సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట ఆలయ విద్యుత్ శాఖ ఈఈ రామారావు ఏసీబీ వలకు చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 1.90 లక్షలు లంచం తీసుకుంటూ ఈఈ అడ్డంగా దొరికిపోయారు. ఓ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ అప్పగించేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన రామారావు.. లంచం ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ను రామారావు ఇబ్బందులకు గురిచేశాడు.
ఈ క్రమంలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గతంలోనూ రామారావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉండగా.. ఇరవై ఏళ్లుగా యాదగిరి గుట్ట ఆలయంలోనే తిష్ట వేశారు. బదిలీ చేసినా కానీ రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తిరిగి యాదగిరిగుట్ట దేవస్థాన పరిధిలోనే పోస్టింగ్ ఇప్పించుకునేవారనే ఆరోపణలు ఉన్నాయి. యాదగిరి గుట్ట ఆలయ పునర్నిర్మాణ సమయంలో రామారావు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉండగా.. గతంలో రామారావు అవినీతిపై ఫిర్యాదులు రాగా.. చిక్కకుండా పకడ్బందీగా తప్పించుకున్నారు. తాజాగా రూ.1.90 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.


