ఉమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌ అవార్డులు స్ఫూర్తిదాయకం | Women of Impact Awards 2025 and Odiya festival in Hyderabad | Sakshi
Sakshi News home page

ఉమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌ అవార్డులు స్ఫూర్తిదాయకం

Apr 14 2025 3:04 PM | Updated on Apr 14 2025 3:29 PM

Women of Impact Awards 2025 and Odiya festival in Hyderabad

ట్రంప్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ ఆధ్వర్యంలో ప్రదానం 

అవార్డులను అందించిన ఫ్యాషన్‌ ఐకాన్‌ శిల్పారెడ్డి

సాక్షి, సిటీ బ్యూరో : వ్యాపారం, సాంకేతికత, కళలు, సామాజిక సేవతో పాటు విభిన్న రంగాల్లో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళలను ట్రంప్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ (టీఓటీ) ఆధ్వర్యంలో ‘ఉమెన్‌ ఆఫ్‌ ఇంపాక్ట్‌ –2025’ అవార్డులతో గౌరవించింది. హైటెక్‌ సిటీలోని అవసా హోటల్‌ వేదిక జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్, వెల్నెస్‌ అంబాసిడర్‌ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు అవార్డులను అందించారు. ఈ వేదిక ద్వారా మహిళల ప్రయాణాన్ని స్ఫూర్తివంతమైన కథలుగా ప్రదర్శించామని ట్రంప్స్‌ ఆఫ్‌ టాలెంట్‌ వ్యవస్థాపకులు మహమ్మద్‌ ఫయాజ్‌ తెలిపారు. అవార్డుల జ్యూరీలో లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ ఇండియా సీఈవో శిరీష వోరుగంటి, వీహబ్‌ సీఈవో సీతా పల్లచోల్ల, ఐబీఎం ఎగ్జిక్యూటివ్‌ భాగస్వామి అనురాధ ఏ, నోవార్టిస్‌ కంట్రీ హెడ్‌ దివ్య బాల్‌రాజ్, తెలంగాణ తొలి గిరిజన మహిళా వాణిజ్య పైలట్‌ కెప్టెన్‌ బాబీ ఉన్నారు. ప్రముఖ టాలీవుడ్‌ నటుడు పృధ్వీరాజ్, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధిపతి మనీషా సాబూ, అబైరో క్యాపిటల్‌ సలహాదారు మహంకాళి శ్రీనివాసరావు, ఎడ్యు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ఫిరోజ్‌ సైట్‌  పాల్గొన్నారు. 

 

నగరంలో ప్రవాసీ ఒడియా  ఫెస్టివల్‌ 

 ఉత్కళ ఒడియా యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహణ 
‘పత్‌ ఉత్సవాలకు’ వేదికైన ఖాజాగూడ పెద్ద చెరువు 


రాయదుర్గం : ఒడిశా వాసులు గచ్చిబౌలి డివిజన్‌లోని ఖాజాగూడ పెద్ద చెరువు వద్ద సందడి చేశారు. ఉత్కళ ఒడియా యూత్‌ అసోసియేషన్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ప్రవాసీ ఒడియా ఫెస్టివల్‌ ‘పత్‌ ఉత్సవం’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో నివాసముండే ఒడిశా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఉత్సాహాన్ని ప్రకటించారు. మొదట ఇస్కాన్‌ బృందం వారిచే కృష్ణ పరమాత్మ, రామలీలలపై గానామృతం నిర్వహించగా అందరినీ ఆకట్టుకుంది. అనంతరం రోడ్‌ రంగోలి మురుజా, ఆతోంటిక్, ఒడియా క్యూసిన్, డిస్‌ప్లే, ఆర్ట్, పైకా ఆర్ట్, టైగర్‌ నృత్యాలు వంటివి నిర్వహించి తమ సంప్రదాయాన్ని చాటుకున్నారు. అనంతరం శంఖనాథాలతో కూడిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓద్రా, దేహం జుంబా నృత్యాలతోపాటు పిల్లల గ్లోబల్‌ ఆర్ట్స్‌ డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించగా ఒడిశా వాసులు ఆసక్తిగా తిలకించారు. ప్రత్యేక ఆహా్వనితులుగా ఐపీఎస్‌ అధికారి సౌమ్యామిశ్రా, సుప్రసిద్ధ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ అనురాధ పాండ్వా పాల్గొని అందరినీ మరింత ఉత్సాహపరిచారు. అనంతరం అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరంలోని ఒడిశా వాసులు పాల్గొన్నారు.  

తెలంగాణ రగ్బీ  జాతీయ స్థాయి సభ్యత్వం 

 ఇండియన్‌ ఫుట్‌బాల్‌ యూనియన్‌ నుంచి తెలంగాణ అసోసియేషన్‌కు సభ్యత్వం 
అధికారికంగా ప్రకటించిన ఐఆర్‌ఎఫ్‌యు

తెలంగాణలో బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికెట్‌ తరహాలో రగ్బీ క్రీడ కూడా అభివృద్ధి చెందనుందని తెలంగాణ రగ్బీ అసోసియేషన్‌ వెల్లడించింది. ఇండియన్‌ రగ్బీ ఫుట్‌బాల్‌ యూనియన్‌ నుంచి శాశ్వత సభ్యత్వం కోసం అధికారికంగా గుర్తింపు లభించిందని సంస్థ ప్రకటించింది. ఈ నూతన అనుబంధంతో తెలంగాణ రగ్బీ అసోసియేషన్‌ ‘ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌’ కింద శాశ్వత సభ్యులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలనూ అందించనున్నట్లు నూతన అధ్యక్షులు, లైఫ్‌స్పాన్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ నరేంద్ర రామ్‌ తెలిపారు. ఈ అధికారిక గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా రగ్బీని మెరుగుపరచడానికి, జాతీయ పాలక సంస్థతో సన్నిహితంగా సహకరించడానికి అసోసియేషన్‌ అనుమతిస్తుందని పేర్కొన్నారు. నూతన అధ్యక్షునిగా 2028 వరకూ మూడేళ్ల పాటు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తినిచ్చే శక్తివంతమైన రగ్బీ సంఘాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయనున్నామని తెలిపారు. 

ఆకట్టుకున్న మార్షల్‌ ఆర్ట్స్‌ 
వైశాఖీ ఉత్సవాల సందర్భంగా సాయంత్రం నగర కీర్తన్‌ పేరిట ఊరేగింపు నిర్వహించారు. అమీర్‌పేట గురుద్వారా నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రీన్‌ల్యాండ్స్, క్యాంపు కార్యాలయం, పంజాగుట్ట, అమీర్‌పేట మీదుగా గురుగ్రంథాన్ని, సిక్కు సంప్రదాయ ఆయుధాలను ప్రదర్శనంగా ఊరేగింపు నిర్వహించారు. సిక్కు యువతీ, యువకులు చేసిన మార్షల్‌ ఆర్ట్స్‌ కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ వంటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గురుగోవింద్‌సింగ్‌ వంశపారంపర్యంగా వస్తున్న ఐదు అరుదైన గుర్రాలు ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా గురుగ్రంథానికి పూజలు చేశారు.  ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement