breaking news
Polycystic ovary
-
అమ్మాయిల్లో విభిన్నం.. ఈ విభా!
మనకేదైనా ఆరోగ్య సమస్య ఎదురైన వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగెత్తుకెళ్లి్ ట్రీట్మెంట్ చేయించుకుని వారు చెప్పిన విధంగా మందులు వాడతాం. ఒకసారి సమస్య తీరితే అక్కడితో ఆవిషయాన్ని మర్చిపోతాం. బెంగళూరుకు చెందిన 25 ఏళ్ల విభా హరీష్ మాత్రం అలా చేయలేదు. తనకు వచ్చిన ఆరోగ్య సమస్యకు డాక్టర్లు ఇచ్చిన మందులు ఎలా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలించి, వాటి పనితీరు నచ్చడంతో ఏకంగా ఒక మందుల తయారీ కంపెనీని ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది. దీంతో తాజాగా ఫోర్బ్స్ ప్రకటించిన ఏసియా అండర్ 30 జాబితాలో విభా హరీష్‌కు చోటు దక్కింది. విభా హరీష్ ఇంటర్మీడియట్ చదువుతుండ గా తనకి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పీసీఓఎస్) ఉన్నట్లు వైద్యులు చెప్పారు. పీసీఓఎస్ నుంచి బయటపడేందుకు ఆయుర్వేద మెడిసిన్ బాగా పనిచేస్తుందని విభా వాళ్ల అమ్మ చెప్పడంతో.. ఆయుర్వేద మందులు వాడడం ప్రారంభించి అవి ఎలా పనిచేస్తున్నాయో చాలా జాగ్రత్తగా పరిశీలించేది. ఈ క్రమంలో తన పీసీఓఎస్ సమస్య పూర్తిగా నయం అయిన తరువాత.. ఆయుర్వేద మెడిసిన్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి విభాకు కలగడంతో..∙వివిధ రకాల సమస్యలకు ఆయుర్వేద మందులు ఎలా పనిచేస్తున్నాయో తన మీదే ప్రయోగించి తెలుసుకునేది. అలా ఆయుర్వేద ప్రాముఖ్యాన్ని గుర్తించి ‘కాస్మిక్స్’ అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించింది. జీర్ణ వ్యవస్థ, కాలేయం, చర్మం, నిద్రలేమి, కేశ సంరక్షణకు సంబంధించి ఎనిమిది రకాల హెర్బల్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. కాస్మిక్స్ ప్రారంభించిన ఏడాది కాలంలోనే రెండు కోట్ల టర్నోవర్‌కు చేరింది. ఇంజినీరింగ్ చదువుతోన్న విభా మూలికా వైద్యం గురించి మరింత తెలుసుకోవడానికి ఆయుర్వేద ఔషధాలపై అధ్యయనం చేస్తోంది. విభా తన తల్లి ప్రోత్సాహంతో కాస్మిక్స్ సంస్థను విజయపథంలో నడిపిస్తోంది. విభా తల్లి హోమియోపతిలో శిక్షణ తీసుకోవడం వల్ల కాస్మిక్స్లో తయారయ్యే ఉత్పత్తులను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. విభా తన కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు మంచి ఆహారాన్ని అందించేందుకు ఖర్చు చేస్తుండడం విశేషం. విభా మాట్లాడుతూ..‘‘నాకు పీసీఓఎస్ ఎదురైనప్పుడు దానినుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేశాను. ఇందులో భాగంగా ..పీసీఓస్ గురించిన సమాచారం కోసం నెట్లో తీవ్రంగా వెదికేదాన్ని. ఆ సమయంలో చాలా మంది ఏం తినాలి? ఎటువంటి వ్యాయామాలు చేయాలి అనే దానిపై విభిన్న అభిప్రాయాలను చదివాను. వాటిలో ఏది కరెక్ట్, మనకు కచ్చితంగా పనిచేసేది ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. రకరకాల ప్రయత్నాల తరువాత మా అమ్మ సలహా మేరకు ఆయుర్వేదం మందులు వాడాను. అవి నాకు బాగా పనిచేశాయి. దీంతో నాలాగా ఇబ్బంది పడుతున్నవారికి ఇవి అందించాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో నేను ఆయుర్వేద మూలికలు గురించి లోతుగా తెలుసుకుని నాకు ఆయుర్వేదంపై ఒక అవగాహన వచ్చిన తరువాత కాస్మిక్స్ సంస్థను ప్రారంభించాను. పూర్తిగా ప్రకృతిసిద్ధమైన ఉత్పత్తులు కావడంతో మంచి స్పందన వచ్చింది. ఒక సంవత్సర కాలంలోనే కాస్మిక్స్ ఈ స్థాయికి చేరుకుంది. ఫోర్బ్స్ ఏసియా అండర్ 30 జాబితాలో నా పేరు కూడా ఉండడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని విభా చెప్పింది. -
థైరాయిడ్ ఉంటే... పిల్లలు పుట్టరా?
సందేహం నా వయసు 21, బరువు 62 కిలోలు. నాకు రెండేళ్ల నుంచి పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడం లేదు. దాంతో ఆస్పత్రికి వెళితే యుటెరస్‌లో ఎలాంటి లోపం లేదు కానీ ఏవో చిన్న బబుల్స్ ఉన్నాయని చెప్పారు. అంతేకాదు థైరాయిడ్ కూడా ఉందని తెలిసింది. డాక్టర్ దానికి సంబంధించిన మందులు రాయడంతో వాటిని రెగ్యులర్‌గా వాడాను. ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంది కానీ పీరియడ్స్ మాత్రం రెగ్యులర్‌గా రావడం లేదు. దాని కారణంగానే బరువు పెరుగుతున్నానేమోనని అనుమానంగా ఉంది. అలాగే థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరని, ఒకవేళ పుట్టినా.. వారికీ థైరాయిడ్ వస్తుందని అందరూ అంటున్నారు. ఈ అనారోగ్యం కారణంగా నేను నా తల్లిదండ్రులను బాధపెడుతున్నాను. దయచేసి ఈ ఆందోళన నుంచి బయటపడే సూచనలు ఇవ్వండి. - ఓ సోదరి గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో ఎక్కువగా నీటి బుడగలు ఉండటాన్ని పాలిసిస్టిక్ ఓవరీ (PCO) అంటారు. వీటి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. కొందరిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, కొందరిలో మొటిమలు రావడం, జుట్టు రాలడం, పెదవులు, గడ్డం పైన అవాంఛిత రోమాలు రావడం, మెడచుట్టూ చర్మం నల్లగా మారడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. బరువు పెరిగే కొద్దీ నీటి బుడగలు ఇంకా పెరుగుతాయి. వాటివల్ల పైన పేర్కొన్న లక్షణాలు ఇంకా ఎక్కువ కావచ్చు. కాబట్టి మీరు బరువు తగ్గడానికి సరైన వ్యాయామాలు, మితమైన ఆహారం తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో నీటి బుడగల వల్ల ఏర్పడిన హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడానికి మందులు వాడండి. మందులతో పాటు జీవనశైలిలో మార్పులు చేసుకొని బరువు తగ్గితే.. మొత్తంగా నీటి బుడగలు మాయం అవ్వవు కానీ వాటి నుంచి ఏర్పడే హార్మోన్ల అసమతుల్యత చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ నియమాలు సరిగ్గా పాటిస్తే వివాహం తర్వాత పిల్లలు కలగడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ గర్భం రావడానికి ఇబ్బంది అయినా, కొద్దిపాటి చికిత్సతో గర్భం నిలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు థైరాయిడ్ ఉన్నంత మాత్రాన పుట్టబోయే బిడ్డకు కూడా తప్పనిసరిగా వస్తుందని ఏమీ లేదు. ఒకవేళ అంత అనుమానంగా ఉంటే.. బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డకు కూడా థైరాయిడ్ పరీక్ష చేయించండి. అది కన్ఫర్మ్ అయితే చికిత్స చేయిస్తే సరిపోతుంది. కాబట్టి మీరు అనవసరంగా కంగారు పడి, మీ తల్లిదండ్రులను బాధపెట్టకండి. ఈ మధ్య మీలాంటి సమస్య 40 శాతం అమ్మాయిలలో ఉంటోంది. నాకిప్పుడు 18 ఏళ్లు. నాకు బ్రెస్ట్ అసలు పెరగడం లేదు. ఏ డ్రెస్ వేసుకున్నా నా స్నేహితులు బాగా కామెంట్ చేస్తున్నారు. మా పేరెంట్స్ నాకు వచ్చే ఏడాది పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ నేను మరీ సన్నగా ఉన్నానని, సంబంధాలు కుదుర్తాయో లేదోనని కంగారు పడుతున్నారు. ఏవైనా మందులు వాడితే మరిన్ని సమస్యలు వస్తాయేమోనని భయపడుతున్నారు. నేనిప్పుడు ఏం చేయాలో తెలపండి. - వివరాలు రాయలేదు మీరు వయసెంతో రాశారు కానీ బరువు గురించి చెప్పలేదు. కొంతమంది సన్నగా ఉన్నప్పుడు వారి రొమ్ములు కూడా చిన్నగానే ఉంటాయి. ఒకవేళ మీరు సన్నగా ఉంటే.. కొద్దిగా బరువు పెరిగేందుకు ప్రయత్నించండి. బరువు పెరిగి, శరీరంలో కొవ్వు పెరిగినప్పుడు రొమ్ముల సైజు కూడా పెరుగుతుంది. దాని కోసం మందులు వాడవలసిన అవసరం లేదు. ఆహారంలో పాలు, పెరుగు, నెయ్యి, పండ్లు, డ్రైఫ్రూట్స్, గుడ్లు, మాంసాహారంతో కూడిన పౌష్టికాహారం రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లో కొవ్వు చేరి బరువు పెరుగుతారు కాబట్టి రొమ్ముల పరిమాణం కూడా పెరుగుతుంది. మీరు కంగారు పడకుండా బరువు పెరిగే ప్రయత్నం చేయండి. అలాగే రొమ్ములను క్రమంగా మసాజ్ చేసుకోవడం వల్ల కూడా రక్తప్రసరణ పెరిగి కొద్దిగా పరిమాణం పెరిగే అవకాశాలు ఉంటాయి. నా వయసు 22. బరువు 40. నా సమస్య ఏమిటంటే... నాకు ఈ మధ్యే వివాహం జరిగింది. మా వారికి శీఘ్ర స్కలనం సమస్య ఉంది. నేను, మావారు కలిసినప్పుడు కలయిక సమయంలో మావారికి త్వరగా స్కలనం జరుగుతోంది. దాంతో నాకు కలయిక సమయంలో సంతృప్తి కలగటం లేదు. దీనికి తగిన పరిష్కారం చెప్పండి. - ఓ సోదరి మీవారి శీఘ్ర స్కలనం సమస్యకు మీరు చేయడానికి పెద్దగా ఏమీ లేదు. మీవారు ఒకసారి యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వారు అతణ్ని పరీక్షించి సమస్య ఎక్కడుందో తెలుసుకొని, దాన్నిబట్టి అవసరమైన చికిత్సను అందిస్తారు. దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. - డా॥వేనాటి శోభ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్