ఇంట్లో తిట్లు, బయట సెటైర్లు.. అయినా బస్సు డ్రైవర్లుగా అమ్మాయిలు | Bihar made 6 Musahar women bus drivers | Sakshi
Sakshi News home page

ఇంట్లో తిట్లు, బయట సెటైర్లు.. అయినా బస్సు డ్రైవర్లుగా అమ్మాయిలు

May 19 2026 9:35 PM | Updated on May 19 2026 9:35 PM

Bihar made 6 Musahar women bus drivers

బిహార్‌లో ఆరుగురు యువతులు కొన్ని నెలల క్రితమే బస్ డ్రైవర్లుగా తమ వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. వాళ్లని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆడపిల్లలు బస్సులు నడపడం ఏంటని అంటున్నారు. బిహార్‌లో మహిళల భద్రత కోసం ప్రారంభించిన ‘పింక్ బస్’ పథకంలో భాగంగా తొలి మహిళా బస్ డ్రైవర్లుగా ఆరుగురు ముసహర్ దళిత మహిళలు బాధ్యతలు చేపట్టారు. 

అయితే మహిళా సాధికారత పేరుతో వచ్చిన ఈ పథకంలోనూ లింగ వివక్ష, అవమానాలు వారిని వెంటాడుతున్నాయి. అధికారులు ఇప్పటికీ వారితో పాటు పురుష డ్రైవర్లను పర్యవేక్షణకు పంపుతున్నారు. “ఇది మగవాళ్ల పని” అంటూ కొందరు సహచరులు ఎగతాళి చేస్తున్నారని మహిళా డ్రైవర్లు చెబుతున్నారు. పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని వచ్చిన ఈ యువతులు ఇప్పుడు బిహార్ రోడ్లపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు పోరాడుతున్నారు.

విశాలమైన బస్ డిపోలో 21 ఏళ్ల రాగిణి కుమారి జీన్స్‌, గులాబీ రంగు కుర్తీ, చెప్పులు ధరించి గులాబీ బస్సును కిక్కిరిసిన పార్కింగ్ ప్రాంతం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొస్తోంది. వరుసగా నిల్చున్న పురుష డ్రైవర్లు ఆమెను గమనిస్తున్నారు. బిహార్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన గులాబీ బస్ పథకం కింద నియమితులైన తొలి మహిళా బస్ డ్రైవర్లలో ఆమె ఒకరు.  

“పార్కింగ్ నుంచి బస్సును బయటకు తీసుకురాగలవా?” అని ఓ సహచరుడు అడిగాడు. రాగిణి మాత్రం స్టీరింగ్‌పై నుంచి చూపు తిప్పలేదు. “మా అమ్మాయిలపై మీకు నమ్మకం ఎప్పుడు వస్తుంది? కనీసం మమ్మల్ని నమ్మేందుకు ప్రయత్నించండి” అని ఆమె సమాధానం ఇచ్చింది. కొద్ది సేపటికి ఆ బస్సు డిపో నుంచి గాంధీ మైదాన్ వైపు బయల్దేరింది. రాగిణి నడిపే మార్గాల్లో అది ఒకటి. బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్ల బృందంలో ఆమెతో పాటు ఇంకో ఐదుగురు ఉన్నారు.

ఈ నెల బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ నియమించిన ఆరుగురు మహిళలూ ముసహర్ సమాజానికి చెందినవారే. బిహార్‌లో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల్లో ఇది ఒకటి. బిహార్‌ ప్రభుత్వం చేసిన ఈ నియామకాలు మహిళా సాధికారతలో కీలక ఘట్టమని ప్రశంసలు అందుకున్నాయి. అయితే ఆ మహిళలకు అసలు పోరాటం అప్పుడే మొదలైంది. డిపోలో అనుమానం, మహిళలపై ద్వేషభావం, మహిళలకు పూర్తిగా బాధ్యత ఇవ్వటానికి వెనుకాడుతున్న రవాణా వ్యవస్థతో ఆ మహిళా డ్రైవర్లు పోరాడాల్సి వస్తోంది. 

పితృస్వామ్య  సమాజంలో మార్పు తెస్తారా? 
బిహార్ తొలి మహిళా బస్ డ్రైవర్లుగా నియమితులైన ఈ ఆరుగురు ముసహర్ మహిళల పేర్లు రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి. ఈ యువతులు పేదరికం, కుల వివక్ష, కుటుంబ అడ్డంకులను దాటుకుని బస్సు స్టీరింగ్ పట్టారు. 

అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారికి పూర్తిస్థాయి స్వేచ్ఛ దక్కలేదు. మహిళల శారీరక సామర్థ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకంలో 100 బస్సులకుగాను కేవలం ఆరుగురు మహిళా డ్రైవర్లే చేరారు. మిగతావారిని కుటుంబాలు ఆ పనులకు పంపలేదు. మరికొందరు అమ్మాయిల పెళ్లిళ్లు జరగడంతో వారు డ్రైవర్లుగా ఉద్యోగాల్లో చేరలేదు. అయినా,  రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి బిహార్ పితృస్వామ్య ఆలోచనలకు సవాల్ విసురుతూ పోరాడుతున్నారు.

గత ఏడాది ప్రారంభమైన బిహార్ గులాబీ బస్ పథకం పూర్తిగా మహిళల ఆధారిత వ్యవస్థగా మార్చాలనుకున్నారు. మహిళా ప్రయాణికులు, మహిళా కండక్టర్లు, మహిళా నోడల్ అధికారులు, మహిళా డ్రైవర్లు ఉండేలా రూపకల్పన చేశారు. ఆరు నగరాల్లో ప్రవేశపెట్టిన ఈ బస్సులు మహిళలకు సురక్షిత ప్రజా రవాణా అందించాలనే ఉద్దేశంతో వచ్చాయి.  

ఉద్యోగం కంటే పెళ్లికే ప్రాధాన్యం ఇవ్వాలని కుటుంబాలు ఒత్తిడి చేయటం, మహిళల సామర్థ్యంపై పురుష డ్రైవర్ల అనుమానాలు, మహిళా ఉద్యోగులకు సరిపడా సదుపాయాలు లేని రవాణా కార్యాలయాలు సమస్యలుగా మారాయి. బిహార్ అణచివేతకు గురైన ముసహర్ సమాజానికి చెందిన ఆరుగురు యువతులు తమవారి భవిష‍్యత్తు మారేలా స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పట్టు వదలకుం డ్రైవర్‌ జాబ్‌ చేస్తూ పితృస్వామ్య  సమాజంలో మార్పు తెస్తారన్న భావనను అందరిలో కలిగిస్తున్నారు. 

“బిహార్ పితృస్వామ్య సమాజంలో ఈ అమ్మాయిల ప్రవేశం విప్లవాత్మకం. వీరు చూపిన ధైర్యం రాష్ట్రవ్యాప్తంగా యువతులకు ప్రేరణ అవుతుంది. పితృస్వామ్య ఆలోచనలను సవాలు చేసే మార్గం ఇది” అని సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సుధా వర్గీస్ చెప్పారు.  

బస్సు స్టీరింగ్‌ను తాకితే ఆత్మవిశ్వాసం 
ప్రతి రోజు ఉదయం 6 గంటలకు 21 ఏళ్ల రాగిణి కుమారి పాట్నాలోని బిహార్ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ డిపోకు చేరుకుంటుంది. “బస్సు స్టీరింగ్‌ను తాకిన ప్రతిసారి నాకు ఆత్మవిశ్వాసం వస్తుంది. బస్సు స్టార్ట్ చేసిన ప్రతిసారి నా కష్టాల ప్రయాణం కళ్లముందు తిరుగుతుంది” అని ఆమె చెప్పింది.

రాగిణి కుమారి, గాయత్రి కుమారి, ఆర్తి కుమారి, సరస్వతి కుమారి, బేబీ కుమారి, అనిత కుమారి 2025లో ఔరంగాబాద్‌లోని డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. ఈ పథకానికి “మహిళలకు భద్రత, గౌరవం అందించేందుకు కట్టుబడి ఉన్న బిహార్ ప్రభుత్వం” అనే నినాదాన్ని ఇచ్చారు. పట్నా, గయా, ముజఫర్‌పూర్, దర్భంగా, భాగల్పూర్, పూర్ణియా నగరాల్లో బస్సులను ప్రారంభించారు.

పట్నా పున్‌పున్ ప్రాంతంలోని అల్లౌద్దీన్‌చక్ గ్రామం నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్‌కు పంపేందుకు రాగిణి తండ్రి తొలుత నిరాకరించాడు. “నాన్న అనుమతించలేదు. అయినా నేను ఇంటి నుంచి వెళ్లిపోయి శిక్షణ తీసుకున్నాను. అది సులభమైన ప్రయాణం కాదు” అని ఆమె చెప్పింది.

గ్రామంలో పొరుగువారు ఆమె తల్లిదండ్రులను ఎగతాళి చేశారు. పెళ్లి చేయాలని సలహాలు ఇచ్చారు. ఆమె తల్లి సోనీ దేవి మాత్రం తన కూతురికి మద్దతుగా నిలిచింది. “ఆమె కోరుకున్నది చేయనిచ్చాను. నేను జీవితాంతం పేదరికంలో గడిపాను. ఆమె మాత్రం అలాంటి జీవితం గడపకూడదు” అని చెప్పింది. మసౌర్హిలో చరిత్ర ఆనర్స్ చదివిన రాగిణి ఇప్పుడు తన సహచరులతో కలిసి నెలకు రూ. 3,000 అద్దె చెల్లిస్తూ డిపోకు సమీపంలో ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement