వారధి: అది ఒక సరస్సు.. ఆ సరస్సుకు రెండు వైపులా.. | Varadhi: An Inspiring Short Story | Sakshi
Sakshi News home page

వారధి: అది ఒక సరస్సు.. ఆ సరస్సుకు రెండు వైపులా..

Jun 4 2026 8:59 AM | Updated on Jun 4 2026 9:19 AM

Varadhi: An Inspiring Short Story

జెన్‌ పథం

అది ఒక సరస్సు. ఆ సరస్సుకు రెండు వైపులా రెండు గ్రామాలు. ఆ సరస్సులో ఏడాది పొడవునా నీరు అతి వేగంగా పారుతుంటుంది. ఆ నీటి ప్రవాహవేగానికి ఎదురీది ముందుకు పోవడం అనేది చాలా కష్టం. అనా ఒకరిద్దరు ఆ నీటివేగం తమనేం చేస్తుందని చెప్పి సరస్సులో దిగి ప్రమాదంలో చిక్కుకుని బతుకుజీవుడా అంటూ అతి కష్టంమీద ఒడ్డుకు చేరుకున్నారు.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి రెండు గ్రామాల ప్రజలెవరూ ఎదురీతకు సాహసించలేదు. అంతేకాదు, ఎవరికి వారు తామున్న గ్రామంలోనే సురక్షితంగా ఉండడానికి నిశ్చయించుకుని అలాగే ఉంటూ వచ్చారు. ఇరు గ్రామాల ప్రజల మధ్య సంబంధాలూ ఉండేవి కావు. అలాగని శత్రుత్వమూ లేదు.

ఒకరోజు, సరస్సుకు కుడివైపున ఉన్న పల్లెకు ఓ గురువు వచ్చారు. ఆయన సరస్సు ఒడ్డున నిల్చుని ఎడమవైపున ఉన్న పల్లె వంక చూశారు.
‘‘నేను ఆ పల్లెకు వెళ్ళాలనుకుంటున్నాను’’ అని అన్నారా గురువు.
ఇంతలో ఓ పెద్దమనిషి ‘‘అది కష్టమండి’’ అని జవాబిస్తూ ‘‘నీటి ప్రవాహవేగం సామాన్యమైనది కాదు. అసలీ సరస్సులో ఈదాలనుకోవడమే చాలా కష్టం’’ అని అన్నాడు. అలాగే మరో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పారు. హెచ్చరిక చేశారు. అయినా ఆ గురువు వారి మాట పట్టించుకోలేదు.

‘‘నీటి ప్రవాహవేగాన్ని ఓ కారణంగా చెప్పుకుని మీ రెండు గ్రామాల మధ్య సంబంధాలు పెట్టుకోకపోవడం సరికాదు. మీరందరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి దీనిపై ఓ వారధి నిర్మించుకోవచ్చు కదా?’’ అని జెన్‌ గురువు ఓ సలహా ఇచ్చారు.
అయితే ఈసారి మరో ఇద్దరు ఒక్కసారిగా గొంతు కలిపి ఇలా చెప్పారు ‘‘బలే వారు స్వామీ, ఈ సరస్సులో ఈదడమే కష్టమనుకుంటుంటే దాని మీద వంతెన కట్టడమా...అది అసాధ్యం’’ అని అన్నారు.

అయినా జెన్‌ గురువు ఆగలేదు. ‘‘అది సాధ్యమే’’ అని అన్నారు.
‘‘నేను మీకందుకు సాయం చేస్తాను’’ అని ఆ గురువు వారికి హామీ ఇచ్చారు.
ఏదో మాట చెప్పానని ఊరుకోకుండా ఆ జెన్‌ గురువు పల్లెలోని వంద మంది యువకులను ఎంపిక చేసారు. వంతెన నిర్మాణానికి పూనుకున్నారు.

రాత్రీ పగలూ, ఎండా వానా అనేవేవీ లెక్కచేయకుండా ఆ వంద మంది యువకులతోపాటు జెన్‌ గురువూ శ్రమించారు. అనుకున్నట్టే ఆ సరస్సుపై ఓ వారధి ఏర్పాటైంది. ఇప్పుడు ఆ రెండు గ్రామాల ప్రజల మధ్య సత్సంబంధాలు పెరిగాయి. రాకపోకలు పెరిగాయి. అంతేకాదు, ఒకరి మధ్య ఒకరు సహకరించుకోవడం మొదలుపెట్టారు. ఈ ఊరు అబ్బాయిని ఆ ఊరు అమ్మాయికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఇరు గ్రామాల ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా కాలం గడుపుతున్నారు.

ఓ ఏడాది గడిచింది. ఓ రోజు ఇరు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఊరు పొలిమేరలో ఉన్న ఆశ్రమానికి వెళ్ళి తమ ఆనందానికి కారణమైన గురువును కలిశారు.  నమస్కరించారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘మిమ్మల్ని సన్మానించాలనుకుంటున్నాం’’ అని ముక్తకంఠంతో చెప్పారు. కానీ గురువు తనకెలాంటి సన్మానమూ వద్దని సున్నితంగా తిరస్కరించారు.
‘‘నాకు ఎలాంటి ఆడంబరాలూ వద్దు. పొగడ్తలూ వద్దు. ప్రచారమూ వద్దు. మీరందరూ ఇప్పటిలాగే ఎప్పుడూ కలసి మెలసి ఉంటే అదే నాకు ఆనందం’’ అని చెప్పారాయన. – జగద్రేణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement