
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక నిలయంగా ప్రసిద్ధి చెందిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 2 నుంచి 13 వరకూ ఉద్యాన్ ఉత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన ఈ కార్యక్రమం వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రదర్శన పుష్పాలు, ఇతర ప్రదర్శనలకు వేదిక కానుందని, ఉద్యానవన స్పృహను పెంపొందించేందుకు రాష్ట్రపతి నిలయం పరిపాలనాధికారి రజనిప్రియా శనివారం వెల్లడించారు. మొదటి సారి నిర్వహించే ఈ ఉద్యాన్ ఉత్సవ్ పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు.
సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్, హారీ్టకల్చర్ డోమైన్‌లు ఉంటాయని, ఇందులో 50 స్టాళ్ళతో గ్రాండ్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, గిరిజన ప్రదర్శనలు, వంటకాలు, ఇంటరాక్షన్ సెషన్లు ఉంటాయని తెలిపారు. పలువురు ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థలు, ఎన్‌జీవోలు, ప్రైవేటు కంపనీలు భాగాస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఒడిశ్సా శంఖ్ వదన్ నృత్యం, మధ్యప్రదేశ్ యుద్ధ కళ నృత్యం వంటి ప్రదర్శనలు ఉన్నాయని, సందర్శకులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు.