ఏడాది కాలంలోనే ఉన్నత శిఖరాలకు విద్యా వెంకట్‌రామన్‌

Vidya Venkatraman: Startup Success Story Meraki And Co - Sakshi

విద్యా డిజిటల్‌ వెంకట రామన్‌

కరోనాతో దెబ్బకు వ్యాపారాలు దెబ్బ తిన్నాయి... అయితేనేం వెంటనే తేరుకున్నాయి. సాంకేతిక విజ్ఞానంతో స్టార్టప్‌లు డిజిటల్‌ సేవలు అందించాయి. ఎంబిఏ చేసిన విద్యా వెంకటరామన్‌ మెరకి అండ్‌ కో స్థాపించారు. విస్తృతంగా సేవలు అందించారు. ఏడాది కాలంలోనే ఉన్నత శిఖరాలు అధిరోహించారు... విద్యా వెంకట్రామన్‌ వ్యాపార ప్రయాణం..విద్యా వెంకటరామన్‌ సెయింట్‌ మేరీస్‌ స్కూల్‌లో చదువు పూర్తి చేశాక, ఎస్‌ఐఈఎస్‌ కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ కామర్స్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో చేరారు. ఆ తరవాత ఐబిఎస్‌ బెంగళూరులో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. విద్యా వెంకటరామన్‌... మార్క్యూ ఆర్గనైజేషన్స్‌ అయిన ప్రాక్టో, ఇండియా బుల్స్‌ సంస్థల ప్రేరణతో  మెరకీ అండ్‌ కో స్థాపించి, ఎల్లో టై హాస్పిటాలిటీ, ఫ్యాషన్‌ టీవీలలో వారికి కావలసిన సేవలు అందచేశారు. 

సమయాన్ని అనుకూలంగా...
కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచమంతా ఇంటికే పరిమితమైపోయింది. ఆధునిక సాంకేతికతతో అందరూ ప్రపంచంతో కనెక్ట్‌ అయ్యారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందాన విద్యా వెంకటరామన్‌ ఈ అవకాశాన్ని తన మార్కెట్‌ పెంచుకోవటానికి అనువుగా ఆలోచన చేశారు. వినియోగదారులకు ఆరు రకాల సర్వీసులు ప్రారంభించి, ఆ సంఖ్యను పదిహేనుకి పెంచి, 50 రకాల ఉత్పత్తులను తమ సేవల ద్వారా అందించటం ప్రారంభించారు. ఆమెకు 15 మంది సభ్యుల బృందం తోడుగా నిలిచింది. 

ఇవే ఆ సూత్రాలు..
నాలుగు సూత్రాల ఆధారంగా మెరకి అండ్‌ కో వివిధ అంశాలలో సేవలను అందించటం ప్రారంభించింది. ‘అవగతం చేసుకో, సృష్టించు, ఉల్లాస పరచు, ఫలితం సాధించు’ అనేవే ఈ సంస్థ పాటించిన సూత్రాలు. మొదట వినియోగదారులు చెప్పే ప్రతి మాటను వింటారు. చెప్పిన దానిని అర్థం చేసుకుంటారు. ఆ అంశం మీద అవగాహన ఏర్పరచుకుని పరిష్కారం చూపిస్తారు. వినియోగదారునికి సృజనాత్మకమైన రీతిలో దగ్గరైతే ఫలితాలు నాణ్యంగా ఉంటాయని నిరూపించారు మెరకి అండ్‌ కో ద్వారా విద్యా వెంకట్రామన్‌. ఈ స్టార్టప్‌.. సోషల్‌ మీడియా, ఇన్‌ఫ్లుయెన్సర్, ఇ మెయిల్, ఎస్‌ఎమ్‌ఎస్‌ రీతులను తనకు ఆలంబనగా చేసుకుంది. వెబ్‌సైట్, గ్రాఫిక్‌ డిజైన్‌ నుంచి బ్రాండింగ్‌ వరకు, ఫొటో షూట్స్, షూటింగ్స్, వీడియో షూట్స్, బ్లాగింగ్, కంటెంట్‌ రైటింగ్‌ ఇలా ఒకటేమిటి పబ్లిక్‌ రిలేషన్స్‌కు సంబంధించిన అంశాలన్నిటినీ మార్కెటింగ్‌లో భాగం చేసుకున్నారు.

ఇదే ప్రత్యేకత...
ఒక బ్రాండ్‌ను ప్రచారం చేసి, ఆ బ్రాండ్‌ విస్తృతి పెంచడం నుంచి అన్ని రకాల మార్కెటింగ్‌ ప్రచారాలను నిర్వహించడం మెరకి అండ్‌ కో ప్రత్యేకతగా మార్చుకున్నారు. ఒక సంస్థకు ఏ ప్లాట్‌ఫామ్‌ అయినా సరే... ప్రచారం కల్పించడం, వినియోగదారుకు సంతృప్తి కలిగించి, ఫలితాన్ని రాబట్టడమే ధ్యేయం. స్టార్టప్స్‌కు విస్తృతి కల్పించి, బ్రాండ్‌ బిల్డప్‌ చేయడానికి ఇదే తగిన సమయమని విద్యా వెంకటరామన్‌ నమ్మారు. సమగ్రమైన సేవలను సృష్టించి, ఉన్నత శిఖరాలకు చేరడమే ధ్యేయంగా ఎదిగారు. మహిళలే కేంద్రంగా పనిచేస్తున్న సంస్థలు వృత్తిలో ఏకాగ్రతను కనబరుస్తూ ఇతరులకు సాయపడి, వారి వ్యాపారాలను  పెంచుకుంటూ, కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. 

అతి వేగంగా...
ఏడాది క్రితం అంటే మే 3, 2020న ప్రారంభమైన విద్యా వెంకటరామన్‌ చేసిన ప్రయత్నం, ఊహించని సానుకూల ఫలితాలను అందించింది. వ్యాపార సమస్యలకు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ఆమె పరిష్కారాలను చూపిన తీరు అందరీ ఆకట్టుకుంది. ప్రపంచమంతా పవర్‌ ఆఫ్‌ డిజిటలైజేషన్‌ను అనుభవపూర్వకంగా ఆస్వాదించింది కూడా. ఉరుకులు, పరుగులు తీస్తున్న ప్రపంచం కంటికి కనిపించని చిన్న క్రిమి కారణంగా స్తంభించిన వేళ, ప్రపంచాన్ని డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ నడిపించింది. యాంత్రిక ఉత్పత్తి రంగం మినహా అన్నీ ఇంటి నుంచే సాగాయి. అవకాశం కోసం ఎదురుచూసేవారు సరైన వేదికను ఎంచుకుంటే ఆదాయానికి లోటుండదని, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించిన వారు దూసుకుపోయారని చెప్పడానికి విద్యా వెంకటరామన్‌ ఒక మంచి ఉదాహరణ. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top