పోష్‌ ఉందిగా... జోష్‌గా ఉందాం! | Women employees in India are legally protected by the POSH Act | Sakshi
Sakshi News home page

పోష్‌ ఉందిగా... జోష్‌గా ఉందాం!

Jun 25 2026 5:25 AM | Updated on Jun 25 2026 5:25 AM

Women employees in India are legally protected by the POSH Act

పనిచోట మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం, ఇబ్బంది పడేలా వ్యవహరించడం కొనసాగుతూనే ఉంది. ‘పోష్‌’ చట్టం వచ్చి 13 ఏళ్లు అవుతున్నా కార్యాలయాల్లో మొక్కుబడి చర్యలే తప్ప గట్టి మేలు తలపెట్టని నేపథ్యంలో మహిళా ఉద్యోగులు ‘సీన్‌ క్రియేట్‌ చేసైనా’ రక్షించుకోవాలి అంటున్నారు మహిళా సంఘాల నేతలు. 

పనిచోట భయం ‘ఔట్‌ పంచ్‌’ కొట్టేలా చేయగలిగామా? ప్రతి ఆఫీసు క్యాబిన్ లో గౌరవం. ‘ఇన్  పంచ్‌’ కొట్టేలా చూడగలిగామా? మహిళా ఉద్యోగులకు తమ కోసం ‘పోష్‌’ ఉందన్న ఎరుక ఉందా? ‘ఫ్రెండ్లీ’ ముసుగులో భుజం తాకే చేయి, ‘జోక్‌’ పేరుతో గుచ్చుకునే మాట –  ఇవి రిపోర్ట్‌ అవుతున్నాయా? లేక ‘కెరీర్‌ ఏమవుతుందో’, ‘సీన్‌ అవుతుందేమో’ అని నోరు నొక్కుకుంటూనే ఉన్నారా? అయితే అది ఇంకా మహిళా ఉద్యోగుల పట్ల మంచి, సురక్షిత ఆఫీసుగా మారలేదని అర్థం. అక్కడి మగ ఉద్యోగులు వారికి తగిన సపోర్టు, రక్షణ ఇవ్వడంలో వెనుకబడి ఉన్నారని అర్థం. అందుకే ఇటీవల మహిళా సంఘాల నేతలు ‘సీన్  క్రియేట్‌ చేసైనా మిమ్మల్ని మీరు రక్షించుకోండి’ అంటున్నారు.

13 ఏళ్లయినా మొక్కుబడేనా?
2013లో ‘పోష్‌ చట్టం’ వచ్చింది. ఆఫీసుల్లో ఇంటర్నల్‌ కమిటీలు వచ్చాయి.  SHe-Box పోర్టల్‌ వచ్చింది. కానీ 2026లోనూ నైట్‌ షిఫ్ట్‌ అంటే మహిళా ఉద్యోగికి గుండె దడ. ఏదైనా ఇబ్బంది వస్తే కమిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఫిర్యాదు ఎలా ఇవ్వాలో తెలియదు. ఏడాదికోసారి లైంగిక వేధింపుల అవగాహన సదస్సు పెట్టి ‘గవర్నమెంట్‌ పెట్టమంది పెట్టాం’ అంటున్నాయి సంస్థలు. అందుకే పద్ధతి మారాలి. ప్రాక్టీస్‌ మారాలి.

కేస్‌ స్టడీ 1
డిపార్ట్‌మెంట్‌ మీటింగ్‌. సీనియర్‌ ఎంప్లాయీ శ్యామల డౌట్‌ రైజ్‌ చేసింది. బాస్‌ నవ్వుతూ, ‘శ్యామల గారూ, మీరు నీట్‌గా తయారై మీటింగ్‌కు వస్తే చాలు. ఏం చేయాలో నాకు వదిలిపెట్టండి’ అన్నాడు. రూమ్‌ అంతా నవ్వింది. శ్యామల ముఖం చిన్నబోయింది. కానీ మరో మహిళా కలీగ్‌ రాధిక అలెర్ట్‌ అయ్యింది. ‘సీన్  క్రియేట్‌ చేయకపోతే, రేపు ఇదే నార్మల్‌ అవుతుంది’ అనుకుని వెంటనే లేచి నిలబడింది. గొంతు పెంచలేదు, అరవలేదు. కానీ రూమ్‌ అంతా వినేలా క్లియర్‌గా అంది– ‘సర్, అది సరైన కామెంట్‌ కాదు. శ్యామల డౌట్‌ వాలిడ్‌. టీమ్‌లో ఎవర్నీ తక్కువ చేసి మాట్లాడటం మన కల్చర్‌ కాదు’. పిన్  డ్రాప్‌ సైలెన్స్. బాస్‌ మొహం మారింది. రాధిక ‘అపాలజైజ్‌ చేయండి’ అనలేదు. ‘ముందుకు వెళ్దాం, కానీ రెస్పెక్ట్‌తో’ అని చెప్పి కూర్చుంది. ఆ ఒక్క మాటతో శ్యామలకు గౌరవం దక్కింది, బాస్‌కి లైన్‌ అర్థమైంది, జూనియర్లకు ధైర్యం వచ్చింది.

కేస్‌ స్టడీ 2
టీమ్‌ అవుటింగ్‌. సరదా వాతావరణం. సేల్స్‌లో సీనియర్‌ రవి కొత్తగా జాయిన్  అయిన అనన్యను పదే పదే టచ్‌ చేస్తున్నాడు. అందరూ నవ్వుతున్నారు. టీమ్‌ లీడ్‌ శ్రావ్య చూసింది. వెంటనే వెళ్లి అనన్య పక్కన నిలబడి ‘పద, నీతో పని ఉంది’ అని అక్కడినుంచి తీసుకెళ్లిపోయింది. అందరూ గమనించారు. రవి తడబడ్డాడు. మర్నాడు శ్రావ్య హెచ్‌ఆర్‌కి ఇన్ఫార్మ్‌ చేసింది. ‘ఎవరు కంప్లైంట్‌ చేశారో పేరు వద్దు, కానీ అవుట్‌సైడ్‌ ఎథిక్స్‌ సెషన్  పెట్టండి’ అని కోరింది. ఆ వారమే సెషన్  పడింది. రవికి వార్నింగ్‌ వెళ్లింది. డైరెక్ట్‌గా గొడవ పడక్కర్లేదు. బాధితురాలిని సీన్‌ నుంచి తప్పించడం, ఫాలో అప్‌ చేయడం కూడా బై స్టాండర్‌ ఇంటర్వెన్షనే.

మహిళా ఉద్యోగులు ఏం చేయాలి?
→ ఆపు: ‘నాకు నచ్చలేదు, రిపీట్‌ చేయొద్దు’ అని క్లియర్‌గా చెప్పాలి.
→ రికార్డు: వాట్సాప్, మెయిల్, కాల్‌ టైమ్, ఎవరున్నారు – నోట్‌ చేసుకోండి. ఇదే మీ ఎవిడెన్స్‌.
→ రిపోర్ట్‌: ఐసీకి మౌఖికంగా చెప్పినా చాలు. 90 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. ‘ఉద్యోగం పోతుంది’ అనే భయం వద్దు. అతిక్రమణ చేస్తే కంపెనీకి 50 వేల ఫైన్‌.
→ SHe-Box: అంతర్గతంగా న్యాయం జరగదనిపిస్తే షీ బాక్స్‌లో  ఫిర్యాదు చేయండి. మీ మాటే మీ లాయర్‌. ‘సర్దుకుపో’ అనే సలహా చెత్తబుట్టలో వేయండి. మీరు సర్దుకోవడానికి రాలేదు, సాధించడానికి వచ్చారు.

మగ ఉద్యోగులు ఏం చేయాలి?
‘నాకెందుకు’ అనే మాట మానేయండి. పక్క క్యూబికల్‌ అమ్మాయి కూడా ఎవరికో చెల్లి, కూతురే. మరి మీ రోల్‌ ఏంటి?
→ అడ్డుపడండి: తప్పు కనిపిస్తే ‘పద, పని ఉంది’ అని బాధితురాలిని అక్కడి నుంచి తప్పించండి.
→ కరెక్ట్‌ చేయండి: బాస్‌ పిచ్చి జోకులేస్తే ‘ఇది సరి కాదు’ అని అక్కడికక్కడే కట్‌ చేయండి. నవ్వితే మీరూ నేరస్థులే.
→ సాక్షిగా నిలబడండి: ఆమె కంప్లైంట్‌ ఇస్తే ‘నేను చూశాను’ అని ఇంచార్జీకి చెప్పండి. మీ ఒక్క మాట ఆమెకు కొండంత ధైర్యం.
→ కల్చర్‌ సెట్‌ చేయండి: ‘సీన్  క్రియేట్‌ చేయకు’ అని బాధితురాలికి బోధించవద్దు. ‘సీన్  క్రియేట్‌ చేసి ఆపే’ వారిగా నిలవండి.

కవచం: పోష్‌ ఒక కవచం. ఆ కవచం మీ దగ్గరే ఉందని గ్రహించండి. మహిళా ఉద్యోగి ‘నో’ చెప్పడానికీ, మగ ఉద్యోగి ‘ఆపు’ అని తోటి మగ ఉద్యోగిని ఆపడానికీ ఆ కవచం ఉపయోగించాలి.  ‘నాకు సంబంధం లేదు’ అని ఏ ఉద్యోగి అనకూడదు. ‘ఇక్కడ ఇది నడవదు’ అనేదే నినాదం. అప్పుడే అర్ధరాత్రి క్యాబ్‌ ఎక్కినా ఆమె కళ్లలో భయం ఉండదు. అందుకై అవసరమైనప్పుడల్లా సీన్  క్రియేట్‌ చేయండి– ఆపడానికి, కాపాడటానికి, మార్చడానికి! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement