భక్తులు సమర్పించిన వ్రస్తాలు సేకరించుకునే కాంట్రాక్టులో ఇష్టారాజ్యం
గత ఏప్రిల్ నుంచి వచ్చే మార్చి వరకే అవకాశం
నష్టం వస్తోందని రెండేళ్లు పొడిగించాలంటూ వినతి
సిఫారసు చేసిన ఓ ఎమ్మెల్యే..ప్రతిపాదించిన ఈఓ, కమిషనర్ కార్యాలయం నుంచి సానుకూల ఆదేశం
2028 మార్చి వరకు కొత్త టెండర్ పిలవాల్సిన అవసరం లేకుండా వ్యవహారం
వ్యాపారం ప్రారంభించిన తర్వాత లాభం వస్తోందా.. నష్టమా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి. కానీ, వ్యాపారం ప్రారంభించిన వెంటనే నష్టం వచ్చిందన్న అభిప్రాయానికి రావటం కుదరదు. కానీ అలా టెండర్ వేసి..ఇలా నష్టం వస్తోంది.. ప్రత్యేక వెసులుబాటు ఇవ్వండంటూ ఓ వ్యాపారి అడిగేయటం, దానికి ఓ ప్రజాప్రతినిధి వంత పాడటం, వెనకాముందూ చూడకుండా ఉన్నతాధికారులు వెసులుబాటు ఇచ్చేయటం చకచకా జరిగిపోయింది. వడ్డించేవాడు మనవాడైతే ఏం చేసినా చెల్లిపోతుందన్న మాట ఇక్కడ తేలిగ్గా జరిగిపోయింది. ఇదంతా యాదగిరిగుట్ట దేవాలయంలో జరుగుతున్న ఇష్టారాజ్యానికి తాజా నిదర్శనంలా నిలిచింది.
సాక్షి, హైదరాబాద్: దేవాదాయశాఖ పరిధిలోని పెద్ద దేవాలయాలకు భక్తులు స్వామి, అమ్మవార్లకు వ్రస్తాలు సమర్పించటం సహజం. ఆ వ్రస్తాలను ప్రసాదంగా భావించి భక్తులు కొంటారు. వస్త్రాలను భక్తులకు విక్రయించేందుకు టెండర్లు పిలిచి ఎక్కువ మొత్తం పాడిన వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. యాదగిరిగుట్ట దేవాలయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టెండర్ పిలవగా ఓ వ్యాపారి రూ.52,15,600 (జీఎస్టీతో కలుపుకొని) మొత్తానికి దక్కించుకున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి చివరి నాటికి టెండర్ గడువు ఉంది.
కానీ టెండర్ దక్కించుకున్న మూడు నెలలకే... వ్రస్తాల విక్రయం సరిగ్గా లేదని, నష్టం వస్తోందని, దీంతో తనకు మూడేళ్లపాటు ఆ వస్త్రాలు విక్రయించే వెసులుబాటు కల్పించాలని దేవాదాయశాఖకు ఆ వ్యాపారి విన్నవించుకున్నారు. దీనికి వంత పాడుతూ ఓ ఎమ్మెల్యే సిఫారసు చేశారు. దాన్ని పరిశీలించిన దేవాలయ కార్యనిర్వహణాధికారి వెంకటరావు, కమిషనర్‌కు ప్రతిపాదించారు. ఆ వెంటనే సానుకూల ఆదేశాలు జారీ అయ్యాయి. టెండర్‌ను మూడేళ్లకు కొనసాగిస్తూ 2028 మార్చి 31 వరకు స్వామివారి వ్రస్తాలు సేకరించుకోవచ్చని పేర్కొంటూ ఆగస్టు 29 తేదీతో ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతిపాదించిన ఆలయ ఈఓ, దేవాదాయశాఖ కమిషనర్... రెండు పోస్టులను ఆ సమయంలో ఐఏఎస్ అధికారి వెంకటరావే నిర్వహిస్తుండటం విశేషం. ఇలాంటి టెండర్ల విషయంలో లాభ నష్టాలతో దేవాలయానికి బాధ్యత ఉండదని పేర్కొంటుంటారు.
దాన్ని పట్టించుకోకుండా మూడేళ్లపాటు పాత టెండరే కొనసాగేలా చక్రం తిప్పారు. గతంలో వేములవాడ దేవాలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలను సేకరించే టెండర్ విషయంలోనూ ఓ పర్యాయం ఇలాంటి వ్యవహారమే చోటు చేసుకుంది. రూ.5 కోట్లకుపైగా మొత్తానికి టెండర్ పాడిన వ్యక్తి టెండరు గడువు ముగిసే సమయంలో, నష్టం పేరు చెప్పి తనకు మరో రెండేళ్ల పొడిగింపు ఇవ్వాలని కోరగా, అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కొందరు వ్యక్తులు విజిలెన్సు విభాగానికి ఫిర్యాదు చేశారు. దీన్ని విజిలెన్సు అధికారులు ఎండగట్టడంతో పొడిగింపు ఆదేశాలను రద్దు చేసిన ప్రభుత్వం..మళ్లీ టెండర్ పిలవాలని ఆదేశించింది. మళ్లీ టెండర్ పిలిస్తే దాదాపు రూ.12 కోట్లకు ఫైనల్ అయ్యింది.
యాదగిరిగుట్ట పునర్నిర్మాణం తర్వాత భక్తులు సమర్పించే వ్రస్తాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ మొత్తానికి టెండర్ పిలిచే వీలుంటుంది. అంటే దేవుడి ఆదాయం పెరిగే అవకాశాన్ని అధికారులు కాలదన్నినట్టయ్యింది. దేవాలయ స్థలాలు, దుకాణాల లీజుల విషయంలో నష్టం వస్తే, టెండర్ విలువ ఆధారంగా 33 శాతం/ 50 శాతం పెంపుతో తదుపరి సంవత్సరానికి అదే వ్యక్తికి పాత టెండర్‌ను కొనసాగించే వెసులుబాటు ఉంది. గతంలో ప్రభుత్వం ఇచి్చన ఉత్తర్వు ప్రకారం ఇది కొనసాగుతోంది. దాన్ని ఇలా వ్రస్తాల విషయంలోనూ అన్వయించేస్తున్నారు. విచిత్రమేంటంటే... పాత టెండర్‌ను తదుపరి అదనంగా రెండేళ్లపాటు కొనసాగించినా, టెండర్ మొత్తానికి ఎంతమేర పెంపును జతచేశారో ఉత్తర్వులో పేర్కొనలేదు. అంటే దేవుడి ఆదాయానికి రెండు రకాలుగా నష్టం వాటిల్లినట్టయ్యింది.


