
తల్లిపాల వారోత్సవాలు
చాలా మంది మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల హార్మోన్ల స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పడుతుంటాయి. ప్రసవం అయ్యాక బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా
అమ్మకు హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి ఆందోళన పడకుండా తల్లి పాలు ఇవ్వడం ఆమె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది అంటున్నారు.
పీసీఓఎస్ అనేది సంతానోత్పత్తికి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సాధారణమైన హార్మోన్ల రుగ్మత. ఈ సమస్య ఉన్నa స్త్రీలలో ప్రోజెస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ హార్మోన్ రొమ్ము కణజాల అభివృద్ధికి అవసరం. ఈ కణజాలం తగినంతగా లేకపోవడం అలాగే ఈస్ట్రోజెన్ లేదా టెస్టోస్టెరాన్ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ సమస్యలు వంటి కారణాల వల్ల తక్కువ పాల ఉత్పత్తి ఉండవచ్చు. ఇలాంటప్పుడు తల్లి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తల్లికి మంచి గైడెన్స్, కుటుంబ మద్దతు, ఆరోగ్యకరమైన అలవాట్లతోపాటు బిడ్డకు చనుబాలు ఇవ్వడం వల్ల అమ్మలో పాలు ఊరటం పెరుగుతుంది. దీనివల్ల తిరిగి హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుంది. ప్రసవం నుంచి త్వరగా కోలుకోవడమూ జరుగుతుంది.
హార్మోన్ల స్థాయులను ఎలా ప్రభావితం చేస్తాయంటే...
బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లిలో ఆక్సిటోసిన్, ్రపోలాక్టిన్ ఉత్పత్తి పెరుగుతాయి. ఈ హార్మోన్లు పాల ఉత్పత్తితో పాటు తల్లీ–బిడ్డ బంధం, మానసిక ఆరోగ్య శ్రేయస్సుకు సహాయపడతాయి. పీసీఓఎస్ ఉన్న మహిళ తల్లి అయ్యి, పాలు బిడ్డకు ఇస్తుంటే ఆ తల్లిల్లో టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గవచ్చు. ఆక్సిటోసిన్ గర్భాశయం సంకోచించడానికి, ప్రసవం తర్వాత దాని సాధారణ పరిమాణానికి తిరిగి రావడానికి తోడ్పడుతుంది.
తల్లీ–బిడ్డ బంధాన్ని మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ సమస్థాయిలో ఉండి, పెరిగిన బరువును ప్రసవం తర్వాత తగ్గడానికి సహాయపడుతుంది. పీసీఓఎస్ ఉండి, తల్లిపాలు ఇవ్వడంలో రకరకాల సవాళ్లు ఉంటాయి. కానీ చాలా మంది మహిళలు బిడ్డకు పాలు ఇవ్వగలుగుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో మంచి ప్రయోజనాలను పొందవచ్చు.
ఆందోళన పడవద్దు
తల్లిపాలు ఇవ్వడం ద్వారా పీసీఓఎస్ లక్షణాలు తిరిగి రావడంలో జాప్యం జరుగుతుంది. అయితే, తల్లిపాలు ఇవ్వడం ఆగిపోయిన తర్వాత, హార్మోన్ స్థాయులు మారినప్పుడు పీసీఓఎస్ లక్షణాలు తిరిగి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. పీసీఓఎస్ ఉన్నవాళ్లలో తక్కువ పాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, తల్లి ఆందోళన పడకుండా వైద్యులను సంప్రదిస్తే పాలు రావడానికి రొమ్ముకు మందులు సూచిస్తారు. తల్లిపాలు తగ్గడానికి పీసీఓస్ మాత్రమే కారణం అని చెప్పలేం. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా పాలు తక్కువ వస్తాయి. ఓపిక పట్టాలి.
అలాగని, కొన్ని రోజుల తర్వాత పాలు సరిపడా వస్తాయిలే అని జాప్యం చేయకూడదు. పోషకాహారం, వాడుతున్న మందుల విషయంలో ఉన్న సవాళ్లు, మానసిక సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తల్లులకు జ్వరాలు, ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా లాక్టేషన్ నిపుణులు లేదా వైద్యుల సలహా పాటించాలి. – డాక్టర్ మనోరమ, గైనకాలజిస్ట్, ఖమ్మం