయడం వల్లగాని గ్యాప్ తెస్తాయా చూడకపోవడం... డబ్బు పట్ల ఎవరికి ఎంత ఆశ, అత్యాశ ఉంది... అబ్బాయి/అమ్మాయి గురించి ఆరా తీస్తే వారు పెద్దలకు, సంప్రదాయాలకు ఇచ్చే విలువ ఏ మాత్రం ఉంటుంది... ఇవన్నీ చూడకుండానే చేసేస్తున్నారు. దాని వల్ల సమస్యలు వెంటనే బయల్దేరుతున్నాయి. -
వేద మంత్రాలు.. ఏడడుగులు..
మంచిర్యాల సిటీ : వేద మంత్రాలు, ఏడడుగులు, తలంబ్రాలు, కొత్తబట్టలు, బంధువులు, స్నేహితులు, బాజాభజంత్రీలు, మిత్రుల నృత్యాలు, అప్పగింతలు, విందు భోజనం.. ఇదీ పెళ్లి జరిపించే సంప్రదాయం. నాటి కాలంలో మొదలైన ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. ఆధునిక యుగంలోనూ నేటి యువత నాటి సంప్రదాయాన్నే గౌరవిస్తూ.. ఆ పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటోంది. గుడిలో దండలు మార్చడం, రిజిష్ట్రేషన్ కార్యాలయంలో సంతకాలతో సరిపెట్టుకుపోవడం వరకు కాలం మారినా సంప్రదాయానికి తమ ఓటు అని అంగీకరిస్తున్నారు. పెళ్లంటే నూరేళ్ల పంట.. ఆ నూరేళ్ల పాటు గుర్తుగా ఉంచుకోడానికి సంప్రదాయాన్ని మరువడం లేదు. కాలంతోపాటు మనుషులూ మారుతున్నారు. వారి జీవన శైలీ మారుతోంది. ఆస్తులు, అంతస్తులు పెరిగి పోతున్నాయి. వ్యక్తుల స్థోమతకు తగిన విధంగా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిపిస్తున్నారు. వరపూజ.. అబ్బాయి, అమ్మాయికి ఒకరికి ఒకరు ఇష్టమైన తరువాత జరిగే మొదటి కార్యక్రమం వరపూజ. మంచి శుభదినాన్ని ఎంపిక చేసి శుభలేఖను రాసి పండితులు వధూవరుల పెద్దలకు అందజేస్తారు. ఇరువురి ఇంట్లో భోజనాలు చేస్తారు. ఒకరికొకరు కొత్త బట్టలు పెట్టుకుంటారు. గణపతి పూజ.. వివాహంలో తొలి పూజ. ప్రతి పూజా కార్యక్రమంలో గణపతి పూజ చేయడం హిందూ సంప్రదాయం. వధూవరులకు ఎలాంటి కష్టాలు రానివ్వరాదని కోరుతూ చేసే పూజ ఇది. గౌరీపూజ.. వధువుకు సంబంధించిన పూజ ఇది. సకల దేవతలకు పూజనీయురాలైన గౌరీ మాతను పూజించడం సంప్రదాయం. ఈపూజతో అష్టైశ్వర్యాలు కలిగి వివాహ బంధంలో ఎటువంటి ఆటంకాలు రావని నమ్మకం. సుముహూర్తం వివాహ వేడుకకు లగ్న పత్రికలో పెట్టుకున్న ముహూర్తానికి అనుగుణంగా జీలకర్ర బె ల్లం తల మీద వధూవరులు పెట్టుకోడమే అసలైన సుముహూర్తం. దీన్నే ముహూర్త బలం అంటారు. దీంతో వధువు వరుడి సొంతం అయినట్టుగా భావించాలి. అరుంధతి నక్షత్రం పెళ్లి ముహూర్తం రాత్రి, పగలుతో సంబంధం లేకుండానే అరుంధతి నక్షత్రాన్ని వధూవరులకి చూపిస్తారు. ఈ నక్షత్రాన్ని చూడటం వలన దంపతుల సంసారం సుఖఃశాంతులతో ఉంటుందని నమ్మకం. తలంబ్రాలు వివాహనికి చివరి అంకం ముత్యాల తలంబ్రాలు పోసుకోవడం. సంసార నౌకకు ఇద్దరూ సమానమే. ఒకరికి ఒకరు సమానమే. పసుపుతో కలిపిన బియ్యాన్ని తలంబ్రాలు అంటారు. వీటిని వధూవరులు ఒకరి తలపై ఒకరు ఆనందంగా పోసుకుంటారు. కష్టం, సుఖం ఇద్దరికీ సమానమనే భావం కలిగించేది తలంబ్రాలు. -
వేదమే జీవననాదం
వేదమే జీవననాదం వారికి. కాన్వెంటుల్లో చదువు ‘కొన’లేని వారు కొందరైతే, చతుర్వేదాలే చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధి కలిగిస్తాయని వేద పాఠశాలలో చేరిన వారు మరికొందరు. ‘కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్న..’ అన్న పెద్దల మాటలే వేదంగా భావించి వేద పాఠశాలలో చేరినవారు మరికొందరు. వేదమంత్రాలను సుస్వరంతో వల్లె వేస్తూనే, ఇంగ్లిష్ పదాలతోనూ కుస్తీ పడుతున్నారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూ కంప్యూటర్తో దోస్తీ చేస్తున్నారు. కీసరగుట్టలోని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర సంస్కృత వేద పాఠశాల తమ విద్యార్థులను ఎందులోనూ తీసిపోని రీతిలో తీర్చిదిద్దుతోంది. ఒకప్పుడు గురుకులాలు సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించేవి. విద్యార్థులకు వేదవేదాంగాలు బోధించి ధర్మాన్ని నడిపే సారథులుగా తీర్చిదిద్దేవి. ఇప్పుడు కాలం మారింది. వేద విద్యార్థులు నేటి సమాజంలో బతకాలంటే ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అందుకే, ఈ కాలానికి తగినట్లుగా ఇక్కడి విద్యార్థులకు ప్రతిరోజూ ఇంగ్లిష్, కంప్యూటర్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. వీటిలో పరీక్షలూ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల్లో ఈ ట్రెండ్ పదేళ్ల కిందటే మొదలైంది. బ్రహ్మ ముహూర్తంతోనే దినచర్య బ్రహ్మ ముహూర్తం నుంచే వేద విద్యార్థుల దినచర్య మొదలవుతుంది. స్నానాదులు ముగించుకుని, ఉదయం ఆరు గంటలకల్లా మధుర స్వరంతో సుప్రభాతం ఆలపిస్తారు. ప్రాతఃకాల సంధ్యా వందనం ముగించుకుని అల్పాహారం తీసుకుంటారు. తొమ్మిది గంటలకు ప్రార్థనలో శ్రీ వేంకటేశ్వరుని అష్టోత్తరంతో కీర్తించి తరగతుల్లోకి వెళ్తారు. మధ్యాహ్నం వరకు గురువు చెప్పిన వేద మంత్రాలను వల్లె వేస్తారు. మాధ్యాహ్నిక సంధ్యావందనం ముగించుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం తరగతుల్లో ఉదయం చెప్పిన మంత్రాలను ఆవృతం (పునశ్చరణ) చేసుకుంటారు. సాయం సంధ్యా వందనం.. రాత్రి సహస్రనామ అర్చనలో పాల్గొని ఆధ్యాత్మికతను సంతరించుకుంటారు. అనధ్యాయాలే సెలవుదినాలు సాధారణంగా విద్యార్థులకు ఆదివారాలు, రెండో శనివారాలు సెలవులు. వేద విద్యార్థులకు మాత్రం అనధ్యాయ దినాలైన పాఢ్యమి, అష్టమి, పౌర్ణమి, అమావాస్యలే సెలవులు. ప్రతినెలా శుక్ల, కృష్ణ పక్షాల్లో వచ్చే పాఢ్యమి, అష్టమి, పక్షానికొకటి వచ్చే అమావాస్య, పౌర్ణమి కలిపి నెలకు ఆరు రోజులు పాఠశాల ఉండదు. ఆ రోజుల్లో బట్టలు ఉతుక్కోవడం వంటి వ్యక్తిగత పనులు చూసుకుంటారు. పాత పాఠాలను కాసేపు పునశ్చరణ చేస్తారు. సెలవు రోజుల్లోనే కాదు, ప్రతిరోజూ సాయంత్రం 5-6 గంటల సమయంలో క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఆటలాడతారు. స్మార్త, ఆగమ, వేద విభాగాల్లో కోర్సులు ఐదో తరగతి పూర్తి చేసుకున్న వారు వేదపాఠశాలలో చేరడానికి అర్హులు. ఇక్కడి పాఠశాలలో వేద, స్మార్త, ఆగమ విభాగాలు ఉన్నాయి. స్మార్త, ఆగమ విద్యాభ్యాసానికి ఎనిమిదేళ్లు, వేదాధ్యయనానికి పదేళ్లు పడుతుంది. వేదం చదువుకున్న వారికి ఆలయాల్లో అర్చక ఉద్యోగాలు ఉంటాయి. స్మార్తంలో పట్టభద్రులైన వారు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగే షోడశ సంస్కారాలు (డోలారోహణం, కేశఖండనం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహం వంటివి), వ్రతాలు, యజ్ఞ యాగాది క్రతువులు, కర్మకాండ వంటివి జరిపిస్తుంటారు. ఆగమ శాస్త్రాన్ని అభ్యసించిన వారు దేవాలయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో నిష్ణాతులవుతారు. ఆలయ నిర్మాణం, వాస్తు, దేవుడికి జరిగే కైంకర్యాలు, బ్రహ్మోత్సవాలు వంటి కార్యక్రమాల్లో వారి మాటే శిలాశాసనం. ఆదరణకు కొదవ లేదు వేద పాఠశాలలో చేరిన రోజునే వేద విభాగ విద్యార్థుల పేరిట రూ.3 లక్షలు, స్మార్త, ఆగమ విద్యార్థుల పేరిట రూ.లక్ష టీటీడీ బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది. విద్య పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ , టీటీడీ డాలర్ ప్రదానం చేస్తారు. డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకు ఆదరణ బాగానే ఉంటుంది. వేద పండితులు విదేశాల్లోనూ ’కొలువు‘దీరుతున్నారు. అక్కడి దేవాలయాల్లో ఇక్కడి నుంచి విద్యార్థులను తీసుకెళ్లి నియమించుకుంటున్నారు. కాలానికి తగినట్లుగా మార్పులతో విద్యార్థులు ముందుకెళ్తున్నారు. వేదం గొప్పతనం తెలిసింది : సుబ్రమణ్యం పోలీసు అవుదామనుకున్నా.. మా కుటుంబం బలవంతం మీదే వేద పాఠశాలలో చేరాను. ఇక్కడికొచ్చిన ఏడాదికే నా అభిప్రాయం తప్పని తెలిసింది. పోలీస్ ఉద్యోగంలోనైతే పరిమితమైన ప్రాంతానికే సేవ చే సే అవకాశముంటుంది. అదే వేద పండితుడిగా దైవానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే యావత్ సమాజానికి సేవ చేసినట్టే. వేదాల్లో మిగిలినవి కొన్ని మాత్రమే : దత్తు, తణుకు భాషలు, లిపులు అంతరించిపోతున్నట్లే, వేదాలు కూడా చాలావరకు అంతరించిపోతున్నాయి. అభ్యసించే వాళ్లే కాదు, బోధించేవాళ్లూ తగినంత మంది లేకపోవడమే దీనికి కారణం. రుగ్వేదంలో నిజానికి 21 శాఖలు ఉంటాయి. వాటిలో ఇప్పుడు మిగిలినవి రెండే. యజుర్వేదంలో వంద శాఖలు ఉంటే, వాటిలోనూ రెండే మిగిలాయి. సామవేదంలో వెయ్యిశాఖలు ఉంటే, మూడే అందుబాటులో ఉన్నాయి.