
‘‘బాజా భజంత్రీలతో కళకళలాడాల్సిన ఇల్లు..వల్లకాటిలా మారిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే...తాళి కట్టిన చేతులతోనే.’’ ఇలాంటి వార్తలను చదివి, వినీ వినీ విసిగిపోయిన వారికి నిజంగా ఇది మిరాకిల్. బంధువులంతా బరువెక్కిన గుండెలతో, అశ్రునయనాలతో అంత్యక్రియలకు సిద్ధమవుతున్న వేళ చనిపోయిన మనిషి తిరిగి బతికి వచ్చాడు. హర్యానాలో అద్భుతం జరిగింది. దీంతో ఆ కుటుంబం తొలుత ఆశ్చర్యపోయింది. ఆ తరువాత వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అంత్యక్రియల కోసం చేసిన ఏర్పాట్లన్నీ అంతులేని ఆనందంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి.
హర్యానాలోని యమునానగర్ జిల్లాలోని కోట్ మజ్రిలో ఈ అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. షేర్ సింగ్ అనే 75 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో పెద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స అనంతరం షేర్ సింగ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో కుటుంబ సహ్యులు అంత్యక్రియలకోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. దహన సంస్కారాలకు కలప శ్మశానవాటికకు చేరుకుంది. దూరం నుండి వచ్చిన అతిథులు, ఇతరుల కోసం ఆహారం కూడా సిద్ధం చేశారు. అంత్యక్రియలకు సన్నాహాలు పూర్తయ్యాక, స్నానం చేయించే ముందు అతని వెంటిలేటర్ ట్యూబ్‌ను తొలగించారు. ఆ మరుక్షణంలో అతను కళ్ళు తెరిచి దగ్గు ప్రారంభించాడు. షేర్‌సింగ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది.
విచిత్రంగా వెంటిలేటర్ పైపు తొలగించగానే, షేర్ సింగ్ ఆకస్మికంగా ఊపిరి పీల్చుకోవడం ఆనందాన్ని కలిగించిందని స్థానిక మాజీ సర్పంచ్ రంజిత్ సింగ్ తెలిపారు అందరూ ఆనందంగా భోజనాలు ముగించి అదృష్టవంతుడు షేర్ సింగ్ అంటూ మనుసులోనే ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంతోషంగా తమ తమ ఇళ్లకు చేరారు.
ఇదీ చదవండి: చదివింది తక్కువే, రూ.500తో ముంబైకి, కట్ చేస్తే కోటీశ్వరుడుగా