గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! | Sakshi
Sakshi News home page

World Heart Day: గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు! చిట్టి గుండె ఘోష..

Published Fri, Sep 29 2023 11:08 AM

World Heart Day: Can Heart Disease Come On Suddenly - Sakshi

నెల రోజుల క్రితం కదిరికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే హార్ట్‌ఎటాక్‌ అని తేలింది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడమేమిటని వైద్యులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారం రోజుల క్రితం అనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె నొప్పిగా ఉందని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఇంతలోనే సమస్య తీవ్రమైంది. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కారణమేమంటే తీవ్రమైన గుండె పోటు అని వైద్యులు చెప్పారు. ఎందుకిలా? నేడు వరల్డ్‌ హార్ట్‌ డే నేపథ్యంలో హృదయం గురించి సవివరంగా తెలుసుకుందాం!

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జీవన శైలి మార్పులు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వెరసి గుండెకు పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. గుండె జబ్బు ఒక్కసారే వచ్చి పడేది కాదు. అంతకుముందు ఎన్నో సంకేతాలు చిట్టి గుండె నుంచి వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడమని సూచిస్తుంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం చేటు తెస్తోంది. చివరికి ప్రాణాలూ తోడేస్తోంది. ఒక్క అనంతపురం రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 3 వేల పైగా జబ్బులకు రూ. 450 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, అందులో రూ.129 కోట్లు పైగా గుండెజబ్బులకే కేటాయించడం చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయచ్చు.

ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్‌ 29న ప్రపంచ గుండె దినోత్సవం ఏర్పాటు చేసి గుండె గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా యత్నం చేస్తోంది కూడా. ఈ ఏడాది థీమ్‌ "హృదయాన్ని ఉపయోగించండి గుండె గురించి తెలుసుకోండి". అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది కూడా. 

పల్లెలకూ పాకిన మాయదారి జబ్బు.. 
ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా గుండెపోటు కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ జీవనశైలి జబ్బులు ఎగబాకడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్‌ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించడంలో కనబరిచే నిర్లక్ష్యమే శాపమవుతోందని స్పష్టం చేసింది.   

యువకుల్లోనూ.. 
ఒకప్పుడు 55 ఏళ్లు దాటితేగానీ గుండె సంబంధిత జబ్బులొచ్చేవి కావు. కానీ నేడు 35 ఏళ్లకే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. గుండెపోటును సైలెంట్‌ కిల్లర్‌గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గుండె పోటుకు రకరకాల కారణాలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆజ్యం పోస్తున్నట్టు హృద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. 

గుండె జబ్బులకు ప్రధాన కారణం.. 

 • పొగాకు, ఆల్కహాల్‌ విపరీతంగా     తీసుకోవడం 
 • అధిక రక్తపోటు ఉంటే, 
 • నియంత్రణలో ఉంచుకోలేకపోవడం 
 • చెడు కొలె్రస్టాల్‌ అంటే ఎల్‌డీఎల్‌ (లో డెన్సిటీ లిపిడ్స్‌) ఉండటం 
 • శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ నూనెల (ట్రైగ్లిజరాయిడ్స్‌) శాతం 
 • వయసుకు, ఎత్తుకు మించి బరువు(ఊబకాయం) 
 • మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో నిర్లక్ష్యం
 • కుటుంబ చరిత్ర ప్రభావం

కాపాడుకోవాలి ఇలా 

 • రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం. 
 • కొవ్వులున్న ఆహారం తగ్గించి పీచు ఆహారం ఎక్కువగా తీసుకోవడం (కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, చిరు ధాన్యాలు) 
 • బరువును అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం 
 • ఆరుమాసాలకోసారి 2డీ ఎకో వంటివి  చేయించడం 
 • చెడు కొలెస్ట్రాల్‌ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం
 • బీపీ, షుగర్‌ అదుపులో ఉంచుకోవడం 

వ్యాయామమే శ్రీరామరక్ష   
గుండెజబ్బుల రాకుండా ఉండాలంటే రోజూ 40 నిముషాల నడక లేదా జాగింగ్, స్విమ్మింగ్‌ చేయాలి. కూల్‌డ్రింక్స్‌ తీసుకోకూడదు. రోజుకు 3 గ్రాములకు మించి ఉప్పు, నెలకు 500 మిల్లీ లీటర్ల మించి ఆయిల్‌ వాడకూడదు. ముఖ్యంగా పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుంది. పొగతాగడం, మద్యం అనేవి ఎప్పుడూ గుండెకు శత్రువులే. 
–డాక్టర్‌ వంశీకృష్ణ, హృద్రోగ నిపుణులు, అనంతపురం    

ఉచితంగా కార్పొరేట్‌ స్థాయి వెద్యం 
ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారికీ గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్‌ ఫుడ్, మద్యం, ధూమపానంతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు. సూపర్‌ స్పెషాలిటీలో కార్పొరేట్‌ స్థాయిలో హృద్రోగులకు సేవలు అందిస్తున్నాం. అటువంటి శస్త్రచికిత్సలు ప్రైవేట్‌గా చేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. ఇప్పటి వరకూ దాదాపు 400 వరకు ఆంజియోప్లాస్టీ,యాంజోగ్రామ్‌ ఆపరేషన్లు విజయవంతంగా చేశాం.    
 – డాక్టర్‌ సుభాష్‌చంద్రబోస్, కార్డియాలజిస్టు   

(చదవండి: జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్‌ టాబ్లెట్‌ వేసుకుంటున్నారా? అలా వాడితే..)

 
Advertisement
 
Advertisement