
అభంశుభం తెలియని చిన్నారులు ఆడుతూ పాడుతూ గంతులేయాల్సిన వయసులో కుటుంబ బాధ్యతలు మోస్తున్నారు. బడికి పోవాల్సిన బాలలు బండెడు చాకిరీలో మగ్గిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల పైనే అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకా లెక్కల్లోకి రాని వారెందరో..మన దేశంలోనే ప్రతి ముగ్గురిలో ఒకరు బడి ముఖం చూడని వారున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు పిల్ల లను పనిలో పెట్టేలా ప్రోత్సహిస్తుండడంతో..వ్యాపార వర్గాల వారు కూడా తక్కువ వేతనంతో ఎక్కువ పనిని బాలలతో చేయిస్తున్నారు. కొందరు బాలలైతే ప్రమాదకర పరిస్థితుల్లో కూడా పనులు చేస్తూ బాల్యాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. నేడు ప్రపంచ బాల కార్మిక నిర్మూలన దినం సందర్భంగా.. బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల వెతలపై ప్రత్యేక కథనం..
విజయనగరం గంటస్తంభం:
చిన్న వయస్సులోనే పనులు చేస్తున్న బాల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు కనీసం ప్రాథమిక విద్య కూడా పొందకుండానే కార్మికులుగా మారుతున్నారు. వారిలో పోషకార లోపం కారణంగా శారీరక ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. యాజమాన్యాలు బాల కార్మికులతో ఎక్కువ పనిచేయిస్తూ, తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. కొంతమంది బాలలు వారి సామర్థ్యానికి మించి పనులు చేయాల్సి వస్తోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రమాదకర పరిస్ధితుల్లో సైతం బాలలు పనిచేస్తున్నారు. బాలకార్మికులు భౌతిక, లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తోందని అనేక నివేదికలు వివరిస్తున్నాయి.
భవిష్యత్ అంధకారం..
బాల కార్మికులుగా కొనసాగిన వారు భవిష్యత్‌లో ఉ న్నతమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. వారికి సరైన విద్య లేకపోవడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. పోటీతత్వం నిండిన సమాజంలో అన్నిరకాలుగా వెననుకబడిపోతున్నారు. పెద్దవారయ్యాక సరైన ఉపాధి దొరకని కారణంగా పలువురు నేరాలకు పాల్పడుతున్నారు.
ఏటా బాలకార్మిక వ్యతిరేక దినం
ఏటా జూన్ 12న దాదాపు 100 దేశాల్లో బాల కార్మికుల వ్యతిరేక దినం నిర్వహిస్తారు. బాలకారి్మక వ్యవస్థకు వ్యతిరేకంగా అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ సంయుకత ఆధ్వర్యంలో ఈ దినాన్ని నిర్వహిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం పిల్లలు ఏదో ఒక పనిలో ఉన్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాలు, పట్టణల్లో పనులు ఎక్కువగా లభిస్తున్నందున చిన్నారుల వలసలు కొనసాగుతున్నాయి. అలా మారడానికి కారణం అధిక జనాభా, నిరక్షరాస్యత, పేదరికం వంటి కారణాలతో బడి ఈడు పిల్లలు చదువుకు దూరమవుతున్నారు.
బాలలను పనిలో పెడితే...కఠిన చర్యలు
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన బాధ్యత అందరిపై ఉంది. చిన్నారులను పనిలో పెట్టినా, వారితో పనులు చేయించినా చట్టారీత్యా నేరం. బాల కార్మికులు ఎక్కడ కనిపించినా 1098, 100, 112 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. విజయనగరం జిల్లాలో అన్ని శాఖల వారీగా 2020–24 సంవత్సరాల మధ్య మొత్తం 576 పిల్లలను రక్షించాం.
ఈ ఏడాది జూన్ 1తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, కూడళ్లు, ఇటుక బట్టీలు, మోకానిక్ షెడ్లు, వస్త్ర దుకాణాలు తదితర ప్రాంతాల్లో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. ప్రతి బుధవారం బాలకారి్మకుల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం. ఈనెల 31 వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుంది. చిన్నారులను పనులకు పంపిస్తే జరిగే అనర్థాలు, చట్టాలపై గ్రామాల్లోనూ అవగాహన కల్పిస్తున్నాం.
ఎస్‌డీవీ ప్రసాదరావు, జిల్లా కార్మికశాఖ ఉప కమిషనర్
(చదవండి: ఆటో డ్రైవర్ స్టోరీ..! చిన్న ఐడియాతో నెలకు ఏకంగా రూ. 5 లక్షలు పైనే..)