వింటర్‌ ది డ్రాగన్‌: చలిపులి.. చర్మం వలుస్తోందా? | Winter Skin Care Problems How To Overcome | Sakshi
Sakshi News home page

వింటర్‌ ది డ్రాగన్‌: చలిపులి.. చర్మం వలుస్తోందా?

Jan 5 2025 10:04 AM | Updated on Jan 5 2025 10:04 AM

Winter Skin Care Problems How To Overcome

కొత్త ఏడాది తర్వాత క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయేమోగానీ... అందరూ బయటే ఎక్కువసేపు గడిపే సాయంత్రాలూ, పనులకు వెళ్లే ఉదయం వేళల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్‌లో వీచే కరకుగాలులు వాతావరణం నుంచి తేమను లాగేస్తాయి. అవి చర్మం నుంచి కూడా తేమను లాగేస్తుండం వల్ల మేను పొడిబారుతుంది. పొట్టుగా రాలుతుంది. 

ఇలాంటి సమస్యలన్నీ ఈ సీజన్‌లో అనివార్యంగా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి చర్మ స్వభావం ఒక్కోలా ఉండటం వల్ల కొందరిలో చలికాలపు  సమస్యలు ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ కనిపిస్తుంటాయి. ఈ చలి సమస్యల తీవ్రత చర్మంపై చాలా ఎక్కువగా ఉన్నవారిలో... వారి మేనిపై పగుళ్లు, చర్మం పొట్టుగా రాలడం వంటి లక్షణాలతో ఎక్జిమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సీజన్‌లో కనిపించే సమస్యల నుంచి రక్షణ పొందడమెలాగో తెలుసుకుందాం.

కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులతో చలికాలపు తీవ్రత నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అవి తెలుసుకునే ముందర ఈ కాలంలో వచ్చే కొన్ని సాధారణ చర్మ సమస్యలేమిటో చూద్దాం...

ఇవీ సాధారణంగా కనిపించే చర్మ సమస్యలు... 

ఎక్జిమా ఫ్లేర్స్‌ : తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మం ప్రభావితమై ఎగ్జిమాలాంటి పగుళ్లు. 

చర్మం పొడిబారడం, పొట్టుగా రాలడం :  బయటి చల్లగాలి కారణంగా దేహంలోని వేడిమి చర్మం నుంచి బయటకు వెళ్లడంతో తేమ కూడా బయటకు వెళ్తుంది. దాంతో చర్మం బాగా పొడిబారిపోవడమే కాకుండా, పొట్టుగా రాలుతుంది. 

పగిలే పెదవులు : సున్నితమైన పెదవుల చర్మమూ పగుళ్లువారుతుంది. 

చిల్‌ బ్లెయిన్స్‌ : చేతులూ, పాదాల మీద చర్మం కొన్నిచోట్ల (పగుళ్లు రాబోయే చోట) ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటి ఉబ్బెత్తు ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది. వీటిని చిల్‌ బ్లెయిన్స్‌ అంటారు. 

వింటర్‌ యాక్నె : జిడ్డు చర్మం వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనికి భిన్నంగా వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడూ మొటిమలు వస్తాయి. వీటిని ‘వింటర్‌ యాక్నే’గా చెప్పవచ్చు.

చర్మం ప్రభావితమైందని తెలిపే సూచనలివి... చలికాలపు చల్లగాలులకు చర్మం ప్రభావితమైనదనీ, దానికి ఇప్పుడు మరింత రక్షణాత్మక చర్యలు అవసరమని తెలియజేసే

లక్షణాలివి... 

  • చర్మం ఎర్రబారడం, ఇలా ఎర్రబారిన చోట దురద రావడం 

  • ఏవైనా ఉపశమన చర్యలకోసం లేపనాల వంటివి రాసినప్పుడు ప్రభావితమైన చర్మభాగాలు మంటగా అనిపించడం 

  • చర్మం తీవ్రంగా పొడిబారినప్పుడు అక్కడ పొట్టులా రాలడం 

  • చర్మం నుంచి తేమ తొలగి΄ోవడంతో చర్మం బాగా బిగుతుగా ఉన్న ఫీలింగ్‌ 

  • ఏవైనా చర్మ సంరక్షణ లేపనాలు రాసినప్పుడు చర్మం ముట్టుకోనివ్వకపోవడం. చర్మంపై చలికాలపు దుష్ప్రభావాల నివారణ, రక్షణ చర్యలివి... 

తేమ పెరిగేలా చూసుకోవడం: చర్మం ఎప్పుడూ తేమ కోల్పోకుండా చూసుకునేందుకు క్రమం తప్పకుండా... హైలూరానిక్‌ యాసిడ్, షియా బటర్‌ లేదా సెరమైడ్స్‌ ఉండే మంచి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. 

మరవకూడని సన్‌ స్క్రీన్‌ : చలికాలపు ఎండవేడిమిలోనూ అల్ట్రా వయొలెట్‌ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందర 30 ప్లస్‌ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ను చర్మంపై రాసుకోవడం మంచిది.  

హ్యుమిడిఫైయర్‌ వాడటం : గదిలోపల ఉండే పొడిదనాన్ని ఎదుర్కోవడం కోసం (మరీ ముఖ్యంగా బెడ్‌రూమ్‌ వంటి చోట్ల) క్రమం తప్పకుండా హ్యుమిడిఫైయర్‌ వాడాలి. 

గోరువెచ్చటి నీటితో స్నానం : వెచ్చటి నీళ్లతో స్నానం చేయడమన్నది స్నానం వేళ బాగున్నప్పటికీ ఆ తర్వాత చర్మం తీవ్రంగా పొడిబారి పగుళ్లుబారినట్లుంటుంది. దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే... స్నానం తర్వాత చర్మం బాగుంటుంది. గాఢమైన సౌందర్యసాధనాలు వద్దు చర్మంపై రాసుకునే ఉత్పాదనల్లో ఆల్కహాల్, రెటినాల్, మెంథాల్‌ వంటివి ఎక్కువ మోతాదుల్లో ఉన్నవి గానీ లేదా ఇతరత్రా గాఢమైన వాసనలు వచ్చే సౌందర్యసాధనాలకు బదులు తేలికపాటి సువాసన వెదజల్లే మైల్డ్‌ సౌందర్యసాధనాలు వాడుకోవడమే మంచిది. 

నీళ్లు తాగుతుండటం: చర్మం కోల్పోయే నీటి మోతాదులను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. 

మేని నిగారింపును పెంచే ఆహారాలు తీసుకోవడం: మేని నిగారింపును మరింతగా పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన... అన్ని రకాల ΄ోషకాలూ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకోవడం మేలు. 

వైద్యనిపుణులను సంప్రదించడం: పైన పేర్కొన్న అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్న తర్వాత కూడా చర్మంపై చలికాలపు దుష్ప్రభావాలు కనిపిస్తుంటే... తక్షణం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది.       
డా.  బాల నాగ సింధూర కంభంపాటి, కన్సల్టెంట్‌ డర్మటాలజిస్ట్‌  

(చదవండి:  టేస్టీ బర్గర్‌ వెనుకున్న సీక్రెట్‌ తెలిస్తే కంగుతినడం ఖాయం..!     )  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement