హీరో సల్మాన్‌ఖాన్‌ సైతం అల్లాడిపోయాడు ఆ వ్యాధితో..! | Trigeminal Neuralgia: What It Is, Causes, Symptoms... | Sakshi
Sakshi News home page

హీరో సల్మాన్‌ఖాన్‌ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్‌ న్యూరాల్జియా..

Jul 6 2025 9:10 AM | Updated on Jul 6 2025 12:07 PM

Trigeminal Neuralgia: What It Is, Causes, Symptoms...

ఇదో నరాలకు సంబంధించిన సమస్య. బాలివుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఈ సమస్యతో బాధపడటంతో ఇటీవల ఇది మరోసారి వార్తల్లోకి వచ్చింది. నరం తాలూకు సమస్య కావడంతో ఒకేచోట మాటిమాటికీ షాక్‌ తగులుతున్నట్టు, కనిపించని పదునైన కత్తితో పదే పదే పొడుస్తున్నట్టు బాధించే సమస్య ఇది. తానెదుర్కొన్న ఇతర వైద్య సమస్యలైన బ్రెయిన్‌ అన్యురిజమ్స్, ఆర్టీరియో వీనస్‌ మాల్‌ఫార్మేషన్ల గురించి చెబుతూనే... తన ఇతర సమస్యలతో పోల్చినప్పుడు ‘‘ట్రైజెమినల్‌ న్యూరాల్జియా అనేది మనిషి అనుభవించే నొప్పులలో అత్యంత చెత్త నొప్పి’’ అంటూ తన బాధను వెల్లడించాడు. మొదట 2007లో ఆ తర్వాత 2011లో ఈ సమస్యతో సతమతమైన అతడు ఇటీవల మళ్లీ తాజాగా ఈ సమస్య తనను బాధించినట్లు వార్తలు వెలువడ్డాయి. మొదట కాస్త అరుదైనదిగా పరిగణించే ఈ వ్యాధి తాలూకు కేసులు మునపటితో పోలిస్తే ఇటీవల  కాస్త ఎక్కువగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ‘ట్రైజెమినల్‌ న్యూరాల్జియా – (టీఎన్‌)’ గురించి తెలుసుకుందాం...

మొదట్లో ట్రైజెమినల్‌ న్యూరాల్జియా బాధ చెంప భాగంలో నొప్పితో మొదలవుతుంది. కొన్ని సెకన్ల పాటు భయంకరంగా వచ్చే ఈ వ్యాధి కొన్ని సెకన్లు మొదలుకొని రెండు నుంచి కొన్ని నిమిషాలు బాధిస్తూ ఉంటుంది. ఓ పదునైన కత్తితో పొడుస్తున్నట్లు, భయంకరంగా షాక్‌ కొడుతున్నట్టు వచ్చే ఈ వ్యాధిలో...  సమయం గడుస్తున్న కొద్దీ బాధించే వ్యవధి పెరుగుతూ పోతూ చాలా భరించలేనంత వేదనాభరితంగా ఉంటుంది. రోజులో 10 నుంచి 15 సార్లవరకూ రావచ్చు. మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు, చల్లటి నీళ్లు తాగేటప్పుడు చాలా బాధాకరమైన రీతిలో బాధిస్తుంటుంది. 

ట్రైజెమినల్‌ న్యూరాల్జియా అంటే... 
మన దేహంలో మెదడు నుంచి వెన్నుపాము నుంచి అన్ని శరీర భాగాలకు నరాలు ఒక నెట్‌వర్క్‌లా వ్యాపించి ఉంటాయి. ఈ నరాల ద్వారానే మెదడు తన అన్ని శరీర భాగాలను నియంత్రిస్తుంటుంది. ముఖాన్నీ, ముఖ భాగాలను నియంత్రించే నరాన్ని ‘ట్రైజెమినల్‌ నర్వ్‌’ అంటారు. 

ఈ నరం నుంచి వచ్చే నొప్పిని ‘ట్రైజెమినల్‌ న్యూరాల్జియా’ అంటారు. మెదడులోని బ్రెయిన్‌ స్టెమ్‌ నుంచి వచ్చే ఈ నరం లోపలి చెవి (ఆడిటరీ కెనాల్‌) పక్క నుంచి వచ్చి ముఖంలోని చెంప దగ్గర మూడు భాగాలుగా విడిపోతుంది. 

ఎందుకీ నొప్పి..? 
కొందరిలో ట్రైజెమినల్‌ నరం పక్కన ఉండే రక్తనాళం మెలిదిరగడంతో అది ‘డీమైలినేషన్‌’ అనే ప్రక్రియకు గురవుతుంది. ప్రతి నరం చుట్టూతా ఉండే మైలిన్‌ అనే పొర దెబ్బతినడాన్ని్న డీమైలినేషన్‌ అంటారు. దాంతో నరం వాచి, ఈ సమస్య వస్తుంది. కొందరిలో హెర్పిస్‌ సింప్లెక్స్‌ అనే వైరస్‌ కారణంగా కూడా నొప్పి వస్తుంది. ఈ వైరస్‌ నరం లోపల ఉన్న గాసేరియన్‌ గాంగ్లియాన్‌ అనే భాగంలో ఈ వైరస్‌ నిద్రాణంగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల ఈ వైరస్‌ ఉత్తేజితం కావడంతో ఈ నొప్పి తీవ్రతరమవుతుంది.  

చికిత్స... దాదాపు 90 శాతం కేసుల్లో మందులతో ఈ వ్యాధి పూర్తిగా నయమవుతుంది. అయితే పది శాతం మందిలో నొప్పి తగ్గిన తర్వాత కూడా మళ్లీ నొప్పి తిరగబెట్టేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు వాడుకలో ఉన్న మందులు (ముఖ్యంగా కార్బమాజిపిన్, ఆక్స్‌కార్టమాజిపిన్, అమైట్రిప్టలిన్, గాబాపెంటిన్, ప్రిగాబాలిన్, బాక్లోఫిన్, వాల్‌ప్రోయేట్‌ వంటి మందులను) సరైన మోతాదులో వాడటం వల్ల దీన్ని పూర్తిగా తగ్గించవచ్చు.

చికిత్స సాధారణంగా కార్బమాజెపైన్‌ వంటి యాంటీకన్వల్సెంట్‌ మందులతో మొదలవుతుంది. మందులు పనిచేయకపోతే లేదా వాటితో తీవ్ర దుష్పరిణామాలు కనిపిస్తే శస్త్రచికిత్స అవసరం పడవచ్చు. మైక్రోవాస్క్యులర్‌ డీకంప్రెషన్‌ అనే పిలిచే ఈ శస్త్రచికిత్సలో నరానికి వెళ్లే రక్తనాళాన్ని మెలితిప్పి వదిలేస్తారు. ఫలితంగా చాలాకాలం పాటు ఉపశమనం పొందవచ్చు. రిస్క్‌ తక్కువగా ఉండే రైజాటమీ, లేదా స్టీరియో టాక్టిక్‌ రేడియోసర్జరీ వంటి చికిత్సల్లో నర్వ్‌ ఫైబర్లను అడ్డుకుని తద్వారా నొప్పిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. 

చివరగా... ట్రెజెమినల్‌ న్యూరాల్జియా నొప్పి కారణంగా జీవిత నాణ్యత (క్వాలిటీ ఆఫ్‌ లైఫ్‌) చాలా తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఈ నొప్పిని తట్టుకోలేక డిప్రెషన్‌కు లోనయ్యే ముప్పు కూడా ఉంటుంది. అందుకే ఆ వ్యక్తికి సంబంధించిన తీవ్రత... మందులతో కలిగే ఉపశమనం వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకుని వ్యక్తిగత చికిత్స ప్రణాళికతో చికిత్స అందించాల్సిన అవసరముంటుంది.

ట్రైజెమినల్‌ న్యూరాల్జియాలాగే అనిపించే ఇతర జబ్బులు

ట్రైజెమినల్‌ ఆటోనామిక్‌ సెఫాలాల్జియా : ఇది ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంటుంది. కన్ను చుట్టూ 
ఉండే భాగంలో నొప్పి ఎక్కువగా. కంట్లో నీళ్లు వస్తుంటాయి. ముక్కు తడి అవుతుంది. నొప్పి చాలామట్టుకు ట్రైజెమినల్‌ న్యూరాల్జియా లాగే ఉండటంతో ఒక్కోసారి అదే అనుకుని పొరబడే అవకాశాలెక్కువ.  

గ్లాసోఫ్యారింజియల్‌ న్యూరాల్జియా : ఈ కండిషన్‌లో ముఖంలో కంటే మెడ పక్క భాగాల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. గుటక వేసేప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది. 

పోస్ట్‌ హెర్పెటిక్‌ ట్రైజెమినల్‌ న్యూరాల్జియా : మొదట ముఖ మీద నీటి పొక్కులాంటివి వచ్చి, అవి ఎండిపోయాక నల్లటి మచ్చలుగా తయారవుతాయి. అవి తగ్గిపోయిన వారం రోజుల తర్వాత విపరీతమైన నొప్పి వస్తుంది. ఇది ఎక్కువగా 50 ఏళ్లు దాటినవారిలో కనిపిస్తుంది. 

డెంటల్‌ కేరిస్‌ : పళ్లు పుచ్చినప్పుడు గాని, పంటి చుట్టూ ఉండే చిగురుకు గాని ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు ముఖంలో నొప్పి వస్తుంది. అయితే ఈ నొప్పి ట్రైజెమినల్‌ న్యూరాల్జియాలా కేవలం కొద్ది సెకన్ల పాటే ఉండకుండా రోజంతా ఉంటుంది ∙ప్రమాదవశాత్తు ముఖానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడుగాని, ముఖంలోని ఎముకలు ఫ్రాక్చర్‌ అయినప్పుడుగాని... గాయాలు మానిన తర్వాత ముఖంలో నొప్పి రావచ్చు. 

గ్లకోమా : కంటికి సంబంధించిన రుగ్మత అయిన గ్లకోమాలో కంటిలోపలి ద్రవపు ఒత్తిడి లెన్స్‌పై పడినప్పుడూ ముఖంలో నొప్పి వస్తుంది.

లక్షణాలు... 
ఇది మొహానికి ఒకవైపే వస్తుంది. ఎక్కువగా చెంప/దవడ భాగంలో వస్తుంది ∙కొన్నిసార్లు కంటి చుట్టూ వస్తుంది ∙నొప్పి చాలా తీవ్రంగా కత్తితో పొడిచినట్లుగా రావడంతో దీన్ని ‘స్టాబింగ్‌ పెయిన్‌’ అని అంటారు 

ఈ నొప్పి కొద్ది సెకన్లు మొదలుకొని ఒకటి రెండు నిమిషాల పాటు రావచ్చు 

రోజులో ఐదు మొదలుకొని 15 లేదా 20 సార్లు రావచ్చు ∙తినేటప్పుడు, నమిలేసమయంలో, మాట్లాడేటప్పుడు ఇది తీవ్రమవుతుంది ∙ఒక్కోసారి ఈ నొప్పి వచ్చినప్పుడు నోటి నుంచి కొద్దిగా లాలాజలం స్రవించవచ్చు 

మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. (అంటే... మహిళలు, పురుషుల్లో 60 : 40 నిష్పత్తిలో కనిపిస్తుంది) 

ముప్పయి ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. 
డాక్టర్‌ జి. రంజిత్‌, సీనియర్‌ న్యూరాలజిస్ట్‌ –స్ట్రోక్‌ ఇంటర్వెన్షనిస్ట్‌ 

(చదవండి: కపిల్‌ శర్మ వెయిట్‌ లాస్‌​ స్టోరీ..! రెండు నెలల్లో 11 కిలోలు..! ఏంటి 21. 21. 21 రూల్‌..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement