
కొన్ని సమయాల్లో ఊహకందని విధంగా అంతర్జాతీయ స్థాయి రేంజ్‌లో బహుమతి వరించినా..అది ఆ వ్యక్తికి తెలియకపోతే.. ఔను..! ఆ వ్యక్తి తెలుసుకునే పరిస్థితుల్లో లేకపోతే..అదృష్టం వచ్చి ఒళ్లో వాలినా..తెలుసుకోలేకపోవడం అంటే..అంతకుమించిన దురదృష్టం మరొకటి ఉండదేమో కదూ. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు ఈ శాస్త్రవేత్త. చివరికి అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. పైగా తనకు ఈ బహుమతి వస్తుందని అస్సలు అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబయ్యాడు.
ఆ శాస్త్రవేత్తే అమెరికాకు చెందని ఇమ్యునాలజిస్ట్ ఫ్రెడ్ రామ్స్‌డెల్. అతను డిజిటల్ డిటాక్స్ కోసం తన భార్యతో కలిసి అడవిలో సేద తీరుతున్నాడు. అలా అక్కడి పరిసరాలతో మమేకమవుతుండగా భార్య ఒక్కసారిగా పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసింది. అది చూసి రామ్స్‌డెల్ అడివిలో ఉండే ఎలుగుబంటులను చూసి భయపడింది కాబోలు అనుకున్నాడు.
తర్వాత ఆమె అసలు విషయం చెప్పడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. అస్సలు ఇది ఊహించలేదంటూ రామ్స్‌డెల్ సంబరపడ్డట్లు నోబెల్ కమిటీ సెక్రటరీ జనరల్ థామస్ పెర్లమాన్ పేర్కొన్నారు. అమెరికాలోని మోంటాన పర్వత శ్రేణుల్లో ఎంజాయ్ చేస్తున్నా ఆ జంట ఈ విషయం తెలిసిన వెంటనే హోటల్‌కు చేరుకుని నేరుగా న్యూయార్క్ టైమ్స్‌తో కాసేపు ముచ్చటించారు. తాను కచ్చితంగా నోబెల్ బహుమతి గెలుచుకుంటానని అస్సలు అనుకోలేదని, అస్సలు తాను పరిశోధన చేసిన విషయాన్నే మర్చిపోయానంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు రామ్స్‌డెల్.
ఇక రామ్స్ డెల్‌కి రోగ నిరోధక వ్యవస్థ పనితీరుపై చేసిన ఆవిష్కరణలకు గానూ ఈ నోబెల్ బహుమతి వరించింది. ఈ ప్రతిష్టాత్మక బహుమతిని రామ్స్‌డెల్ సీటెల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయాలజీకి చెందిన మేరీ బ్రంకో, జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయానికి చెందిన షిమోన్ సకాగుచిలతో పంచుకున్నారు. అంటే ఈముగ్గురికి 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (భారత కరెన్సీ ప్రకారం..సుమారు రూ 11కోట్లు పైనే) నగదు లభిస్తుంది.
కాగా రామ్స్‌డెల్ రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించే టీ కణాలకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ ఈ ప్రతిష్టాత్మకమైన బహుమతిని పొందారు. ఇక్కడ టీ కణాలు అనేవి ఎముక మజ్జలో ఉత్పత్తి అయ్యే తెల్ల రక్త కణాలు. ఇది శరీరంపై దాడి చేసే సూక్ష్మ జీవులను గుర్తించడానికి, లేదా కేన్సర్ కణాలను చంపడానికి సహాయపడతాయట.
వాటిని తరుచుగా సెక్యూరిటీ గార్డ్లుగా వ్యవహరిస్తారు పరిశోధకులు. ఇక నోబెల్ కమిటీ సెక్రటరీ పెర్లమాన్ మిగతా ఇద్దరు పరిశోధకులు టచ్‌లో ఉన్నారని, కానీ ఈ 65 ఏళ్ల రామ్స్‌డెల్‌ని సంప్రదించలేకపోయానని చెప్పుకొచ్చారు. ఆయన తన ఫోన్‌ని ఏరోప్లేన్ మోడ్‌లో ఉంచడంతో సంప్రదించడం కష్టమైందని, అందువల్ల ఆయన భార్యకు సమాచారం అందించాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇలా నోబెల్‌బహుమతి గెలుచుకున్న విజేతలను సంప్రదించడంలో ప్రతిసారి తమకు చాలా నిరాశ ఎదురవ్వుతోందని కమిటీ వాపోయింది. గతంలో సంగీతకారుడు బాబ్ డిలన్ విషయంలో రోజుల తరబడి సమయం పట్టిందని, మరొకరు ఈ బహుతిని గెలుచుకున్న రోజుల వ్యవధిలో మరణించారని నోబెల్ కమిటీ వెల్లడించింది.
డిజిటల్ డిటాక్స్ అంటే..
డిజిటల్ పరికరాల (స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, టాబ్లెట్‌లు వంటివి) అన్నింటికి ఉద్దేశపూర్వకంగా విరామం ఇచ్చి..తోటి వ్యక్తులతో, పరిసరాలతో కనెక్ట్ అవ్వడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇది ఒత్తిడిని, నిద్ర సమస్యలను దూరం చేయడమే గాక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట.
(చదవండి: సమోసాలు అమ్మి..పిల్లలను డాక్టర్లుగా చేసిన తండ్రి..! ఏడు సార్లు ఫెయిలైనా..)